
ఆమా, ఈఫీ, జోయ్స్, సిసీ– ఆఫ్రికన్ యువతులు. బెల్జియమ్‌లో ఉన్న అంట్వెర్ప్– ‘బ్లాక్ సిస్టర్స్ స్ట్రీట్’లో, ఒక అపార్ట్ట్‌మెంట్‌లో ఉండి వ్యభిచారం చేస్తుంటారు. ‘వారిలో ముగ్గురు, తమ శరీరాలని కిటికీల్లోంచి ప్రదర్శించడం కోసం తయారవుతుండగా’ నవల ప్రారంభం అవుతుంది. వారితోపాటుండే సిసీ కనబడకుండా పోతుంది. ఆమా, తన 8 ఏళ్ళ వయస్సునుండీ పాస్టరైన సవతి తండ్రి బలాత్కారానికి గురవుతూ వచ్చినది. ఈఫీ 16 ఏళ్ళప్పుడే గర్భవతి అయినది. జోయ్స్ చిన్నపిల్లగా ఉన్నప్పుడు జాంజావీడ్ సైనికులు ఆమెను మానభంగం చేస్తారు. ‘ఆన్ బ్లాక్ సిస్టర్స్ స్ట్రీట్’ నవల్లో ఉన్న ప్రతి అధ్యాయం, ఒక యువతి కథే అయినా ప్రధాన భాగం– సిసీ మీదే కేంద్రీకరించినది. ‘పుస్తకాలు పట్టుకో. అప్పుడు ఆకాశమే నీ ఎల్ల’ అంటూ విద్యకున్న ప్రాముఖ్యతను తల్లిదండ్రులు ఆమెకు నేర్పిస్తారు. బిజినెస్ డిగ్రీ ఉండి కూడా ఉద్యోగం దొరకదు. తన ‘జీవితాన్ని కడిగేసే రంగురంగుల ప్రవచనం’ ఎక్కడుందో కనుక్కోలేకపోతుంది సిసీ. ‘చీలమండ ద్వారా జీవితాన్ని దొరకబుచ్చుకుని, దాని ముఖం మీద వెక్కిరించడానికి’ అంట్వెర్ప్‌లో ‘విండో గర్ల్’గా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని వస్తుంది.
వీరందరినీ బెల్జియమ్ తెచ్చిన డెలె డబ్బున్నవాడు, నిర్దయుడు. ప్రతి యువతి మీదా 30,000 యూరోలు ఖర్చుపెడతాడు. విటులని సంతోషపెడ్తూ, వారా డబ్బుని వాయిదాల మీద చెల్లించాలి. వారి నకిలీ పాస్‌పోర్టులను తన వద్దే పెట్టుకుంటాడు అతను. యువతులు ‘మాడమ్’ సంరక్షణలో ఉంటారు. ‘బంగారం రంగు నైలాన్ స్కర్ట్ తొడుక్కుని వేశ్యలా కనిపించు’ అని మాడమ్ సిసీకి చెప్తుంది. మొదటి క్లయింట్ టాయ్‌లెట్లో ఎదురుపడ్డప్పుడు, ఆమె పడిన బాధను రచయిత్రి చికా ఉనిగ్వే వర్ణిస్తారు: ‘సిసీ తన్ని తానే కన్నీళ్ళతో బాప్టిజం చేసుకుంది. అవి కమిలి, వేడిగా ఆమె చెంపలమీదగా కారాయి. నోటికి ఉప్పగా అనిపించాయి’. బెల్జియమ్‌లో, మొదటి రోజు జామ్ తింటూ, రాణిననుకున్న సిసీ, ‘ఇంక అద్దంలో నన్ను నేను చూసుకోలేను’ అనే దశకి వస్తుంది. ఆమె– లుక్ అనే బెల్జియన్ బ్యాంకర్‌ని కలుసుకుంటుంది. వేశ్యాగృహం నుండి బయటపడే మార్గం చెప్తానంటాడతను. అపార్టుమెంటు నుండి పారిపోయి, డెలెకి చెల్లించే డబ్బు ఆపేసి, లుక్‌తో కొత్త జీవితం మొదలు పెడదామనుకున్న సిసీ నిర్ణయం ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఆమె లుక్ ఇంటికి వెళ్ళినప్పుడు, అతను ఇంట్లో ఉండడు. తాముండే అపార్టుమెంట్లోనే ‘మాడమ్’తో పాటుండే ‘సెగెన్’ కనిపిస్తాడక్కడ. అతను సిసీ తలను సుత్తితో పగలగొడతాడు. ఆ హత్య చేయించినది డెలెయే.
ఆ తరువాత, సిసీ గురించి విచారపడుతూ, అపార్టుమెంటును తప్ప తమ అనుభూతులను/అనుభవాలను మిగతావారితో పంచుకోని తక్కిన ముగ్గురూ, తమ తమ వివరాలను చెప్పుకుంటారు. ఉనిగ్వే ప్రతీ కథనాన్నీ స్వల్పభేదంతో చూపుతారు. లైంగిక దాడుల బాధితురాళ్ళే వేశ్యలుగా మారడానికి ప్రధాన అభ్యర్థులు అన్న సంగతిని యీ కథ నొక్కి చెప్తుంది. పుస్తకంలో–ఇంగ్లిష్‌తో ఇగ్బో భాష (నైజీరియాలోని ఇగ్బో ప్రజలు మాట్లాడే భాష) కలిసిన కొన్ని వాక్యాలు అనువదించబడినప్పటికీ, భాష ప్రధానంగా– పాత్రలు మాట్లాడే చిట్టిపొట్టి ఇంగ్లిష్ పదాలతోనే ఉంటుంది. యీ చీకటి లోకపు యువతులు సమర్థులూ, తెలివైనవారుగానూ, పురుషులు– తాగుబోతులూ, హంతకులూ, రేపిస్టులూ, బలహీనమైనవారుగానూ చిత్రిస్తారు రచయిత్రి. లైంగిక అత్యాచారాల య«థార్థం గురించిన కాల్పనిక కథ ఇది. వ్యభిచార వృత్తి వివరాలుంటాయి. ఆఫ్రికన్ యువతులు యూరప్‌లో వేశ్యావృత్తిలోకి దిగే కారణాల గురించి విశదంగా రాస్తారు ఉనిగ్వే. సెక్స్ పరిశ్రమ గురించిన కథనం హాస్యంతో కూడినది. డచ్ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించబడిన ఈ నవలని, రాండమ్ హౌస్ 2011లో ప్రచురించింది.
కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment