చాక్లెట్ పాప... | Chocolate baby ... | Sakshi
Sakshi News home page

చాక్లెట్ పాప...

Published Fri, Jan 24 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

Chocolate baby ...

టెన్నిస్ అంటేనే అందం...అందులోనూ షరపోవా అంటే అందానికి ప్రతిరూపం...మరి అలాంటి గ్లామర్ క్వీన్ కొత్తగా వ్యాపారం చేయాలంటే... ఆ ఆలోచన కూడా ఆమె అంత అందంగా, ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే ఆమె అందరికంటే భిన్నంగా, కొత్త తరహాలో బిజినెస్ చేస్తోంది. తనకెంతో ఇష్టమైన చాక్లెట్లు, క్యాండీల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు టెన్నిస్ ప్రపంచం అంతా షరపోవా పంచుతున్న తీపి గురించే చర్చ జరుగుతోంది.
 
షుగర్‌పోవా...
 
‘నాకు చిన్నప్పటినుంచి చాక్లెట్లంటే అమిత ఇష్టం. ఎన్ని తిన్నా తనివి తీరకపోయేది. టెన్నిస్ కోర్టులో ప్రాక్టీస్ పూర్తి కాగానే మమ్మీ లాలీపాప్‌తో సిద్ధంగా లేకపోతే ఏడ్చేసేదాన్ని. వయసు పెరిగినా, ఆటలో ఉన్నా క్యాండీలు చప్పరిస్తూనే ఉంటాను. నాకిష్టమైనదాన్నే అందరితో పంచుకోవాలని క్యాండీలు అమ్ముతున్నానోచ్’...అంటూ ఈ రష్యా బ్యూటీ ప్రకటించింది. మరి తనకు ఇష్టమైన వ్యాపారానికి బ్రాండింగ్ చేయాలంటే ఒక కొత్త పేరు కావాలి కదా...తనంటే ఇష్టపడే వారు లొట్టలేసుకుంటూ తింటుంటే తాను గుర్తుకు రావాలి కదా. అందుకే తీపిని, షరపోవాను కలిపి షుగర్‌పోవా చేసేసింది. అవును ఆమె క్యాండీలు, చాక్లెట్ల బ్రాండ్ పేరు షుగర్‌పోవా. అభిమానులకు ఓ తీపి ముద్దు ఇస్తున్నట్లు ఉండే పెదాల ముద్రే ఈ బ్రాండ్‌కు లోగో కావడం విశేషం.
 
 షుగర్‌పోవా కోసం పెట్టిన పెట్టుబడి 3 లక్షల పౌండ్లు
     
 ఒక్క ఏడాదిలోనే 20 లక్షలకు పైగా షుగర్‌పోవా క్యాండీ బ్యాగ్‌లు అమ్ముడుపోయాయి.
     
 స్మిటెన్ సోర్, క్వార్కీ, స్ప్లాషీ, స్పోర్టీ తదితర పేర్లతో 12 రకాల ఫ్లేవర్స్ ఇందులో ఉన్నాయి. ఇంద్రధనుస్సులోని అన్ని రంగులతో ఉండే క్వార్కీ ఫ్లేవర్ షరపోవాకు అత్యంత ఇష్టమైంది.  
     
 ప్రస్తుతం సొంత దేశం రష్యాతో పాటు అమెరికా, కెనడాలలో ఈ క్యాండీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటీవలే గల్ఫ్‌లో కూడా అడుగు పెట్టిన షుగర్‌పోవా త్వరలోనే ఆస్ట్రేలియా, భారత్‌లలో అందుబాటులోకి రానుంది.
     
 గత ఏడాది యూఎస్ ఓపెన్ పోటీల్లో షుగర్‌పోవా పేరుతో బరిలోకి దిగాలని కూడా రష్యా భామ భావించింది. టోర్నీ కాగానే అసలు పేరును మార్చుకునేందుకు వీలుగా ఫ్లోరిడా సుప్రీంకోర్టుకు కూడా దరఖాస్తు చేసింది కూడా. అయితే ఇతర టోర్నీల్లో సమస్య వచ్చే అవకాశం ఉండటంతో ఆఖరి నిమిషంలో ఆలోచన విరమించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement