
విజయనగరం జిల్లా బలిజిపేట మండలం సువర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో నారాయణపురం గ్రామంలో నిర్మితమైన చాతుర్లింగేశ్వర దేవాలయం చారిత్రక ప్రసిద్ధి గాంచిన సుప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. 11వ శతాబ్దం నాటి అపురూప శిల్పకళా నైపుణ్యంతో, అందమైన రాతికట్టడాలతో నిర్మించారు. శ్రీ నీలకంఠేశ్వర, సంగమేశ్వర, మల్లికార్జున, శ్రీ నీలేశ్వర ఆలయాలు ఒకేచోట కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకతలు. ఆలయ రాతిస్తంభాలపై ఉండే శాసనాలు, ఆలయాలపై ఉండే శిల్పాలు ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి.
తూర్పుగాంగులలో ముఖ్యుడు అనంతవర్మ చోడగంగదేవుడు. ఇతడు క్రీ.శ.1077వ సంవత్సరం నుండి 1147వరకు పరిపాలించాడు. ఆ కాలంలోనే ఈ చాతుర్లింగ ఆలయాల నిర్మాణం జరిపినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయం
చాతుర్లింగ శివాలయాలలో అత్యంత ప్రధానమైనది శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయం. దీని ఎత్తు 31 అడుగులు. ఒరిస్సాలో పరశురామేశ్వర ఆలయ శిఖరాన్ని పోలి ఉండడం విశేషం. గర్భగుడి ద్వారం పైన నవగ్రహాలు, పై భాగాన గజలక్ష్మి విగ్రహం కనువిందు చేస్తాయి. గర్భగుడికి ముందు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మండపం లోపల ఒక్కొక్క వరుసలో నాలుగు స్తంభాల వంతున రెండు వరుసలు ఉంటాయి. ఈ స్తంభాలపై చారిత్రక, పురాణ ఘట్టాల శిల్ప, చిత్రాలతో మండపం అద్భుతమనిపిస్తుంది. ఈ స్తంభాలపై సుమారు 40 శాసనాలు ఉన్నాయి. మండపం పైకప్పు అనేక రాతి పలకలతో అమర్చి ఉంది. గర్భగుడిలో నునుపు తేలిన శివలింగం, పానవట్టం ఎంతో పవిత్రంగా దర్శనమిస్తాయి.
సంగమేశ్వర ఆలయం
ఇది నీలకంఠేశ్వర ఆలయానికి ఉత్తరభాగాన దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీని నిర్మాణం కళింగ దేవాలయాల పద్ధతిలో ఒకటైన ఖాఖారా ఆలయనిర్మాణ శైలికి చెందినది.
మల్లికార్జునాలయం
నీలకంఠేశ్వరాలయానికి ఉత్తరభాగంలో ఈ ఆలయం ఉంది. గర్భగృహద్వారం చిత్రలేఖనాలతో అలంకరించిన నవగ్రహాలున్నాయి. ద్వారానికి ఇరువైపులా గంగ, యమున విగ్రహాలు కనిపిస్తాయి. గోడ పై భాగాన గల అరలలో మహిషాసుర మర్దని, ఏకపాదమూర్తి, కార్తికేయ, అర్ధనారీశ్వరుడు, గణేశ, గంగాధరమూర్తి విగ్రహాలు ఉన్నాయి.
నాలేశ్వరాలయం
ఇది నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి దక్షిణభాగంలో ఉన్న చతురస్రాకార గర్భాలయం. పదహారున్నర అడుగుల ఎత్తు కలిగిన ఆలయం. ఆలయ శిఖరం ఉత్కల్(ఒరిస్సా) శిల్ప సాంప్రదాయంతో అర్ధచంద్రాకార రేఖలు కలిసినట్టు ఉంటుంది. ఈ ఆలయం మిగిలిన మూడు ఆలయాలను పోలి ఉండటం విశేషం.
శాసనాలు
నీలకంఠేశ్వరస్వామి ఆలయం ముఖమండపంలోని రాతిస్తంభాలపై క్రీ.శ.1102–1251ల మధ్యకాలం నాటి 53 శిలాశాసనాలు దేవనాగరి లిపిలో ఉన్నాయి.
కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు
నిత్యధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతున్న ఈ చాతుర్లింగేశ్వర ఆలయం కార్తీక మాసం నెలరోజులూ ప్రత్యేకపూజలు జరుగుతాయి. ఇక్కడికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో గళావెల్లి తామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది కూడా 11వ శతాబ్దానికి చెందిన ఆలయం. భక్తులు ఈ ఆలయాన్నీ సందర్శిస్తుంటారు.
ఎలా రావాలంటే: విశాఖ, విజయనగరం, పార్వతీపురం నుండి వచ్చేవారు బొబ్బిలి చేరుకుని అక్కడనుండి నేరుగా నారాయణపురం బస్సులో చేరుకోవచ్చు. బలిజిపేట బస్సు ఎక్కితే బలిజిపేటలో దిగి అక్కడ నుండి ఆటో వంటి ద్వారా 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న నారాయణపురం చేరుకోవచ్చు. శ్రీకాకుళం వైపు నుండి వచ్చేవారు రాజాం మీదుగా పణుకువలస జంక్షన్ నుండి తిరిగి వంతరాం, బలిజిపేట మీదుగా నారాయణపురం చేరుకోవచ్చు. రాజాం నుండి బస్సులో వచ్చేవారు బలిజిపేటలో దిగి నారాయణపురం చేరుకోవచ్చు.
– బోణం గణేష్, సాక్షిప్రతినిధి, విజయనగరం
– ఫొటోలు: కొడుకుల వేణుగోపాలరావు, బలిజిపేట