మేఘాలలో తేలిపొమ్మన్నది
పక్షుల లాగా గాలిలో ఎగురుతూ.. అందీ అందకుండా ఉండే మేఘాలను అందిపుచ్చుకున్న అనుభూతి పొందుతూ... ఊయల లేకుండానే వినీలాకాశంలో ఉయ్యాల జంపాల అంటూ ఊగిపోతే..! ఆ మజాయే వేరు కదా! టర్కీ లోని కప్పడోసియా ప్రాంతంలో ‘హాట్ ఎయిర్ బెలూన్’ విహారం ఆ సరదా తీరుస్తుంది. చారిత్రక పర్యాటక ప్రదేశంగా పేరుపొందిన కప్పడోసియాలో ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు సూర్యోదయం వేళ డజన్ల కొద్దీ బెలూన్‌లు గాలిలోకి లేస్తాయి. వాటిలో పర్యాటకులు కేరింతలు కొడుతూ విహరిస్తూ ఉంటారు.
సుమారు 200 ఏళ్ల క్రితం అనేక ప్రయోగాల ఫలితంగా ఇలా బెలూన్ సాయంతో గాలిలో విహారం సాధ్యమైంది. ఫ్రాన్స్ దేశస్థులైన జోసెఫ్, ఎటెన్నే మాంట్‌గోలిఫైర్ అనే అన్నదమ్ములిద్దరూ ఈ హాట్ ఎయిర్ బెలూన్‌కు ఆద్యులు. బాల్యం నుంచీ రెక్కలు కట్టుకొని గాలిలో ఎగరడానికి ఈ అన్నదమ్ములిద్దరూ నిత్యం ఉత్సాహం చూపేవారట. పెరిగి పెద్దయ్యాక పేపర్ తయారీ వ్యాపారం మొదలుపెట్టినా, గాలిలో విహరించాలనే ఆసక్తి వారి మస్తిష్కం నుంచి పోలేదు.
రకరకాల ప్రయోగాలు చేసి, మంటలకు కాలిపోని పేపర్‌ను తయారుచేసి గాల్లోకి ఎగరవేసేవారట. ఎన్నో ప్రయోగాల తర్వాత ఈ పేపర్‌తోనే బెలూన్‌ను తయారుచేసి, నిండా గ్యాస్, హీలియం వాయువు నింపి, యంత్రం సాయంతో వేడిని పెంచుతూ, గాలిలో ఎగిరేలా చేశారు. ఈ అన్నదమ్ముల కృషి ఫలితంగా 1783 జూన్ 5న తొలిసారి ఫ్రాన్స్‌లో వేడిగాలితో నిండిన బెలూన్ గాలిలోకి ఎగిరింది. ఆ సమయంలో పంది, బాతులను బెలూన్‌తో పాటు పంపించారట. ఆ తర్వాత ఏడాది సెంటర్ ప్యారిస్‌లో మనిషి డ్రైవ్ చేస్తుండగా బెలూన్ గాలిలోకి ఎగిరింది. 1999లో 19 రోజుల 21 గంటల పాటు గగనవీధుల్లో హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరవేసి రికార్డ్ సృష్టించారు. అన్ని దేశాల్లో హాట్ ఎయిర్ బెలూన్ పరిచయమైనప్పటికీ కప్పడోసియా విశాల మైదానాలు వీటికి ప్రధాన వేదికలయ్యాయి. 50 ఏళ్లుగా హాట్ ఎయిర్ బెలూన్ల పట్ల జనాల్లో మరీ ఆసక్తి పెరగడంతో ప్రముఖ కంపెనీలు ఈ బెల్లూన్ల తయారీని చేపడుతున్నాయి.
ఈ వేసవిలో టర్కీ యాత్రకు వెళితే గాలిలో విహరించాలనుకునే పర్యాటకులు అక్కడ సందర్శన ప్రాంతాలతోపాటు తప్పక వెళ్లాల్సిన ప్రాంతం కప్పడోసియా.