కంట్రోల్... కంట్రోల్...
హిట్ క్యారెక్టర్
రైటర్‌గా వచ్చి కమెడియన్‌గా స్థిరపడినవాడు ఎమ్మెస్ నారాయణ.
టైమింగ్ విషయంలో చితగ్గొట్టేస్తాడు.
ఎక్కడ ఏ పంచ్ పడాలో, ఏ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలో... ఆయనకు కొట్టిన పిండి.
అది మామూలు పిండి కాదు... మైదా పిండి.
అందుకే మన గుండెలమీద కామెడీ వాల్‌పోస్టర్‌లాగా అతుక్కుపోయాడు ఎమ్మెస్.
అందరూ ఫ్యాక్షనిజమ్‌లో హీరోయిజమ్ చూపిస్తే... ఎమ్మెస్ ఏమో ఫ్యాక్షనిజమ్‌లోకామెడీయిజమ్ పండించాడు. ఒట్టేసి చెప్పినా... చెప్పకున్నా ఈ సినిమాలో ‘రేనా’ పాత్ర అది‘రేన్’!
సినిమా పేరు : ఒట్టేసి చెపుతున్నా (2003)
డెరైక్ట్ చేసింది : ఇ. సత్తిబాబు
సినిమా తీసింది : కె. అనిల్ కుమార్
మాటలు రాసింది : చింతపల్లి రమణ
రేనా అంటే ఓ మంచి పనోడు. ఆ కాలనీలో ఎవర్నడిగినా ఇదే చెబుతారు. రేనా గురించి హైదరాబాద్‌లో ఏదైనా సాంస్కృతిక సంస్థకు తెలిస్తే పిలిచి మరీ సన్మానం చేసేస్తారు. ఎందుకంటే రేనా పని చేసేది ‘రూల్స్ రంగారావు’ దగ్గర.అన్నీ రూల్స్ ప్రకారం జరగాలనే తలతిక్క మనిషి రంగారావు. కూచుంటే రూలు. నిలబడితే రూలు. పడుకుంటే రూలు. పడుకోకుంటే రూలు. లేకపోతే రూళ్ల కర్రతో కొట్టినంత పని చేస్తాడు. అలాంటి వాడి దగ్గర రేనా వంచిన తల ఎత్తకుండా, నోరు మెదపకుండా పని చేస్తున్నాడు. అయినా ఎప్పుడూ ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూనే ఉంటాడు. రేనా లీవ్ పెట్టి ఊరెళ్లి వచ్చాడు. అంతే రూల్స్ రంగారావు గుమ్మంలోనే ఆపేసి కయ్‌మంటూ అరిచాడు. గోడకుర్చీ వేయమంటూ హుకుం జారీ చేశాడు.
‘‘నేను లీవ్ పెట్టింది... పని ఎగ్గొట్టడం కోసం కాదు. చిదంబరంలో కొలువైన మా వంశ మూల విరాట్‌ని దర్శించుకోవడం కోసం’’ అంటూ రేనా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయినా రంగారావు తగ్గలేదు. ‘‘నువ్వే ఒక బెల్లంకొట్టిన రాయివి. ఆ రాయి దగ్గరకెళ్లి నువ్వేం మొక్కుకుంటావ్? రెండు వేలు వేస్ట్ చేసి అంత దూరం వెళ్లావ్. ఆ కొబ్బరి కాయేదో ఇక్కడే కొట్టేస్తే పచ్చడికైనా పనికొచ్చేది’’ అని క్లాస్ పీకాడు రంగారావు.
రేనాకు కోపం వస్తోంది. కానీ కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.
‘‘అది మా వంశ సంప్రదాయం’’ అని ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు రేనా.
‘‘నీదొక వంశం... దానికో సంప్రదాయం’’ అంటూ రంగారావు చులకనగా మాట్లాడాడు.
రేనా మొహంలో రంగులు మారుతున్నాయి. నరాలు ఆవేశంతో బుసాబుసా ఉప్పొంగుతున్నాయి.
‘‘అయ్‌గారు... నన్నేమన్నా అనండి. నా వంశాన్ని మాత్రం ఏమీ అనొద్దు’’ అని ఫైనల్‌గా చెప్పేశాడు రేనా.
రంగారావు ఒక్క ఉదుటున ముందుకుదూకి ‘‘ఏం చేస్తావురా? చంపుతావా? నరుకుతావా?’’ అని రేనా చొక్కా పట్టుకున్నాడు. అయినా రేనా కంట్రోల్‌గానే ఉన్నాడు. ‘‘ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? అని కన్‌ఫ్యూజ్ చేయకండి. ఏదో ఒకటి చేసెయ్యగలను’’ అని చెబుతూ తన చేతులతో చెంపలను గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ‘కంట్రోల్.. కంట్రోల్’ అంటూ తనకు తానే కమాండ్స్ ఇచ్చుకున్నాడు. ‘‘ఏంట్రా సౌండు?’’ అంటూ గద్దించాడు రంగారావు. ‘‘జేబులో జంతికలు నలిపా... తినడానికి ఈజీగా ఉంటాయని’’ అనేసి అక్కడ్నుంచీ కామ్‌గా వెళ్లిపోయాడు రేనా.
రూల్స్ రంగారావు ఇలా ఎంత ఇరిటేట్ చేసినా రేనా పాపం తనకు తానే ‘కంట్రోల్... కంట్రోల్’ అని చెప్పుకుంటున్నాడు. ఆ టైమ్‌లో రేనా తీరు చూస్తుంటే, అతను ఏ మాత్రం కంట్రోల్ తప్పినా పాశర్లపూడి బ్లో అవుట్‌లాగా ఏదో జరుగుతుందనే అనిపిస్తోంది.
ప్రతి డాగ్‌కీ ఓ టైమొస్తుంది. డాగ్‌కే టైమొచ్చినపుడు... రేనాకు రాదంటారా!? వచ్చేసిందోచ్...
ఓ పేద్ద డిపార్ట్‌మెంటల్ స్టోర్స్. రూల్స్ రంగారావు ఏవో సరుకులు కొంటుంటే, రేనా అతని వెనుకే సంచీతో నిలబడ్డాడు. ‘‘అయ్‌గారూ... ఈ నెత్తురు బాటిల్ కొనండి. ఎప్పుడైనా పనికొస్తుంది’’ అని ఓ సాస్ బాటిల్ చూపించాడు రేనా. రంగారావు ఇంతెత్తున లేచి ‘‘ఒరేయ్ తలకుమాసిన వెధవా... మాట్లాడితే నెత్తురంటావ్... బాంబులంటావ్... నీ జీవితంలో ఎప్పుడైనా కత్తి పట్టుకున్నావురా?’’ అని తిట్టాడు.
పరమశివుడు గరళాన్ని తన గొంతులోనే దాచేసుకున్నట్టుగా, పాపం రేనా తన కోపాన్నంతా తనలోనే అణిచేసుకుంటున్నాడు.
సరిగ్గా అదే టైమ్‌లో ఓ ప్రేమ జంట పరిగెత్తుకుంటూ ఈ స్టోర్స్‌లోకి వచ్చి, అక్కడ రేనాను చూసి షాకైపోయింది. ‘‘రెడ్డి నాయుడు గారూ... మీరా?’’ అని ఆశ్చర్యపోతూ రేనాకు పాదాభివందనం చేసేశారు. ఏ నిజమైతే ప్రపంచానికి తెలియకూడదని రేనా ఇన్నాళ్లూ కంట్రోల్డ్‌గా ఉన్నాడో, ఆ నిజం బ్లాస్ట్ అయిపోయింది.
ఆ ప్రేమజంటను వెతుక్కుంటూ రాయలసీమలో ఫేమస్ ఫ్యాక్షనిస్ట్ వీరవంకర్‌రెడ్డి అండ్ కో వచ్చారు. రేనా ధైర్యంగా వీరవంకర్‌రెడ్డితో తలపడ్డాడు. ‘‘నీకు దమ్ముంటే మా పబ్లిక్ సెంటర్లోకి రా... చూసుకుందాం... నీ పెతాపమో... నా పెతాపమో...’’ అని హూంకరించాడు వీరవంకర్‌రెడ్డి. రేనా కూడా ఏ మాత్రం తగ్గలేదు.‘‘వస్తాన్రా... సీమ సందుల్లో సీమ పందుల్లా కొట్టుకుందాం’’ అని గర్జించాడు. ‘‘నీ అంతు చూస్తాన్రా’’ అంటూ వీరవంకర్‌రెడ్డి అండ్ కో పలాయనం చిత్తగించారు. ఆ గ్యాంగ్‌లో రేనాకు కరడు గట్టిన ఓ వీరాభిమాని ఉన్నాడు. అతను రేనా దగ్గరకొచ్చి ‘‘అన్నా... ఓసారి తొడగొట్టన్నా’’ అని విపరీతంగా బతిమిలాడాడు. ‘‘వద్దురా... కొంచెం వీగ్గా ఉంది’’ అన్నాడు రేనా. అక్కడే ఉన్న రూల్స్ రంగారావు ‘‘సోడా కొట్టమంటే కొడతాడు కానీ, తొడ కొట్టలేడులే’’ అని ఎకసెక్కమాడాడు. దాంతో రేనా అభిమానికి కోపం పొడుచుకొచ్చింది. ‘‘అసలు ఈ రేనా ఎవరో ఫ్లాష్‌బ్యాక్ తెలుసా మీకు?’’ అని చెప్పడం మొదలుపెట్టాడు.
ఎవరి పేరు చెబితే సీమ ప్రజలు చిరాకు పడతారో...
ఎవరి పేరు చెబితే శత్రువులు ఏ టెన్షనూ లేకుండా హాయిగా నిద్రపోతారో...
ఎవరిని చూస్తే పసిపిల్లలు ఏడుపాపేసి హాయిగా పాలు తాగుతారో...
అతనే ఈ రెడ్డి నాయుడు. షార్ట్ కట్‌లో ముద్దుగా ‘రేనా’ అని పిలుచుకుంటుంటారు.
రేనా అంటే రాయలసీమలో తెలీనివాడు లేడు. ఆ చెట్టుకీ తెలుసు. ఆ పుట్టకీ తెలుసు. చివరకు ఆ కాకి రెట్టకూ తెలుసు. ఓ కాకి తనపై రెట్ట వేసి షర్టు ఖరాబు చేసిందని రేనా గన్‌తో సింగిల్ షాట్‌లో కాల్చిపారేశాడు కాకిని. ఆ దూకుడు చూసి రేనా తల్లి కకావికలమై పోయింది. రెట్ట వేసిందని కాకినే కడతేర్చినవాడు, రేపు ఈ సీమను వల్లకాడు చేసేస్తాడని తెగ భయపడిపోయింది.
‘‘పచ్చగా ఉన్న ఈ సీమ నీ వల్ల రక్తంతో ఎర్రగా మారడానికి వీల్లేదు. మర్యాదగా సీమను వదిలేసి వెళ్లిపో’’ అని ఆదేశించింది.
తల్లి మాటకు బద్ధుడై రేనా అస్త్రసన్యాసం చేసి కట్టు బట్టలతో నగరవాసానికి బయలుదేరి వెళ్లిపోయాడు. ఇలా ఓ పనివాడిగా అజ్ఞాతవాసంలో బతుకుతున్నాడు. ఇదండీ రేనా ప్లాష్‌బ్యాక్. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’, ‘ఆది’... ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలను మించే విధంగా ఉంది కదూ రేనా ఫ్లాష్‌బ్యాక్.
ఈ రేనా స్టోరీ అంతా విన్నాక మీకేమర్థమైంది?
మీరేం తెలుసుకున్నారు?
మీక్కూడా ఓ పనివాడు ఉండే ఉంటాడు.
ఆ పనివాడికీ ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉండే ఉంటుంది.
వాడు రేనా కన్నా పవర్‌ఫుల్ అయ్యుండొచ్చు.
ఓసారి ‘చెక్’ చేయండి.
వీలైతే ‘డీడీ’ కూడా చేయండి.
- పులగం చిన్నారాయణ
అన్నీ మిక్స్ చేస్తే వచ్చిందే... ‘రేనా’ పాత్ర
‘‘దర్శకుడు ఇ. సత్తిబాబులో మంచి కామెడీ టింజ్ ఉంది. ఈ సినిమా స్టోరీ సిట్టింగ్స్‌లో... ఏదైనా పాపులర్ ఫ్యాక్షన్ సినిమాకు పేరడీగా ఓ కామెడీ కేరెక్టర్ సృష్టిద్దామని ఐడియా చెప్పారు. కథా రచయిత ఉదయ్‌రాజ్ కూడా మంచి ఆలోచనని సపోర్ట్ చేశారు. ఇలా ఒక సినిమాకే పరిమితం కాకుండా, రకరకాల ఫ్యాక్షన్ సినిమాలన్నీ కలగలిపి ఓ పాత్ర చేస్తే ఇంకా బావుంటుందని నేను సలహా ఇచ్చాను. వాళ్లు ప్రొసీడ్ అన్నారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, బాషా... ఇలా అన్నీ ఓ మిక్సీలో వేస్తే ఫైనల్‌గా వచ్చిన ప్రొడక్టే ఈ రెడ్డినాయుడు పాత్ర. ఈ పేరు కూడా సత్తిబాబే పెట్టారు. ఎమ్మెస్ నారాయణ చేయడం వల్ల, ఆయన కామెడీ టైమింగ్ వల్ల ఈ పాత్ర బాగా పేలింది. మొదట్లో ఈ సినిమా యావరేజ్ అన్నారు. ఎమ్మెస్ కామెడీ ట్రాక్ గురించి ప్రచారం చేశాక సినిమా సూపర్‌హిట్ స్థాయికి వెళ్లిపోయింది.’’
- చింతపల్లి రమణ, మాటల రచయిత