వంటొచ్చిన మొగుడు | cooking husband | Sakshi
Sakshi News home page

వంటొచ్చిన మొగుడు

Published Sun, Jun 11 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

వంటొచ్చిన మొగుడు

వంటొచ్చిన మొగుడు

సమ్‌సారం
సంసారంలో సినిమా


అదేంటో నేను కిచెన్‌లోకి అడుగు పెడితే చాలు మా ఆవిడ చిరాకుతో కూడుకున్న  ప్రేమతో నా మీదకు దూసుకొచ్చేస్తుంది.‘వంటింట్లోకి రావద్దని నాలుగేళ్ళుగా చెప్తున్నా వినరే... ’ కోపంగా ముఖం పెడుతుంది.మా షాదీ అయి ఇప్పటికి నాలుగేళ్ళన్న మాట. ‘ఎందుకు బేగం? నన్ను కిచెన్‌ చూడనివ్వొద్దని మీ అమ్మ దగ్గర ఒట్టు పెట్టావా ఏంటి?’ అన్నాను.‘అవును... పెట్టాను’ అని కిచెన్‌లో నుంచి తోసినంత పని చేసింది.నాకు చిన్నప్పట్నించి అమ్మతో, అక్కతో వంటల దగ్గర కూర్చోవటం అలవాటు. అలా అలా వంట చెయ్యటం కూడా వచ్చేసింది. ‘నలభీములు నీ రూపంలో జన్మెత్తారేమో... నిన్ను చేసుకునే పిల్ల బాగా సుఖ పడుతుందిరా మనవడా..’ అని మా అమ్మమ్మ చాలాసార్లు అనేది. కానీ నా పెళ్ళానికి మాత్రం నా చేతివంట తినే ప్రాప్తం లేదు. నేను వంట గదిలోకి వచ్చినా వంట చేస్తానన్నా అస్సలు ఒప్పుకోదు. వంట గదిలోకి వచ్చానంటే ఇన్‌సెక్యూర్‌ అయిపోతుంది.

కాని ఏం చెయ్యను?
ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద గొట్టంతో సుయ్యి సుయ్యిమని ఊదుకుంటూ వంట చేసేవాళ్ళం. రోకట్లో అక్క, నేను టమాట తొక్కు, గోంగూర తొక్కులు కమ్మగా నూరేవాళ్ళం. ఆ తర్వాత వంట మాస్టర్‌ వహీద్‌ వెంట పెళ్ళిళ్ళకని పేరంటాలకని అసిస్టెంటుగా వెళ్లి అక్కడ చికెన్, మటన్, కద్దూ కి ఖీర్, డబల్‌ కా మీఠా, దాల్చా, బగార ఖానా, బిర్యానీ... వండటం నేర్చుకున్నాను. చదువు కోసం హైదరాబాదు వచ్చాక బ్యాచిలర్‌గా రూంలో వంట చేస్కొని తినటం వల్ల నా ఎవ్రీ మూమెంట్లో వంట ఒక భాగమైపోయింది. నా ఫ్రెండ్స్‌ చాలా మంది వంట చెయ్యటం రాక హోటల్లో తిందామనేవాళ్ళు. నేను మాత్రం హోటల్‌ ఫుడ్డుకి ఫర్లాంగుల దూరముండేవాణ్ణి. పొద్దస్తమానం ఎంత పనున్నా అలిసిపోయినా ఫ్రెష్‌ అయి వంట చేసి రీఫ్రెష్‌ అవడం నాకు అలవాటుగా ఉండేది.

స్వయంపాక ప్రహసనంలో ఉండగానే చదువైపోయింది. పెళ్ళీడు దాటిపోతోందని అమ్మ పట్టుబట్టి మరీ షాహిన్‌ని వెతికి పెళ్ళి చేసింది.షాహిన్‌ నా లైఫ్‌ ఏంజిల్‌. బట్‌ నన్ను వంట దగ్గరికి రావొద్దనే విషయంలో రాక్షసి.‘పెళ్ళి కాకముందు మీరు వంట చేశారో వాయినాలు సమర్పించారో నాకనవసరం. నేను మీ ధర్మపత్నిగా మీ జిందగీలోకొచ్చాను. కాబట్టి మీరు నా చేతి వంటే తినాలి. ఒక ఆడదానిగా నాకు మొగుడికి వంట చేసి కొసరి కొసరి వడ్డించాలని వుంటుంది. ముందు భార్య మనసుని అర్థం చేస్కోవడం అలవాటు చేస్కోండి. కాదని ఓవరాక్షన్‌ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు’ ఇలాంటి స్వీట్‌ వార్నింగులు ఇస్తుంటుంది.అయినా నా వంటబుద్ధి మారదు. ‘చేసిన ప్రాణం వూరుకోదు కదా ? ఇలా ఒకరి ఉత్సుకతకు సంకెళ్ళు వెయ్యటం అన్యాయ్‌ హై ఔర్‌ అక్రమం హై’ అని నేనెంత వాదించినా తన మాటే నెగ్గించుకుంటుంది.

‘బయట జాబ్‌ చేసి ఈ కుటుంబాన్ని పోషిస్తున్నారు కదా. అది సరిపోతుంది. ఇంటికి రాగానే హాయిగా కాలు మీద కాలేస్కొని గులాబ్‌ జామ్‌ చేసి పెట్టు, బగార బైంగన్‌ వండి పెట్టు అని ఆర్డర్లు పాస్‌ చెయ్యండి హుజూర్‌. నేను జీ హుజూర్‌ అని చక్కగా చేస్తా. పతిసేవ చేసుకోనివ్వండి’ అంటుంది. ‘సేమ్‌ టు యూ’ అనగానే నా వైపు గుర్రుగా చూస్తుంది.‘చెయ్యండి రోజూ వంట మీరే చెయ్యండి. నేనింట్లో తేరగా తినీ కూర్చుని కట్టుకున్న వాడితో నానా చాకిరీ చేయిస్తున్నానని అత్తయ్య, తోడికోడళ్ళ ముందే గాకుండా ఇరుగు పొరుగు వారి ముందు కూడా బద్‌నామ్‌ కావాలనే కదా మీ ఉద్దేశ్యం. ఏ జన్మలో ఏం పాపం చేశానో వంటొచ్చే మొగుణ్నిచ్చాడు ఆ పైవాడు. అసలు నాకు పెళ్ళిచూపులప్పుడే అనుమానం వచ్చింది – మీరు మీ హాబీస్‌లో ముందుగా వంట గురించే చెప్పారు. అప్పటికీ స్వరూప అంటూనే వుంది – ‘వంట వచ్చినవాణ్ణి కట్టుకుంటే జీవితమంతా తంటా తప్పదు సుమీ’... అని. తనెంత హెచ్చరించినా అదొక బిత్తిరి మొహంది అనుకొని పిచ్చ లైట్‌ తీస్కున్నా. కానీ తను చెప్పింది అక్షరాల నిజమే అయ్యింది. మీ అన్నదమ్ముల్ని చూడండి – ఇంటికొచ్చి ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టరు. ఆర్డర్లేసి వాళ్ళ పెళ్ళాలతో ఎలా చేయించుకు తింటున్నారో చూడండి. మీరూ వున్నారు ఎందుకూ? వాళ్ళని చూసి నేర్చుకోండి... మారండి..’తనలా ఫ్రస్టేట్‌గా ఫీలౌతుంటే నాకు నవ్వాగదు !

నవ్వితే తను మూడ్రోజులు మౌనవ్రతం బూనుతుంది.‘అదేమిటి బేగం... ఆడవాళ్ళు మాత్రమే ఇంటిపని, వంటపని చెయ్యాలని రాజ్యాంగంలో రాసిపెట్టి ఉందా? నాకు 24 అవర్స్‌ పనుండాలి. నేనేదో చిన్నా చితక రైటర్ని కదా! నాకు వంట గదిలో వంట చేస్తుంటేనే థాట్స్‌ వస్తాయ్‌ తెల్సా ?’ ‘అలాగైతే నాకొక జాబ్‌ చూడండి. నేను జాబ్‌ చేస్కుంటాను. అప్పుడు మీరు ఇంట్లో వుండి వంట చేద్దురు గానీ...’
ఇంతలో బెడ్రూంలోంచి మా పాప ఇరం ‘క్యావ్‌’ అని ఏడవటం మొదలు పెట్టింది.ఇద్దరం బెడ్రూంలోకి పరుగు తీశాం.ముందుగా నేనే అందుకున్నా పాపని. కాని తను ఉరిమి చూసింది.‘దానికి పాలు కూడా మీరే ఇవ్వండి సరిపోతుంది’ అంటూ పాపని నా చేతుల్లోంచి లాక్కొన్నంత పని చేసి అటువైపు తిరిగి పాలిస్తోంది.

ఇప్పుడు ఏం చెయ్యాలి? దొరికిందిలే సందు అని వంట గది వైపు చటుక్కున జారుకున్నాను. టకటకమని పప్పు కుక్కర్లో వేసి ఉడికిస్తున్నా.
అంతలోనే షాహిన్‌ వచ్చి నన్ను కరిచేట్టు చూసి – ‘ ఛ.. మీరు మారరు ‘ అంది.‘మొగోళ్ళు వంటపనిలో చేయి పెడితే ఇంట్లో బర్కత్‌ వుంటుందని ఒక హదీస్‌లో వుందోయ్‌ ...’‘చాలించండి ఈ సమర్థింపులకేం తక్కువలేదు. నేను వెళ్త...’ అని అక్కడినుండి వెళ్లిపోయింది.‘హమ్మయ్య...’ అనుకుంటూ పచ్చిమిర్చి తొడిమెలు తెంపుతూ ఆలోచనలో పడ్డాను.క్రితంసారి అత్తవారింటికెళ్ళినప్పుడు మామిడి ఆవకాయ పెట్టడానికి నడుం బిగించాను. షాహిన్‌ వద్దని వారిస్తున్నా లేవకుండా మొండిగా తన మాటను ఇగ్నోర్‌ చేసి మసాలాలన్నీ దంచి, మామిడి కాయలు నరికేసి జాడీల్లో పెట్టే వరకు ఉడుంపట్టు పట్టాను. ఆ లోపు షాహిన్‌ ఫ్రెండు వచ్చి నా అవతారాన్ని చూసింది. అది చూసి షాహిన్‌కు పీకల్లోతు కోపం వచ్చింది. మరోవైపు అత్తయ్య నా పని చూసి ముచ్చటపడి మామయ్యని దెప్పి పొడవటం మొదలు పెట్టింది.

‘అల్లుడిలా ఒక్కరోజైనా ఇంటి పని చెయ్యండి..’ అనడంతో మావయ్య నన్ను అదో రకంగా కింది నుండి మీది వరకు చూశాడు.బామ్మర్దులను కూడా వారి భార్యలు నన్ను ఉదాహరణగా చూపించి దెప్పి పొడవటం స్టార్ట్‌ చేసారు.అత్తవారింటి ఆడవాళ్ళందరి దృష్ఠిలో నేను ఉత్తమ అల్లుణ్ణి.కానీ నా భార్య దృష్ఠిలో నేనెప్పుడూ ఓవరాక్షన్‌ మొగుణ్ణే. ఈ తగాదా ఎప్పటికైనా తీరుతుందంటారా?

సినిమాలో సంసారం
నాన్నవంట చూడ్డానికే... తినటానికి కాదు

ఆనంద్‌రావు (అక్కినేని నాగేశ్వరరావు), జయలకు(జయసుధ) ఐదుగురు పిల్లలు. వాళ్ల అల్లరితో ఇల్లు సందడిగా ఉంటుంది. ఓ రోజు పిల్లలు స్కూల్‌ నుంచి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ తీసుకొస్తారు. చిన్న పాపకు వచ్చిన మార్కులు చూసి జయ మందలిస్తే రావు పిల్లలకు సపోర్ట్‌గా మాట్లాడతాడు. ప్రోగ్రెస్‌ కార్డు మీద సంతకం చేయనంటుంది జయ. ‘నువ్వు చేయకుంటే నేను చేస్తా’నంటాడు రావు. ‘అన్ని పనులూ మీరే చేయండి వంటతో సహా, నేను కూర్చుంటాను’ అంటుంది విసుగ్గా జయ. ‘వంట పెద్ద విద్య అనుకున్నావా? పిల్లలూ రండి.. వంట చేసి మన తడాఖా ఏంటో చూపిద్దాం’... అంటూ పిల్లలతో కిచెన్‌లోకి వెళ్తాడు రావు.

వంట చేసి ప్లేట్లలో వడ్డించి పిల్లల్ని తినమంటాడు ఆనంద్‌రావు. కట్‌ చేస్తే... పిల్లలంతా అమ్మ వద్దకు చేరి ‘ఆకలేస్తోందమ్మా’ అంటారు.‘మీరూ మీ నాన్నగారు కలిసి వంట చేసుకున్నారుగా వెళ్లి తినండి’ అంటుంది జయ. ఇవాళ వంట సరిగ్గా కుదరలేదు అని నసుగుతాడు రావు. ‘నాన్న చేసిన వంట చూడ్డానికే కానీ తినటానికి బాగాలేదమ్మా’ అంటారు పిల్లలు ‘రావుగారిల్లు’ సినిమాలో. ఇలాంటి సంఘటనలు మనిళ్లలోనూ జరగకపోవు.

ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి.
ఈ మెయిల్‌:samsaaram2017@gmail.com
– హుమాయున్‌ సంఘీర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement