మీ ఇంటి పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోండి అన్నారు ప్రధాని. అంటే వేళకు మందులివ్వడం, వేళకు అవసరాలు గమనించడం, వేళకు అన్నీ అమర్చి పెట్టడం... ఇది మాత్రమే కాదు అర్థం. వారితో కూర్చోవాలి. మాట్లాడాలి. మనసు వినాలి. వారు తమ కుటుంబ సభ్యులను సంతృప్తిగా చూసుకుంటూ ఒక చిన్న చిర్నవ్వు నవ్వేలా చూడగలగాలి. కరోనా సమయంలో వారికి కావలసిన ఇమ్యూనిటీ కొడుకులు.. కూతుర్లు...
మనవలు... మనవరాళ్లు. వారి కోసం ఉన్నారా వీరంతా?
మేడ్చల్‌లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అది. మేనేజర్ కొంచెం వర్రీగా ఉన్నాడు. పద్దెనిమిది గదుల్లో పద్దెనిమిది వృద్ధ జంటలు ఆ హోమ్‌లో ఉన్నాయి. లాక్‌డౌన్ ప్రకటించాక విజిటర్స్ రాకపోకలు పూర్తిగా నిషేధం అయినా లోపల జరగవలసిన కార్యక్రమాలు పెద్ద ఆటంకాలు లేకుండా జరుగుతూనే ఉన్నాయి. ఎగువ మధ్యతరగతి వారి కోసం కొంచెం ఫీజు ఎక్కువ తీసుకుని శ్రద్ధగా నడిపే హోమ్ అది. ఉంటున్న వాళ్లంతా ఉత్సాహంగా ఉంటారు. రొటీన్‌గా కాలక్షేపం చేస్తుంటారు. కాని రూమ్ నంబర్ నాలుగులోని జంట మాత్రం గత ఐదారు రోజులుగా రూమ్ నుంచి సరిగ్గా బయటకు రావడం లేదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అది కూడా ఇద్దరికి కాకుండా ఒకరికే... రూమ్‌కు తెప్పించుకుని కాస్త కాస్త తిని ఊరుకుంటున్నారని హెల్పర్స్ ద్వారా తెలిసింది. మేనేజర్ వారి రూమ్ దగ్గరకు వెళ్లి పలకరించే ప్రయత్నం చేశాడు. కాని తలుపు తీయలేదు. ‘మాకు మూడ్ బాగలేదు. మళ్లీ మాట్లాడతాం మేనేజర్‌గారూ’ అన్నారు లోపలి నుంచే. మేనేజర్‌కు ఏం చేయాలో తోచలేదు.
∙∙
‘ఏమంటున్నారు మీరు?’ అన్నాడు సైకియాట్రిస్ట్.
‘అవును సార్. ఆ వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మ జంటే. సడన్‌గా బాగా డల్ అయిపోయారు. మీరొకసారి వచ్చి చూడాలి’ అన్నాడు మేనేజర్ ఫోన్‌లో.
‘ఇప్పుడు కదలడం కష్టం కదా లాక్‌డౌన్‌లో’ అన్నాడు సైకియాట్రిస్ట్.
‘ఎమర్జన్సీ కద సార్. డాక్టర్లను ఎవరు ఆపుతారు’ అన్నాడు మేనేజర్.
‘సరే రేపు వస్తాను’ అన్నాడు సైకియాట్రిస్ట్.
∙∙
సైకియాట్రిస్ట్‌కు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మ అతనికి తెలుసు. ప్రతి రెండు నెలలకు ఒకసారి హోమ్‌వారు సైకియాట్రిస్ట్‌ను పిలిపిస్తారు. అక్కడ ఉన్న జంటల ఉద్వేగాలు, భయాలు, సందేహాలు, యాంగ్జయిటీ, డిప్రెషన్... ఇటువంటి వాటికి సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ట్రీట్‌మెంట్ కూడా ఉంటుంది. సాధారణంగా అక్కడ రెండు రకాల జంటలు ఉంటాయి. మొదటిది పిల్లల్ని ప్రయోజకులను చేసి, వారు రెక్కలొచ్చి ఎగిరిపోయాక, తమ ఇష్టం మేరకు సంతోషంగా వచ్చి చేరిన జంటలు. పిల్లలు తమకు తల్లిదండ్రులు భారమని తలచి, తమ దగ్గర వారు ఉంటామన్నా వినకుండా, చేర్పించిన జంటలు.
వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మ మొదటి కేటగిరిలోకి వస్తారు. వాళ్లకు ఒక కొడుకు, ఒక కూతురు.
కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు. కూతురు కూడా అమెరికాలో కొన్నాళ్లు ఉండి ఐదేళ్ల క్రితం ఇండియా తిరిగి వచ్చి ముంబైలో కుటుంబంతో ఉంటోంది. వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మ తమ బాధ్యతలు తీరాయని ఆరేళ్ల క్రితం ఈ హోమ్‌లో చేరారు. ఇద్దరూ హుషారుగా ఉంటారు. అక్కడ ఉన్న జంటలకు సగం కౌన్సెలింగ్ వీరే చేస్తుంటారు. సలహాలు చెబుతుంటారు. ధైర్యం ఇస్తుంటారు. అది గమనించిన సైకియాట్రిస్ట్ ఓల్ట్ ఏజ్ హోమ్‌కు వెళ్లినప్పుడల్లా ‘ఆ రూమ్ నంబర్ నాలుగు జంటను చూడండి. వాళ్లతో రోజూ ఒక గంట మాట్లాడండి. మీ హెల్త్ బాగుంటుంది’ అని చెప్పేసి వస్తుంటాడు. అలాంటిది ఆ జంటే మెత్తబడిందంటే కారణం ఏమిటో తెలుసుకోవాలని సైకియాట్రిస్ట్‌కు అనిపించింది.
∙∙
‘డాక్టర్ గారూ.. ఆ ఇద్దరూ వాళ్లతో వీళ్లతో కొంచెం మాట్లాడారట. దాన్ని బట్టి వాళ్ల సమస్యలు నాకు అర్థమయ్యాయి. 1. ప్రతి సంవత్సరం కొడుకు తప్పనిసరిగా వాళ్లను చూడటానికి వస్తాడు. ఈసారి నాలుగేళ్ల తర్వాత మనవలను తీసుకుని వస్తున్నట్టు చెప్పాడు. తీరా బయల్దేరే సమయానికి విమానాలు ఆగిపోయాయి. కరోనా వుద్ధృతి అమెరికాలో ఎక్కువగా ఉంది. దాంతో ఇక కొడుకును, మనవలను ఎప్పటికీ చూడలేమేమో, విమానాలు ఇక ఎప్పటికీ రావేమోనని కుంగిపోయారు. 2. అమెరికాలో కరోనా వార్తలు బాగా ఫాలో అవుతున్నారు. అది తన కొడుకు కుటుంబానికి ఎక్కడ సోకుతుందో అని ఆందోళన చెందుతున్నారు.
3. కరోనా తమకే సోకితే ఎలా అని మరో భయం వారిని వెన్నాడుతోంది. 4. ఎటుపోయి ఎటొచ్చి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ మూతపడితే తమ పరిస్థితి ఏంగాను.. కొత్తగా ఎక్కడికి పోవాలి... అని మరో భయం.. ఇలా ఉన్నాయి సార్ వారి ఆలోచనలు’ అన్నాడు హోమ్ మేనేజర్ సైకియాట్రిస్ట్‌తో.
సైకియాట్రిస్ట్ రూమ్ నంబర్ 4 దగ్గరకు వెళ్లాడు. వారు తలుపు తీయలేదు. కేవలం కిటికీ మాత్రం తీశారు.
‘హాయ్... గుడ్‌మార్నింగ్... తలుపు తీస్తారా మంచి టానిక్ ఇస్తాను’ అని నవ్వాడు సైకియాట్రిస్ట్.
∙∙
సైకియాట్రిస్ట్ మొదట చేసిన పని సమస్యను పది మందిలో వేయడం.
‘మీరు లోపల్లోపల కుళ్లబెట్టుకుంటూ కూచుంటే ఇలాగే అవుతారు. పదిమందితో మాట్లాడండి’ అని ఒక కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడించారు. అందులో వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మల కొడుకు సతీష్, కూతురు ధరణి, కోడలు, అల్లుడు ఉన్నారు. అందరి గొంతులు ఒక్కసారి వినేసరికి వాళ్ల ప్రాణం లేచి వచ్చింది. సమస్య గురించి ముందే కొడుకుతో సైకియాట్రిస్ట్ మాట్లాడటం వల్ల ఎక్కువ కౌన్సెలింగ్ కొడుకే ఇచ్చాడు. ‘అమ్మా.. నాన్నా... మీరు మా ఇల్లు చూశారు కదా. వచ్చి ఉన్నారు కదా. సేఫ్‌గా ఉన్నాం అందరం. ఎవ్వరం బయటకు వెళ్లడం లేదు. కరోనా అసలు మా ఊళ్లో చాలా తక్కువగా ఉంది. దాని గురించి భయపడకండి. ఇక పిల్లలను తీసుకొని మీ దగ్గరకు రావడం ఇప్పుడు జరక్కపోతే మూడు నెలల తర్వాత జరుగుతుంది లేదా ఆరు నెలల తర్వాత జరుగుతుంది.
అంతే తప్ప అసలు రాకుండా పోవడం అంటూ ఉండదు. విమానాలు ఎగరకపోతే ప్రపంచం నడవదనే డౌట్ తీసేయండి. ఇక మీకు కరోనా రావడం గురించి. పల్లెటూళ్లో గట్టి తిండి తిని పెరిగినవారు మీరు. బి.పి, సుగర్‌లను ముప్పై ఏళ్లుగా కంట్రోల్‌లో పెట్టుకుని ఉన్నారు. మీకేమవుతుంది చెప్పండి. అసలు మీరున్న హోమ్ చాలా జాగ్రత్తగా మెయింటెయిన్ చేస్తున్నారు. రసాయనాలు కూడా చల్లారని చెప్పారు. మీరేమైనా బయటకు వెళుతున్నారా కరోనా రావడానికి? ఇక హోమ్ మూసివేత గురించి. ఈ ప్రశ్న మీ మేనేజర్‌ను కాదు ఏకంగా మేనేజ్‌మెంట్‌నే అడిగాను. వారు నవ్వుతున్నారు. ఇంకో ఇరవై రూములు ఎక్స్‌పాండ్ చేస్తారట తప్పితే మూసివేయరు. అయినా అంతగా మూసివేస్తే నేనో చెల్లాయో ఉన్నాం కదా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి. కావాలంటే చెప్పండి.. నేనొచ్చినప్పుడు అమెరికాకు తీసుకెళతా’ అన్నాడు కొడుకు.
పిల్లలు చెప్పే ఒక్కోమాట వారిలో ఎంతో ధైర్యం నింపింది. ముఖాలు విప్పారాయి.
‘అయినా నాన్నా... చిన్నప్పటి నుంచి ఊళ్లో, ఉద్యోగంలో ఎన్ని ఇష్యూస్ హ్యాండిల్ చేశారు మీరు. మిమ్మల్ని చూస్తేనే నాకు ధైర్యం వచ్చేస్తుంటుంది. మీరు డల్ అయితే ఎలా?’ అన్నాడు కొడుకు.
‘హాయిగా ఉండండి అమ్మా.. నాన్నా... రోజూ మీతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతాం కదా’ అంది కూతురు.
వెంకటేశ్వర్లు, మాణిక్యమ్మల భ్రమాజనిత ఒంటరితనం ఎగిరిపోయింది.
సైకియాట్రిస్ట్ వొచ్చిన పని ముగిసింది.
ఈ కాన్ఫరెన్స్ కాల్ వీరికి మాత్రమే కాదు... ఇలాంటి ప్రతి పండుటాకుకూ కావాలి... దొరకాలి.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment