రోడ్డు కూడా దాటలేనంత నొప్పి!
నేను దూరాలు నడవలేకపోతున్నాను. దాంతో ఇటీవల డాక్టర్‌కు చూపించుకుంటే నా మోకాలి లిగమెంట్ చీరుకుపోయిందని, వైద్య పరిభాషలో ఈ సమస్యను ‘ఏసీఎల్’ అంటారని చెప్పారు. ఈ సమస్య వచ్చినప్పటి నుంచీ నొప్పితో కనీసం రోడ్డు దాటడం కూడా కష్టమైపోయింది. రోడ్డు దాటే లోపు నేను పడిపోతానేమో అన్నంత భయంగా ఉంది. దీనికి శస్త్రచికిత్స అవసరమని కొందరు చెబుతున్నారు. మోకాలిని పూర్తిగా తెరచి చేస్తారని అన్నారు. ఇది వాస్తవమేనా? దీని కంటే మెరుగైన చికిత్సలు ఏవైనా ఉన్నాయా? నా సమస్య గురించి సరైన వివరాలను విపులంగా చెప్పండి. - వెంకటేశ్వరరావు, కర్నూలు
మీరు విన్నది నిజమే. ‘ఏసీఎల్’ అనే మీ సమస్యకు మీ లక్షణాలను బట్టి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్’ అనే కండిషన్‌కు సంక్షిప్త రూపమే ‘ఏసీఎల్’. ఇలా మీ లిగమెంట్‌కూ, కార్టిలేజ్‌కూ (మృదువుగా ఉండే ఎముక లేదా మృదులాస్థి) గాయమై, అది చీరుకుపోతే దాన్ని ‘ఆర్థోస్కోపీ’ అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేసి సరిదిద్దాల్సి (రిపేర చేయాల్సి) ఉంటుంది. ఆర్థోస్కోపీ అనే ప్రక్రియలో ఒక చిన్న గాటు ద్వారా అతి చిన్నదైన ఒక కెమెరాను రెండు ఎముకలు కలిసే కీలు ప్రాంతంలో ప్రవేశపెడతారు. ఇలా ప్రవేశపెట్టిన కెమెరా ద్వారా అక్కడి దృశ్యాలను, ఆ కెమెరాతో అనుసంధానించిన ఒక తెరపై స్పష్టంగా చూడవచ్చు. ఇలా అక్కడి దృశ్యాలను చూస్తూ గాయపడ్డ లిగమెంట్‌ను, కార్టిలేజ్‌కు అయిన గాయాన్ని రిపేర్ చేస్తారు. గట్టిగా ఉండే మన ఎముకల చివరన మెత్తగా ఉండే చిగురు ఎముక లేదా మృదులాస్థి అని పిలిచే మెత్తటి ఎముక కప్పి ఉంటుంది. ఇది ఎముకపై భారం ఒక్కసారిగా పడకుండా ఒక మెత్త /తలగడ (కుషన్) లాగా షాక్ అబ్జార్బర్‌లాగా పనిచేస్తుంటుంది. ఆర్థోస్కోపీ ప్రక్రియ ద్వారా అటు లిగమెంట్‌నూ, ఇటు మృదులాస్థికి అయిన గాయాన్ని ఏకకాలంలో చికిత్స చేయవచ్చు. పైగా ఇప్పుడు వైద్యరంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక పురోగతి వల్ల మీ ఎముక నుంచే మీ సొంత ఎముకమజ్జ (మ్యారో)ను తీసుకొని, మీ మృదులాస్థి కణాలను రిపేర్ చేయవచ్చు. దీన్నే కార్టిలేజ్ మార్పిడి చికిత్స (కార్టిలేజ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) అంటారు. దీనివల్ల భవిష్యత్తులో మీకు రాబోయే ఆస్టియో ఆర్థరైటిస్‌ను నివారించవచ్చు. అంటే మోకాళ్లు అరిగే పరిస్థితిని నివారించవచ్చన్నమాట. మోకాలిని పూర్తిగా తెరచి చేసే చికిత్సతో పోలిస్తే ఆర్థోస్కోపీ ద్వారా చేసే చికిత్స వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి... కెమెరా ద్వారా చూస్తూ చికిత్స చేయడం వల్ల అక్కడి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి పూర్తిగా మోకాలు తెరవడానికి కోతకు బదులుగా చిన్న గాటుతోనే శస్త్రచికిత్స పూర్తవుతుంది. దాంతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు, రక్తస్రావం, నొప్పి, శస్త్రచికిత్సకు పట్టే సమయం... ఇవన్నీ గణనీయంగా తగ్గుతాయి. దాంతో రోగి త్వరగా నడవవచ్చు.
డాక్టర్ సుకేశ్‌రావు సంకినేని
కన్సల్టెంట్ ఆర్థోస్కోపీ -
కార్టిలేజ్ రిపేర్ సర్జన్,
సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్
ఆర్థోస్కోపీ కౌన్సెలింగ్
Published Sun, Jul 5 2015 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement