ఆస్వాదించు.. మైమ‘రుచి’ | Creative Cake Designs | Sakshi
Sakshi News home page

ఆస్వాదించు.. మైమ‘రుచి’

Published Thu, Jul 25 2019 2:09 PM | Last Updated on Thu, Jul 25 2019 2:09 PM

Creative Cake Designs - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కేక్‌ అంటే.. అందరికీ గుర్తొచ్చేది న్యూ ఇయర్, బర్త్‌డే సెలబ్రేషన్లు. ఇంకాస్తా ముందుకెళ్తే.. ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్‌ డే సెలబ్రేషన్లు.. అన్నింటికీ దాదాపు ఒకే మోడల్‌ కేక్‌ ఉంటుంది. బేకరీలో ఏ డిజైన్‌ ఉంటే ఆ కేక్‌నే కొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. శుభకార్యానికి తగ్గట్టుగా కేక్‌ను ఎంపిక చేసుకుని.. సంబరాలు జరుపుకోవచ్చు. సందర్భం ఏదైనా ఆశా రాథోడ్‌ కేక్‌ చేస్తే అదిరిపోతుంది. నగరంలోని మాధవధారకు చెందిన ఆశా రాథోడ్‌ కన్నడ అమ్మాయి. దీంతో ఈ రంగంలో ఇట్టే  ప్రావీణ్యం పొందారు. సందర్భానికి తగ్గట్టుగా..కావాల్సిన డిజైన్‌తో కేక్‌ ఎందుకు చేయకూడదన్న ఆలోచన రావడంతో..ఈ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకున్నారు. కేక్‌ తయారీపై దృష్టి సారించారు.

విదేశాల్లోనూ ఫేమస్‌..
ఆ నోటా.. ఈ నోటా.. ఆశా రాథోడ్‌ చేసిన ప్రాచుర్యం పొందాయి. విదేశాల్లో కూడా వాలిపోయాయి. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు.. అక్కడ ఏదైనా శుభకార్యం ఏర్పాటు చేసుకోవాలంటే ఆశా రాథోడ్‌ కేక్‌ ఉండాల్సిందే. అమెరికా, చికాగో, న్యూయార్క్, లండన్‌ ఎన్‌ఆర్‌ఐలు ఈ కేక్స్‌ను ఆర్డర్‌ చేస్తుంటారు. వైజాగ్‌తో పాటు విజయవాడ, కాకినాడ, హైదరాబాద్, వరంగల్‌ నుంచి కూడా ఆర్డర్స్‌ వస్తున్నాయి. ఇలా కేక పుట్టించే కేక్స్‌తో ఫేమస్‌ అయిపోయారు ఆశారాథోడ్‌. నాలుగేళ్లగా హోం మేడ్‌ కేక్స్‌ను తయారు చేస్తున్నారు. నగరం నుంచి ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడ వాళ్లకు ఈ కేక్స్‌ను పార్శిల్‌ ద్వారా పంపుతారు. తనదైన శైలిలో పేస్త్రీ, చాక్లెట్‌తో పాటు కస్టమైజ్డ్‌ కేకులు ఆశా రాథోడ్‌ చేతుల్లో తియ్యగా.. అందంగా రూపుదిద్దుకుంటున్నాయి.

కొత్త పంథాలో.. 
ముందుగా తన కుమార్తె పుట్టిన రోజుకు సంబంధించిన కేక్‌ను విభిన్నంగా తయారు చేయాలని ఆశా నిర్ణయించారు. తన కుమార్తెకు ఇష్టమైన మోడల్‌తో అచ్చం బొమ్మను తలపించేలా కేక్‌ తయారు చేశారు. బర్త్‌డేకు వచ్చిన వారంతా అది కేక్‌ కాదు బొమ్మ అనేంతగా భ్రమపడ్డారు. ఇక అప్పటి నుంచి ఆమె ట్రెండీ కేక్‌ కలెక్షన్‌ కొత్త పంథాలో సాగిపోయింది.ఉద్యోగి విరమణ కార్యక్రమం అయితే.. ఉద్యోగి కుర్చీలో సేదతీరుతూ, పేపర్‌ చదువుతున్నట్లుగా., ఎంగేజ్‌మెంట్‌ అయితే.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ కేక్‌., బారసాల కార్యక్రమం అయితే.. బుజ్జాయి ఊయలలో ఊగుతున్న కేక్‌.., హాఫ్‌ శారీ ఫంక్షన్‌ అయితే.. పట్టుచీర కేక్‌.., ప్రేమను వ్యక్తం చేయాలనుకునే సందర్భం ఉంటే ప్రపోజ్‌ కేక్‌.., కృష్ణాష్టమికి వెన్నముద్దల కేక్‌.., ఇలా ప్రతి శుభకార్యానికి మరింత వన్నె తెచ్చేలా కేక్‌ తయారు చేస్తూ అందరినీ మెప్పిస్తున్నారు ఆశా రాథోడ్‌. పిల్లలు ఎక్కువగా మెచ్చే బొమ్మల కేక్స్, డ్రైఫ్రూట్స్‌ కేక్, ఫొటో రోల్‌ కేక్‌.. ఇలా ఆశా తయారు చేసిన కేక్స్‌ అన్నీ సహజ సిద్ధంగా కనిపిస్తుంటాయి.

భలే డిమాండ్‌ 
ఆకర్షణీయంగా కనిపిస్తేనే కేక్స్‌ కొంటారు. తర్వాత టేస్ట్‌ చూస్తారు. అందుకని కేక్‌లను చూడగానే ఆకట్టుకునేలా తయారుచేసే కళ సొంతం చేసుకోవాలి. ఇదే సూత్రాన్ని ఆశా రాథోడ్‌ పాటిస్తుంటారు. కళ చేతిలో ఉంటే పలు రకాల బొమ్మలను, ఆకారాలను కేక్‌ల రూపంలో ఆకర్షణీయంగా మలచవచ్చని ఆమె నిరూపిస్తున్నారు. ‘కేక్స్‌లో వంద రకాల రెసిపీలు ఉంటాయి. అయితే బేసిక్‌ విధానం వచ్చి ఉండాలి. వంట చేయడం కంటే కూడా బేకింగ్‌ చేయడం చాలా సులభం. ఎందుకంటే బేకింగ్‌లో పదార్థాలన్నీ కొలతల బట్టి వాడాలి. చెప్తే అతిశయోక్తి అనుకుంటారు కానీ...! బేకరీ పెట్టే వాళ్లకి వచ్చే ఆదాయం కంటే కూడా ఇంటి నుంచి కేక్స్‌ చేసే వాళ్ల ఆదాయం ఎక్కువ. నలుగురితో పరిచయాలు ఉండి, కాస్త పేరొస్తే చాలు ‘హోం బేకర్స్‌’కు డిమాండ్‌ ఉంటుంది. దీనికి పెట్టుబడి కూడా ఎక్కువ అక్కర్లేదు.’ అని ఆశా రాథోడ్‌ అంటారు.

మనసుకు నచ్చిన పని చేస్తున్నా..
కొత్తగా ఆలోచించడమనేది చిన్నప్పటి నుంచి అలవాటుగా మారిపోయింది. అందుకే ఇలా భిన్నంగా ఆలోచించాను. ఏ ఫంక్షన్‌కు సంబంధించిన కేక్‌ అయినా అందరికీ నచ్చేలా చేయాలన్నదే నా ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ నేను తయారు చేసిన కేక్‌ గురించి మాట్లాడుతుంటారు. ఇంటి వద్దనే ఉంటూ మనసుకు నచ్చిన పని చేస్తున్నాను. ఆ పని పది మంది మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది.
– ఆశా రాథోడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

ఆశా చేతిలో రూపుదిద్దుకున్న వెరైటీ కేక్స్‌

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement