క్యూబా | Cuba | Sakshi
Sakshi News home page

క్యూబా

Published Sat, Nov 22 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

క్యూబా

క్యూబా

నైసర్గిక స్వరూపం
వైశాల్యం: 1,09,884 చ.కి.మీ.
జనాభా: 11,271,819 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని: హవానా
కరెన్సీ:  పెసో
ప్రభుత్వం: సింగిల్ పార్టీ స్టేట్
అధికారిక భాష: స్పానిష్, మతం: క్రైస్తవులు
వాతావరణం: జనవరిలో 18 నుండి 26 డిగ్రీలు, జూలైలో 24 నుండి 32 డిగ్రీలు
పంటలు: చెరకు, వరి, బంగాళదుంపలు, కసావా, మొక్కజొన్న, బత్తాయి.
పరిశ్రమలు: వ్యవసాయ ఉత్పత్తులు, గనులు, ఫుడ్‌ప్రాసెసింగ్, పొగాకు ఉత్పత్తులు, ఖనిజాలు, రసాయనాలు, సిమెంటు, ఎరువులు, వస్త్రపరిశ్రమ, చేపలు
స్వాతంత్య్రం: నామమాత్రంగా దక్కింది 1902 మే 20న (నిజమైన స్వాతంత్య్రం 1 జనవరి 1959)
సరిహద్దులు: చుట్టూ సముద్రమే. అట్లాంటిక్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కరేబియన్ సముద్రం.

 
1. హవానా: కరేబియన్‌లోని ద్వీపదేశమైన క్యూబా రాజధాని హవానా ఒక పెద్ద నగరం. ఇక్కడే సముద్ర తీరం, ఓడరేవు ఉన్నాయి. క్యూబా దేశం పైనుండి చూస్తే రొయ్యలా కనబడుతుంది. నగరంలోనూ, పరిసరాల్లోనూ చూడదగిన వింతలు ఎన్నో ఉన్నాయి. నగరంలో మూడు ఓడరేవులు ఉన్నాయి. అవి మరిమెలెనా, అటారిస్, గ్వాన బాకోవా. నగరంలోని ఓల్డ్ హవానా నగరం పర్యాటకులకు స్వర్గధామం లాంటిది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. పాత నగరాన్ని హబామా వీజా అంటారు. వివిధ ఆకృతులలో ఉన్న పాత భవనాలు, క్యాథడ్రమ్‌లు ఎన్నో ఉన్నాయి. ఇక మధ్య హవానాను సెంట్రోహవానా అంటారు. ఇక్కడ ఉన్న పురాతన భవనాలను జాతీయ సంపదగా ప్రకటించారు. ఇక్కడ పార్క్ సెంట్రల్ జోస్ పార్ట్ విగ్రహం, కాపిటాలియో వీధి, సిగార్  ఫ్యాక్టరీ వీధి ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే నగరంలోని లెడాడో ప్రాంతం మరో ఆకర్షణ. ఇది రాజకీయ నాయకులు, పార్టీలకు గుండె లాంటిది. ఈ ప్రాంతంలోని లారాంపా అనే ప్రదేశంలోనే విప్లవ యోధుడు చేగువేరా స్మారక స్థలం ఉంది. ప్లాజాడిలా రెవెల్యూషన్ ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నగరంలో ఇంకా హవానా విశ్వవిద్యాలయం, ఫోక్సా భవనం ఉన్నాయి.
 
 చూడదగిన ప్రదేశాలు: క్యూబా దేశంలో టూరిజం ఒక పరిశ్రమగా వెలుగొందుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు మూడు మిలియన్ల పర్యాటకులు క్యూబా దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. క్యూబా రాజధాని హవానా ఒక గొప్ప పర్యాటక నగరం.
 
2. వరడెరో ఆకర్షణలు: వరడెరో ప్రాంతం క్యూబా దేశంలో ఒక ప్రధాన పర్యాటక స్థలం. సముద్రతీరం, తెల్లటి ఇసుక బీచ్‌లు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. 1929లో కట్టిన విల్లా క్సనాడు భవనం ఎంతో అద్భుతంగా  దర్శనమిస్తుంది. ఇది ఇప్పుడు ప్రభుత్వ అధీనంలో ఉంది. సువిశాలమైన జోసోన్ పార్కును 1940లో నిర్మించారు. ఈ పార్కులో పర్యాటకులకు కావల్సిన అన్ని వసతులు ఉన్నాయి. వరడెరో మ్యూజియంలో పురాతన కాలం నాటి అద్భుత వస్తువులు ఎన్నో ఉన్నాయి. వరడెరోకు ఉత్తరాన నీటి అడుగున పార్కు ఉంది. వాటర్ డ్రైవింగ్, సముద్రపు అడుగుభాగాలను ఈ పార్కులో విహరిస్తూ దర్శించవచ్చు.

3. కామాగ్వే ప్రావిన్స్: క్యూబా దేశంలో మూడో అతిపెద్ద నగరం కామాగ్వే. ఇక్కడ 20 కిలోమీటర్ల పొడవైన సాటాలూసియా బీచ్ ఉంది. పర్యాటకులు ఈత కొట్టడానికి ఈ బీచ్ అనుకూలంగా ఉంటుంది. స్కూబా డ్రైవింగ్‌కు ఈ బీచ్ పుట్టినిల్లు. ఇక్కడే మరో బీచ్ న్యూవిటాస్ బీచ్ కూడా ఉంది. ఇక్కడికి సమీపంలోనే కాయోసబినాల్ కోరర్ ఐలాండ్ ఉంది. ఫ్లెమింగో పక్షులు ఇక్కడ కనువిందు చేస్తాయి. కామాగ్వేకు ఉత్తరంవైపు సియారాడి క్యూబిటాస్ పర్వత శ్రేణి ఉంది. ఇవన్నీ చిన్న చిన్న పర్వత శ్రేణులు. ఈ పర్వతాలలో ఎన్నో గుహలు ఉన్నాయి.
 
4. సాంటియాగో డి క్యూబా: ఈ నగరం 15వ శతాబ్దంలో నిర్మితమైంది. విశాలమైన కాస్టిల్లో డి సాన్ పెడ్రో డెల్ మొర్రో కోట ఉంది. ఈ కోట ఒక చిన్న కొండ మీద నిర్మించబడింది. మొదట రక్షణ కోసం ఆ తర్వాత జైలుగా ఉపయోగపడింది ఈ కోట. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక్కడ ప్రోవిన్సెయల్ బకార్డె మోరో మ్యూజియం ఉంది. ఇక్కడ చరిత్ర పూర్వపు వస్తువులు, శతాబ్దాల నాటి రాజుల దుస్తులు, ఉపయోగించిన వస్తువులు, ఎన్నో కళాకృతులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ మ్యూజియమ్‌లో ఈజిప్టు మమ్మీలు, పెరూ మమ్మీలు అమెజాన్ ప్రాంతంలో లభించిన పురాతనకాలపు మానవ పుర్రెలు ఉన్నాయి. ఈ నగరంలోనే ఇంకా కాసా డిడీగో వెలాజ్ క్వెజ్ మ్యూజియం, మ్యాస్ట్రా సెనోరా బాసిలికా చర్చి, అబెల్ సాంటా మోరియా మ్యూజియం, సిమెంటేరియో డి సాంటా ఇఫిజనియా, సెస్పడెస్ పార్కు, ప్లాజాడిలా రెవెల్యూషన్, కార్నివాల్ మ్యూజియం, క్యూర్టెల్ మోన్‌కాడా మ్యూజియం, ప్లాజామార్టి, విస్టాఅలెగ్రా ఇలా ఎన్నో ప్రదేశాలు, కట్టడాలను ఇక్కడ దర్శించవచ్చు.
 
 
పరిపాలనా విధానం: దేశాన్ని 16 ప్రావిన్స్‌లుగా, ఈ ప్రావిన్స్‌లను తిరిగి మున్సిపాలిటీలుగా విభజించారు. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణంగా ఉండటం వల్ల, పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. దేశంలో 10 నగరాలు ఉన్నాయి. అవి - హవానా, శాంటియాగో డి క్యూబా, కామాగ్వే, హోల్గిన్, శాంటాక్లారా, గ్వాంటనామో, బయామో, విక్టోరియా డి లాస్ టు నాస్, సీన్ ఫ్యూగోస్, మాంజనిల్లో.
 
చరిత్ర: 1492లో క్యూబా దేశాన్ని కొలంబస్ కనుగొన్నాడు. 1512లో క్యూబాను స్పెయిన్ ఆక్రమించుకుంది. 1762లో బ్రిటన్ క్యూబాను తన అధీనంలోకి తీసుకుంది. కొద్దికాలానికే క్యూబా తిరిగి స్పెయిన్ అధీనంలోకి వచ్చింది. 1902 వరకు అమెరికా క్యూబాను ఆక్రమించుకుంది. 1902 తర్వాత క్యూబా స్వతంత్రాన్ని పొందింది. 1961లో క్యూబాను కమ్యూనిస్ట్ దేశంగా ఫిడెల్ క్యాస్ట్రో ప్రకటించాడు. క్యూబాలో సగం జనాభా ఆఫ్రికా, యూరప్ దేశాల మిశ్రమమే.

ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా: 1950 దశకం నుండి క్యూబాలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. 1956లో ఫిడెల్ క్యాస్ట్రో తన 80 మంది అనుచరులను తీసుకొని ఒక విఫల ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం తర్వాతి రెండేళ్ళ కాలంలో ఒక విప్లవంగా మారిపోయింది. 1958 చివరలో వాళ్ళు శాంటాక్లారాను ఆక్రమించారు. 1959 జనవరిలో రాజధాని నగరానికి ప్రవేశించారు. ఆ తర్వాత మొత్తం దేశాన్ని ఆయన తన అధీనంలోకి తెచ్చుకొని క్యూబా దేశాధ్యక్షుడు అయ్యాడు. దాదాపు 50 ఏళ్లు పరిపాలించి, 2008లో రాజీనామా చేశాడు.

చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో రావుల్ క్యాస్ట్రో, ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ ‘జూలై 26 విప్లవం’లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. విప్లవవీరుడుగా గుర్తింపుపొందిన చేగువేరా 1967 అక్టోబర్ 9న మరణించాడు.

ప్రజలు-సంస్కృతి: 1959 నాటి విప్లవం తర్వాత ప్రజల జీవన విధానం బాగా మారిపోయింది. మహిళలకు పురుషులతో సమానమైన అధికారం, అవకాశం దక్కాయి. చదువు, ఉద్యోగం, వ్యవసాయ పనులు, ఇల్లు - ఇలా అన్ని రంగాలలో మహిళలకు అధికారం, స్వేచ్ఛ లభించాయి.

 జనాభాలో 35 శాతం మంది స్పెయిన్ దేశానికి చెందినవారు. 10 శాతం మంది ఆఫ్రికన్లు, 50 శాతానికి పైగా స్పానిష్ ఆఫ్రికన్ జాతుల మిశ్రమ జనాభా ఉంది. దేశ జనాభాలో సగం మంది 30 ఏళ్ళలోపు వారే ఉన్నారు. ప్రజలు స్నేహభావంతో ఉండి, సేవ చేయడానికి ముందు ఉంటారు. పండుగలు, సంగీతం, నృత్యం పట్ల మక్కువ ఎక్కువ. ప్రజలు నగరాలు, పట్టణాలలో జీవించడానికి ఇష్టపడతారు.
 
ఆహారం: క్యూబాలో వివిధ సంస్కృతుల ప్రజలు ఉండడం వల్ల వారి ఆహార రీతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్ని ప్రాంతాలలో వరి అన్నం అధికంగా తింటారు. దీనితో పాటు బంగాళదుంప వేపుడు, టమోటా, అవకాడో, లెట్యూస్, గుమ్మడి, క్యారెట్, క్యాబేజీల సలాడ్ కానీ, సూప్ కానీ చేస్తారు. భోజనంతో పాటు బీరు గానీ, వైన్ గానీ తాగుతారు. మాంసపు వంటకాలను చేసుకుంటారు. కోడిగుడ్డు అధికంగా తింటారు.
 
వ్యవసాయం:
క్యూబాలో దాదాపు 81 వేల ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నారు. క్యూబా దేశం చెరకు, చక్కెరలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దేశంలో పొగాకు పంట కూడా విరివిగా పండుతుంది. ఒక్క పొగాకు ఉత్పత్తుల ద్వారానే సంవత్సరానికి 200 మిలియన్‌ల అమెరికా డాలర్ల ఆదాయం లభిస్తుంది. ద్రాక్ష ఉత్పత్తిలో క్యూబా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. వరి, బంగాళదుంపలు బాగా పండుతాయి. కసావా (ఇది మన మొరంగడ్డల (చిలగడదుంపల) మాదిరిగా ఉంటుంది) 2,60,000 ఎకరాల్లో పండిస్తారు. దాదాపు మూడు లక్షల టన్నుల కసావాను పండిస్తారు. వీటితోపాటు అరటి, మామిడి, బొప్పాయి, అనాస, అవకాడో, జామ, కొబ్బరి కూడా క్యూబాలో అధికంగా పండుతాయి.
 
పరిశ్రమలు: క్యూబాలో ఫార్మాస్యూటికల్స్, చక్కెర పరిశ్రమ ఎక్కువ. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మందులు అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. దేశ ఆర్థికవ్యవస్థలో 37 శాతం విదేశీ మారక ద్రవ్యం వీటి ద్వారా లభిస్తుంది. ఇవిగాక ఇంకా ఇక్కడ చమురు శుద్ధి కర్మాగారాలు, వస్త్ర పరిశ్రమ, బూట్లు, టూత్‌పేస్టులు, సబ్బులు, కార్డ్‌బోర్డ్ బాక్సుల పరిశ్రమలు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement