
పొంగి పొర్లే పండుగ
అక్టోబర్ ఫెస్ట్
ఒక నగరాన్ని కోటి మంది అతిథులు ముంచెత్తేస్తారు. కేవలం పదహారు రోజుల్లో... కోటి లీటర్ల బీరు ఖాళీ చేసేస్తారు. టన్నుల కొద్దీ మాంసం, ఇతర ఆహారం ఖర్చయిపోతుంది. నిజం!! ఇదో పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఒకటీ రెండూ కాదు... ఏకంగా రెండు వందల ఏళ్లకు పైబడి నడుస్తోంది. అదే... అక్టోబర్ ఫెస్ట్. జర్మనీలోని మ్యూనిక్ నగర స్పెషాలిటీ. వీధుల్లోంచి వెళ్లే బ్యాండు వాయిద్యాలు వింటూ... బీరు ఖాళీ చేసేయ్యెటమే ఈ పండగ ప్రత్యేకత. చారిత్రక సంప్రదాయాల మేరకు జరిగే ఈ పండగలో... అతిథులూ యూనిఫామ్స్ ధరిస్తారు. కొందరు అభిమానుల డైరీల్లో ఏటా ఈ పండగ ఉండాల్సిందే. మిగిలిన వారు కూడా... జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకోకుండా ఉంటారా?.
మ్యూనిక్‌కు వెళ్లేదెలా?
హైదరాబాద్‌తో పాటు ముంబయి, ఢిల్లీ నుంచి మ్యూనిక్‌కు నేరుగా విమానాలున్నాయి. అక్టోబర్ ఫెస్ట్‌లో యాత్రికుల తాకిడి ఎక్కువ కనక టిక్కెట్లు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బుక్ చేస్తే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.40 వేల లోపే ఉంటాయి.
ఏ సీజన్ మంచిది?
సెప్టెంబరు నెలాఖర్లోనే వెళ్లాల్సి ఉంటుంది. సెప్టెంబరు మూడో వారం నుంచి అక్టోబర్ ఫెస్ట్ ఆరంభమవుతుంది.