నా మొదటి డిజైనింగ్ స్టూడియోకార్ గ్యారేజ్! | Designing my first garage studiyokar! | Sakshi
Sakshi News home page

నా మొదటి డిజైనింగ్ స్టూడియోకార్ గ్యారేజ్!

Published Wed, Sep 10 2014 10:52 PM | Last Updated on Wed, Sep 19 2018 8:25 PM

Designing my first garage studiyokar!

ఇటీవల ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తన డిజైన్స్‌కి ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్న ఫ్యాషన్ డిజైనర్ శశికాంత్ నాయుడు. చేనేత వస్త్రాలను ప్రాణంగా భావించి, వాటితో అత్యుత్తమ డిజైన్లను సృష్టిస్తున్న ఈ డిజైనర్ హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉంటున్నారు. ఫ్యాషన్ రంగంలో తను చేస్తున్న కృషి, ఈ రంగంలో వస్తున్న మార్పులు, పోటీ గురించి ‘సాక్షి’తో ముచ్చటించారు.

లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మీ డిజైన్స్‌కి కలంకారీ ఫ్యాబ్రిక్‌నే వాడారు. గతంలోనూ ఖాదీ స్పెషల్ చేశారు. చేనేతల ఎంపికకు కారణం?

శశి: ఆరునెలలు దాటగానే ‘ఔట్ డేటెడ్’ అయిపోయే డిజైన్స్ నచ్చవు నాకు. ఎప్పుడు ధరించినా నా డిజైన్స్ ప్రత్యేకంగా, గ్రేస్‌గా కనిపించాలి. ఆ గొప్పదనం మన చేనేతలకు ఉంది. అందుకే నా డిజైన్స్ అన్నింటిలోనూ హ్యాండ్లూమ్స్‌కే ఫస్ట్ ప్లేస్ ఉంటుంది.
 
సాధారణంగా డిజైన ర్ డ్రెస్సుల ఖరీదు ఎక్కువ. అన్ని వర్గాలకు మీ డిజైన్స్ చేరడం కష్టం కదా!
శశి: నిజమే, ఎప్పుడైనా మధ్యతరగతికి డిజైన్స్ చేరితేనే ఆ డిజైనర్ విజయం సాధించినట్టు. చేనేతల ఖరీదు ఎక్కువే. ఇక పెన్ కలంకారీ వంటి ఆర్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఎన్నో దశలు దాటితే తప్ప ఒక డిజైన్ రాదు. లాక్మె ఫ్యాషన్ వీక్ కోసం మచిలీపట్నం, శ్రీకాకుళంలో.. కలంకారీ నిపుణుల దగ్గర కూర్చొని, నాకు కావల్సిన ప్రింట్స్ చెప్పి మరీ ఫ్యాబ్రిక్‌ను తయారు చేయించాను. వీటి డిజైనింగ్ ప్రతి పార్ట్‌లోనూ హ్యాండ్లూమ్‌నే వాడాను. దీంతో ఖరీదు కూడా బాగానే ఉంటుంది. అయితే, ఎప్పుడైనా డిజైన్స్ రెప్లికాస్ వస్తే అసలు డిజైన్ కన్నా ఖరీదు ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. అలాంటి రెప్లికాస్ ఎన్నో వస్తున్నాయి. తక్కువ ఖరీదులో చేనేతలను ధరించాలంటే... ధరించే దుస్తుల్లో ఏదో ఒక పార్ట్ మాత్రమే చేనేతను ఎంచుకోవాలి. ఉదాహరణకు టాప్ హ్యాండ్లూమ్ తీసుకుంటే బాటమ్ జీన్స్ వేసుకోవచ్చు. లేదా మిక్స్ అండ్ మ్యాచ్‌గా ధరింవచ్చు. దీని వల్ల ఖరీదు తగ్గుతుంది.
 
ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ఎప్పుడు దృష్టి పెట్టారు? మీ కుటుంబ నేపథ్యం గురించి..
శశి: మా పూర్వీకులది విజయవాడ. నాన్న కేంద్రప్రభుత్వోద్యోగిగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ఇద్దరు బ్రదర్స్, సిస్టర్. అంతా ఇంజినీరింగ్ పట్టభద్రులే. నేనూ ఇంజినీరింగ్ చేశాను. కానీ, ఎంతసేపూ కంప్యూటర్‌కు అతుక్కుపోయే ఉద్యోగం నాకు నచ్చలేదు. కొత్తగా ఆలోచించడం, పనిచేయడం చిన్ననాటి నుంచి అలవాటు. ‘డ్రెస్ డిజైనర్’ అవుతాను అన్నాను. ‘ఇంజినీర్‌వైయుండి బట్టలు కుడతావా’ అని కోప్పడ్డారు ఇంట్లో. వారికి నేను చెప్పింది అర్థం కాలేదు. వాళ్లు చెప్పింది నాకు అర్థం కాలేదు. నిఫ్ట్ ఫ్యాషన్ ఇన్‌స్టిట్య్యూట్‌లో చేరిపోయాను. ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ పొందాను. కోర్స్ పూర్తయ్యాక డిజైనింగ్ స్టూడియో పెడదామను కున్నాను. కానీ, ఖర్చుతో కూడిన పని. అలా ఆలోచిస్తున్నప్పుడే నా బాధ నాన్నకు అర్థమైందను కుంటా.. ఇంటి కింద తన కార్ గరేజ్ ప్లేస్‌ను నా వర్క్ ప్లేస్‌గా మార్చుకోవడానికి ఇచ్చారు. అంతేకాదు 20 వేల రూపా యలు పెట్టుబడిగా ఇచ్చారు. అలా పదేళ్ల క్రితం.. కుట్టుమిషన్లు, పనివారితో ‘శశికాంత్ నాయుడు’ పేరుతో లేబుల్ డిజైన్స్ సృష్టించాను. మిషన్ల చప్పుడు విని, చుట్టుపక్కల వారు వచ్చారు. నోటి మాటతోనే చాలా మందికి నా డిజైన్స్ చేరిపోయాయి.

ఈ రంగంలో స్ఫూర్తిగా నిలిచినవారు...
శశి: నా డిజైన్స్‌కు వచ్చిన ప్రశంసలే నాకు స్ఫూర్తి. 2003లో నిఫ్ట్ అండ్ మినిస్ట్రీ టెక్స్‌టైల్స్‌లో నా కలెక్షన్స్ పరిచయం చేశాను. పేరొందిన బొటిక్స్ తరపునా షోస్ ఏర్పాటు చేశాను. గ్రాసిమ్ ఇండియా -2004లో నేను డిజైన్ చేసిన డ్రెస్ ధరించిన రవి కబ్రాకు ఫస్ట్ రన్నరప్ బెస్ట్ మేల్ డ్రెస్డ్ కేటగిరీలో అవార్డ్ లభించింది. 2003లో ఫెమినా బుక్ ఫ్యాషన్ కేటగిరీలో 50 మంది ప్రసిద్ధ డిజైనర్స్‌ని పరిచయం చేసింది. అందులో నేను ఉపయోగించిన భారతీయ సాంస్కృతిక గిరిజన కళ, రంగులు, వస్త్రం, దారాలు, డిజైన్లు.. ఇలా అన్నింటినీ కొనియాడారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పటికి మూడు సార్లు లాక్మెఫ్యాషన్ వీక్‌లో నా డిజైన్స్‌ని ప్రదర్శించాను.

మొదటి డిజైనింగ్‌కి, ఇప్పటి డిజైనింగ్‌కి మధ్య వ్యత్యాసం...
శశి: ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు ‘నా వర్క్ కొనుగోలుదారులకు నచ్చుతుందో లేదో.. అని చాలా భయపడ్డాను. అలాగే మొన్నటి లాక్మే ఫ్యాషన్ వీక్‌లోనూ మొదటిసారి డ్రెస్ డిజైన్ చేసినంత భయపడ్డాను. మనసు పెట్టి డిజైన్ చేస్తాను. కానీ ‘చూపరులకు అవి ఎంత వరకు నచ్చుతాయో!’ అని భయపడతాను. ఇంకా మెరుగుపరు చుకోవడానికి కృషి చేస్తుంటాను. ఆ విధంగా సృజన, పని.. పెరుగుతూనే వస్తోంది.

డిజైనింగ్‌లో మీ గరువు...
శశి: ఫ్యాషన్ డిజైనర్ అపర్ణా రాథోర్ ఈ రంగంలో నాకు అతి గొప్ప గురువు. ఆవిడతో పది నిమిషాలు మాట్లాడినా చాలు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ పదేళ్లుగా ఆమె నా డిజైన్స్‌కి సలహాలు ఇస్తూనే ఉన్నారు.
 
సినిమాలకు చేసిన వర్క్?
శశి: తెలుగులో మార్నింగ్ రాగా (రాఘవేంద్రరావు తనయుడు హీరోగా) సినిమాకు చేశాను. ఆ తర్వాత ఆఫర్స్ వచ్చాయి. కానీ, ఈ వర్క్ సృజనకు సంబంధించింది. కొంత వ్యవధి, షరతులు ఉంటే వర్క్ సరిగ్గా రాదు. ఆ విధంగా పేరున్న దర్శకుల నుంచి ఆఫర్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాను.
 
అత్యంత ఎక్కువ కష్టం అనిపించిన సందర్భాలు...?
శశి: ప్రతీ నెలా డబ్బు పరంగా కష్టపడుతూనే ఉంటాను. ఇక మొన్నటి లాక్మె ఫ్యాషన్ వీక్‌కైతే డిజైనింగ్‌కి తక్కువ సమయం ఉంది. పైగా రంజాన్ మాసం. మాస్టర్స్ అందుబాటులో ఉండటం కష్టమైంది. నెలరోజులు తిండీ, నిద్ర పట్టించుకున్నదే లేదు. మొత్తం 14 డిజైన్స్. అన్నీ పూర్తయి, ప్రదర్శన ఇచ్చేంతవరకు నేను నేనుగా లేను.
 
ఈ రంగంలో అమితానందాన్నిస్తున్నవి?
శశి: పదేళ్ల క్రితం కస్టమర్లు ఇప్పటికీ నా డిజైన్స్ కోసం వస్తుంటారు. నా డిజైన్స్ వారికి ఇంకా నచ్చుతున్నాయనేది  అమితానందం. అలాగే, ‘బట్టలు కుడతావా!’ అని ఆశ్చర్యపోయిన మా నాన్న ఈ రోజు ఏ పేపర్‌లో నా డిజైన్స్ వచ్చినా, ఇంటర్వ్యూ వచ్చినా అన్నీ ఫైల్ చేస్తుంటారు.
 
మీ డిజైనింగ్‌లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యం?
శశి: నా ఎఫర్ట్‌లో ఎక్కువ శాతం బ్లౌజ్ డిజైనింగ్‌పైనే. ‘శశి బ్రాండ్’ అనేలా ఉంటుంది బ్లౌజ్. అలాగే ఏ డిజైన్ అయినా హ్యాండ్లూమ్ వాడతాను. వాటిలో ప్రకృతి సిద్ధమైన రంగులు, ప్రింట్లు, డిజైన్లు ఉండేలా జాగ్రత్తపడతాను. ఇలాంటివాటిలో భారతీయ ఆత్మ కనిపిస్తుంది.

ఈ రంగంలో పోటీ గురించి...?
శశి: ఇక్కడ కొనుగోలుదారుడే దేవుడు. వారిని మెప్పించడానికి చాలా కాలం ముందుకు వెళ్లి, వారి ఇష్టాయిష్టాలను ముందే ఆలోచించి, డిజైన్స్ సృష్టించాలి. అంతేకాదు, ఒక డ్రెస్ డిజైన్ చేస్తే.. దాని ప్రత్యేకత గురించి మనమే కొనుగోలు దారులకు వివరంగా చెప్పగలగాలి. ఆ విధంగా ఈ రంగంలో ఉన్నంత కష్టం, పోటీ మరే దాంట్లో ఉండదనిపిస్తుంది. అయితే కష్టానికి తగిన ఫలితమూ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement