డిజిటల్ టెక్... పల్లెకు జోష్! | Digital Tech ...   Josh open! | Sakshi
Sakshi News home page

డిజిటల్ టెక్... పల్లెకు జోష్!

Published Thu, Mar 20 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

డిజిటల్ టెక్...  పల్లెకు జోష్!

డిజిటల్ టెక్... పల్లెకు జోష్!

చెట్టు మీద కాయ.. సముద్రంలో ఉప్పు కలిస్తే...? రుచులూరించే ఊరగాయ!
మరి ఈ ఉపమానం డిజిటల్ ప్రపంచానికీ వర్తిస్తుందా?
ఇంటర్నెట్ లోకంలో విరివిగా ఉన్న సమాచారాన్ని...
టీచర్లు, సౌకర్యాలు అరకొరగానే ఉండే పల్లెలకు చేర్చవచ్చా?
కొంత ఆలోచన... ఇంకొంత చిత్తశుద్ధి... మరికొంత పట్టుదల ఉంటే
అసాధ్యమేమీ కాదంటారు వినయ్ వెంకటరామన్!
మాటలతోనే ఆగిపోకుండా... గ్రామాల్లోని తరగతి గదుల్ని కూడా
ఆధునిక వర్చువల్ క్లాస్‌రూమ్స్‌గా మార్చేశారు కూడా..
పిసరంత ఖర్చుతో బోలెడు సామాజిక మేలుకు నాంది పలుకుతున్న
ఈ ‘ఫ్రూగల్ డిజిటల్’ ఆవిష్కరణలేమిటో మీరే చూడండి!
 
 పల్లెలకు విజ్ఞాన ‘దర్శన’ం

 గ్రామాల్లోని బడుల పరిస్థితి మనకు తెలియంది కాదు.. ఏకోపాధ్యాయ పాఠశాలలు కొన్నైతే... మరికొన్నింటిలో టీచర్ అనేవాడు ఉండడు. ఒకవేళ ఉన్నా... వస్తారో, లేదో తెలియని పరిస్థితి. డిజిటల్ ప్రొజెక్టర్ ఒక్కటి ఉంటే ఈ చిక్కులన్నింటినీ చిటికెలో అధిగమించవచ్చు. కానీ ఒక్కోదానికి ఖర్చు తడిసిమోపెడవుతుంది. చిన్న రిపేరు వచ్చినా మరమ్మతు చేయించడం మరో తలనొప్పి. మరి.. పరిష్కారం? ‘దర్శన’ అంటారు..

వినయ్ వెంకటరామన్. టెక్నాలజిస్ట్, డిజైనర్ కూడా అయిన వినయ్ డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రూగల్ డిజిటల్ రీసెర్చ్ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఓ సాధారణ త్రీజీ మొబైల్ ఫోన్‌లోని పరికరాలు... వీధిచివరి దుకాణంలో దొరికే స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో దీన్ని రూపొందించారు. మొబైల్‌ఫోన్‌లోని ప్రొజెక్టర్ (కొన్ని మోడళ్లలో లభ్యమయ్యేది) సాయంతో సిద్ధమైన ఈ డిజిటల్ ప్రొజెక్టర్‌లో ఓ యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉంటుంది. త్రీజీ కనెక్టివిటీ కారణంగా నెట్‌లో ఉండే డిజిటల్ పాఠాలు తరగతి గదిలోని గోడపై  నేరుగా ప్రత్యక్షమవుతాయన్నమాట.

గ్రామాల్లోని విద్యుత్ కోతలను దృష్టిలో ఉంచుకుని ‘దర్శన’ కోసం సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేశారు. తమిళనాడులోని నీలగిరి వద్ద మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించిన తరువాత మరికొన్ని మార్పులు చేసి శబ్ద, దృశ్య నాణ్యతలకు మెరుగులు దిద్దారు. భౌతికశాస్త్రం మొదలుకొని అన్ని రకాల బోధనాంశాలకు సంబంధించిన కాన్సెప్ట్స్‌ను వీడియోల ద్వారా అందిస్తే విద్యార్థుల అవగాహన మరింత పెరుగుతుందని, అందుకు దర్శన ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు వినయ్.
 

నాడీ పట్టే పాత గడియారం!
 

గంటకొట్టే అలారం గడియారం గురించి తెలియందెవరికి? మనం దాంట్లో టైమ్ చూసుకోవడం.. అలారం పెట్టుకోవడం వంటి ఉపయోగాలు మాత్రమే చూశాం. కానీ కొన్ని మార్పులు, చేర్పులు చేస్తే అదే గడియారం.. గ్రామీణ ప్రాంతాల్లోని ఆశా వర్కర్లు మరింత మెరుగ్గా తమ పనులు చేసే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా పల్లె జనాల అనారోగ్యాన్ని వేగంగా గుర్తించవచ్చునని వినయ్ బృందం మాత్రమే గుర్తించింది. అవును. ఇది నిజం.

ఒక యూఎస్‌బీ కనెక్టర్, టీవీ రిమోట్‌లలో ఉండే సెన్సర్.. కొన్ని ఎంబెడెడ్ మైక్రోప్రాసెసర్ల చేరికతో ఈ అలారం గడియారం అద్భుతమైన స్క్రీనింగ్ పరికరంగా మారిపోతుంది. రక్తపోటు, ఊపిరితీసుకునే వేగం, ఉష్ణోగ్రతలు, నాడి, రక్తంలో చక్కెర మోతాదు, ఆక్సిజన్ సాచురేషన్ వంటి ప్రాథమిక ఆరోగ్య సూచికలన్నింటినీ దీంతో చూడవచ్చు. గడియారం పైభాగంలో ఉండే మూడు దశల సూచీ ద్వారా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సూచీ ఎర్ర రంగు వద్ద ఆగితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, లేత జేగురు రంగు వద్ద ఆగితే ఏం ఫర్వాలేదని అర్థమన్నమాట. ఒకవేళ మధ్యలో ఉండే పసుపు ప్రాంతంలో ఆగిందనుకోండి. దగ్గరలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే సరిపోతుందన్నమాట. ఇంతకీ ఈ గడియారం పేరేమిటో తెలుసా... ‘క్లాక్ సెన్స్’!
 

ఇవే కాదు.. ఇంకొన్ని కూడా...

 చౌకైన డిజిటల్ పరికరాలతో సమాజానికి ఎంతో కొంత మేలు చేసే మరికొన్ని గాడ్జెట్స్‌ను కూడా వినయ్ వెంకటరామన్ బృందం అభివృద్ధి చేసింది. సాధారణ మొబైల్ ఫోన్‌నే రేడియో స్టేషన్‌గా మార్చేసే ‘లోకలైజ్డ్ వోకలైజ్డ్ కమ్యూనిటీ’ని దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో వర్కర్స్ వరల్డ్ మీడియా ప్రొడక్షన్ కార్యకర్తలు పరీక్షిస్తున్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంత అవసరాలు, ప్రాధాన్యతలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఉద్దేశంచిన ‘టెలి పంచాయత్’ను ముంబైలో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాయిన్‌బాక్స్ ఫోన్ల ఆధారంగా నడిచే ఈ టెలి పంచాయత్ ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను చెప్పవచ్చునన్నమాట. పరిచయమున్న కాయిన్‌బాక్స్ ఫోన్ల ద్వారానే ఓటింగ్ నడుస్తుంది.


ఫలితాలను ఎప్పటికప్పుడు కార్పొరేటర్లు, ప్రభుత్వ వర్గాల వారూ తెలుసుకోవచ్చు. చివరగా ఓషా గురించి... ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం... ఒక్క భారతదేశంలోనే దాదాపు ఏడు నుంచి ఎనిమిది కోట్ల మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో కనీసం రెండు కోట్ల మంది చిన్నపిల్లలు. తొలిదశలోనే వినికిడి సమస్యలను గుర్తించగలిగితే సగంమందికి సమస్య అనేది లేకుండా చేయవచ్చు. కానీ ఇందుకోసం ఖరీదైన పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. ఈ ఇబ్బందులేవీ లేకుండా వినికిడి సమస్యలను సులువుగా గుర్తించేందుకు తయారు చేసిన పరికరమే ఓషా. ఇది కూడా సాధారణ మొబైల్ ఫోన్ ఆధారంగానే పని చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement