తియ్యని వెన్నెల | divavali sweets | Sakshi
Sakshi News home page

తియ్యని వెన్నెల

Published Fri, Oct 28 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

తియ్యని వెన్నెల

తియ్యని వెన్నెల

కళ్లు నవ్వితే కాకర పువ్వొత్తులు. పెదవులు విచ్చుకుంటే మతాబులు.
చేయీ చేయీ కలిస్తే.. చేత వెన్నముద్దలు.
స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తే..? .. లడ్లు, గులాబ్ జామూన్‌లు!
దీపావళి... ‘అమావాస్య వెన్నెల’లా ఉంటుంది.
అంతేనా! అమ్మ చేసిన స్వీట్‌లానూ ఉంటుంది.



శక్కర్  పారా
కావలసినవి: గోధుమ పిండి- 250 గ్రాములు, నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు, నీరు- 125 మి.లీ లేదా చపాతీల పిండిలా కలుపుకోవడానికి తగినంత, నూనె- వేయించడానికి తగినంత


చక్కెర పాకం కోసం: చక్కెర- 150 గ్రా, నీరు- 50 మి.లీ, కుంకుమ పువ్వు- ఆరు రేకలు (ఇష్టమైతేనే)

 
తయారీ:  గోధుమ పిండిలో నెయ్యి వేసి కలిపిన తర్వాత నీటితో చపాతీల పిండిలా ముద్ద చేయాలి. తడివస్త్రాన్ని కప్పి పక్కన ఉంచాలి.  ఒక పాత్రలో చక్కెర పాకాన్ని సిద్ధం చేయాలి. చక్కెరలో నీటిని పోసి ఐదు నిమిషాల సేపు మరిగించాలి. చివరగా కుంకుమ పువ్వు వేస్తే చక్కెర పాకం రెడీ.  అరగంట తర్వాత గోధుమ పిండి ముద్దను మూడు భాగాలుగా చేయాలి. ఒక భాగాన్ని తీసుకుని మందపాటి చపాతీలా వత్తాలి. దానిని చాకుతో నిలువుగా గాట్లు పెట్టాలి. తర్వాత అడ్డంగా లేదా మూలగా గాట్లు పెట్టాలి. ఇప్పుడు చపాతీ పీటను జాగ్రత్తగా మరుగుతున్న నూనెలోకి వంచాలి. పిండి పలుకులుగా ఊడి నూనెలోకి జారిపోతుంది. చిల్లుల గరిటెతో తిరగేస్తూ రెండు వైపులా గట్టిగా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసి వెంటనే చక్కెర పాకంలో వేసి నిమిషం తర్వాత తీసేయాలి.  అలాగే మిగిలిన రెండు భాగాల పిండిని కూడా చపాతీల్లా వత్తి చాకుతో గాట్లుపెట్టి నూనెలో వేయించి చక్కెర పాకంలో వేయాలి.


గమనిక: శక్కర్‌పారా డైమండ్ ఆకారంలో రావాలంటే చపాతీ మీద చాకుతో ఒకసారి నిలువుగా మరోసారి మూలగా గాట్లు పెట్టాలి.

 

 

పత్తిర్ పేనీ
కావలసినవి:  గోధుమ పిండి లేదా మైదా - ఒక కప్పు నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, చక్కెర- పావు కప్పు  యాలకుల పొడి- అర టీ స్పూన్, ఉప్పు- చిటికెడు  నీరు - కలపడానికి తగినంత, నూనె- వేయించడానికి తగినంత


ఫిల్లింగ్ కోసం: బియ్యప్పిండి- రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు


తయారీ:  చక్కెర, ఏలకులు కలిపి మిక్సీలో మెత్తగా పొడి చేయాలి.మైదాలో నెయ్యి, ఉప్పు వేసి నీటితో కలపాలి. మృదువుగా ముద్దగా చేసి తడి వస్త్రంతో కప్పి పది నిమిషాల సేపు ఉంచాలి.  పిండిని చిన్న ఉండలుగా చేసుకుని వీలయినంత పలుచటి చపాతీల్లా వత్తాలి.
 

 
మరొక గిన్నెలో బియ్యప్పిండి, నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చపాతీల మీద వేసి సమంగా పరుచుకునేటట్లు రుద్దాలి. చపాతీలను అన్నింటినీ ఒకదాని మీద మరొకటి పెట్టి రోల్ చేయాలి. ఆ రోల్‌ను అంగుళం మందం ముక్కలు చేయాలి. ఒక్కొక్క ముక్కను మళ్లీ రోలర్‌తో వత్తాలి. ఇలా చేయడం వల్ల పేనీ గారె సైజులో వస్తుంది. వరుసగా పేర్చిన చపాతీలు పొరలుగా కనిపిస్తుంటాయి. వీటిని మరుగుతున్న నూనెలో వేసి రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి టిస్యూ పేపర్ మీద వేయాలి. అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకున్న తర్వాత పేనీల మీద చక్కెర పొడి చల్లాలి.


గమనిక: ఇది కర్నాటక ప్రత్యేకం

 

 

సేమ్యా పేనీ
కావలసినవి: పాలు- ఒక లీటరు, పేనీ సేమ్యా - పావు కేజీ, చక్కెర- పావు కేజీ బాదం పలుకులు- గుప్పెడు (పది పలుకులను పొడి చేసుకుని మిగిలినవి గార్నిషింగ్ కోసం ఉంచుకోవాలి), జీడిపప్పు- గుప్పెడు, కిస్‌మిస్- గుప్పెడు యాలకుల పొడి- అర టీ స్పూన్

 
తయారీ:  మందపాటి పెనంలో పాలు పోసి సన్నమంట మీద చిక్కగా సగం అయ్యే వరకు మరిగించాలి. ఇందులో చక్కెర, బాదం పొడి వేసి మరో నిమిషం పాలు మరిగించాలి. ఇప్పుడు యాలకుల పొడి, పేనీ వేసి కలిపి మంట ఆపేసి పది నిమిషాల సేపు పెనాన్ని కదిలించకుండా ఉంచాలి.  మరొక చిన్న పెనంలో నెయ్యి వేడి చేసి బాదంపలుకులు, జీడిపప్పు, కిస్‌మిస్ వేయించాలి.  వడ్డించేటప్పుడు కప్పులో సేవియా పేనీ వేసి పైన నేతిలో వేయించిన బాదం పలుకులు, జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించాలి.

 

మోతీచూర్ లడ్డు
కావలసినవి: శనగపిండి- రెండున్నర కప్పులు  చక్కెర- ఒకటిన్నర కప్పు, పాలు- పావు కప్పు ఆరెంజ్ రంగు- చిటికెడు నెయ్యి- కాల్చడానికి తగినంత  యాలకుల పొడి- ఒక టేబుల్‌స్పూన్ బాదం - పది( సన్నగా తరగాలి) పిస్తా- పది (పలుచగా తరగాలి)

 
తయారీ:  చక్కెరలో మూడు కప్పుల నీరు పోసి సన్న తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. మరిగేటప్పుడు ఒక స్పూను పాలు పోస్తే చక్కెరలోని మలినాలు పైకి తేలుతాయి. వాటిని స్పూన్‌తో తీసేయవచ్చు. పాకంలో ఆరెంజ్ కలర్ కలిపి పక్కన పెట్టాలి.  శనగపిండిలో నీరు పోసి పలుచగా కలపాలి. ఇష్టమైతే శనగపిండికి కూడా రంగు కలుపుకోవచ్చు.  బాణలిలో నెయ్యి వేడి చేసి సన్నని చిల్లుల గరిటె (పూస గరిటె) సాయంతో శనగపిండిని నేతిలో పోయాలి. బూందీ తయారవుతుంది. రెండు- మూడు నిమిషాల సేపు కాలిన తర్వాత బూందీని నేతిలో నుంచి మరొక చిల్లుల గరిటె సాయంతో తీసి చక్కెర పాకంలో వేయాలి. ఇలాగే శనగ పిండి మొత్తాన్ని బూందీ చేసుకుని పాకంలో వేయాలి.  చివరగా బూందీలో యాలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమంలో బాదం, పిస్తా పలుకులు చేరుస్తూ లడ్డు కట్టాలి. పై కొలతలతో ఇరవై నుంచి పాతిక లడ్డూలు వస్తాయి.

 

గులాబ్  జామూన్
కావలసినవి: పాల పొడి- ఒక కప్పు, మైదా- పావు కప్పు, నెయ్యి- ఒక టీ స్పూన్, బేకింగ్ సోడా- చిటికెడు  పెరుగు- రెండు టేబుల్ స్పూన్లు, బాదం, పిస్తా పలుకులు- గుప్పెడు  నెయ్యి లేదా వనస్పతి- వేయించడానికి తగినంత చక్కెర పాకం కోసం: నీరు- రెండు కప్పులు, చక్కెర- ఒకటిన్నర కప్పు, యాలకులపొడి- అర టీ స్పూన్ కుంకుమ పువ్వు- పది రేకలు, పన్నీరు- ఒక టీ స్పూన్ (ఇష్టమైతేనే)

 
తయారీ:  ఒక పాత్రలో చక్కెర, నీరు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పెట్టి సన్నమంట మీద తీగ పాకం వచ్చే వరకు మరిగించి పక్కన ఉంచాలి.  మరొక పాత్రలో పాల పొడి, మైదా, బేకింగ్ సోడా, నెయ్యి, ఒక టేబుల్‌స్పూన్ పెరుగు వేసి  కలపాలి. మిగిలిన పెరుగును పైన వేసి సమంగా పట్టించాలి. మిశ్రమం మృదువుగా ఉండాలి. రెండు చేతుల్లో వేసి వలయాకారంగా చేసినప్పుడు ఎక్కడా చారలు కనిపించనంత మృదువుగా ఉండాలి( చార ఉంటే జామూన్ వేయించేటప్పుడు ఆ చారలోనే పగులుతుంది).  బాణలిలో నెయ్యి వేడి చేసి పై మిశ్రమాన్ని చిన్న చిన్న గోళీలుగా చేసుకుని నేతిలో ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. మీడియం మంట మీద నేతిలో వేయాలి, వేసిన తర్వాత సన్న మంట మీద కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత తీసి చక్కెర పాకంలో వేసి ముంచాలి. వడ్డించేటప్పుడు జామూన్‌ల మీద పిస్తా, బాదం పలుకులతో గార్నిష్ చేయాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement