తల తిరగడం సమస్యతో బాధపడుతున్నారా?
జాగ్రత్త
తల తిరగడం అనే సమస్య దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వచ్చి ఉంటుంది. తల తిరగడానికి వర్టిగో, స్వల్ప తలనొప్పి, తల బరువు వంటి అనేక కారణాలుంటాయి. కారణం ఏదైనా సరే, తల తిరుగుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలో చూద్దాం.
తల తిరుగుతున్నట్లు అనిపించగానే ఉన్న చోటనే కూర్చోవాలి. కొంచెం నెమ్మదించిన తర్వాత తలను వలయాకారంగా తిప్పుతూ వ్యాయామం (నెక్ ఎక్సర్‌సైజ్) చేయాలి. ఈ వ్యాయామం ఎలాగంటే... తలను సవ్యదిశలో మూడుసార్లు, అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పాలి. కళ్లను కూడా సవ్యదిశలో, అపసవ్య దిశలో తిప్పాలి. ఇలా నాలుగైదు సార్లు చేసిన తర్వాత కళ్లను అరచేతులతో (వెలుతురు కళ్ల మీద ప్రసరించకుండా) ఒక నిమిషం పాటు మూసుకోవాలి.
వాహనాన్ని నడుపుతున్నప్పుడు తల తిరిగినట్లనిపిస్తే తక్షణమే వాహనాన్ని పక్కకు తీసుకుని ఆపేయాలి. ఆ తర్వాత పైన చెప్పిన వ్యాయామాన్ని చేసి నెమ్మదించిన తర్వాత తిరిగి వాహనాన్ని నడపవచ్చు. తిరగడం తీవ్రంగా ఉంటే ఎవరినైనా సహాయానికి పిలుచుకుని డాక్టరును సంప్రదించాలి.
తల తిరిగే సమస్య ఉన్నట్లుండి ఎప్పుడైనా కనిపించవచ్చు. కాబట్టి ఒకసారి ఈ లక్షణం అనుభవంలోకి వచ్చిన మధ్యవయస్కులు వ్యాయామం కోసం నడిచేటప్పుడు వాకింగ్ స్టిక్‌ను దగ్గరుంచుకోవాలి.
తల తిరిగినప్పుడు కాఫీ, ఆల్కహాలు తీసుకోకూడదు. ఇవి పరిస్థితిని మరింత విషమింపచేస్తాయి.