విశ్రమించవద్దు ఏ క్షణం...
గీతోపదేశం: చిత్రం: పట్టుదల
జీవితంలో గెలుపు, ఓటములు సహజం. కొందరికి... ఓటమి ఎదురైనా గెలుపు కోసం ప్రయత్నిస్తారు. విజేతగా నిలుస్తారు. కొందరు మాత్రం ఓటమి భారానికి కృంగిపోతారు. గెలుపు దారి వైపు తొంగి చూడడానికి కూడా భయపడతారు. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడరు. అలాంటి వారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి...’ పాట నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి.
గెలుపు సంతోషాన్ని మాత్రమే ఇవ్వచ్చు. కానీ ఓటమి అనేక సత్యాలను మనకు బోధ పరుస్తుంది.
పట్టుదల పదును దేరుతుంది. క్షణక్షణం లక్ష్యాన్ని గుర్తు తెస్తుంది.
కొత్త శక్తియుక్తులకు మనసు స్వాగతం పలుకుతుంది. విజేతగా నిలవడానికి అవసరమైన సమరోత్సాహాన్ని ఇస్తుంది.
‘ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి...
విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం’ అంటాడు కవి.
ఓటమి జీవిత కాలం ఎంత? మనలో నిస్తేజం, బద్ధకం, నిరాశ ఎంత కాలం ఉండి పోతాయో, అంతకాలం ఓటమి హాయిగా జీవిస్తుంది. అవి మనలో కనిపించనప్పుడు ఓటమి చనిపోతుంది. గెలుపు జెండా ఎగురుతుంది.
‘నిశా విలాసమెంత సేపురా
ఉషోదయాన్ని ఎవ్వడాపురా’
కొందరు సాకులు వెదుక్కోవడంలోనే సంతృప్తి పడుతుంటారు. కానీ తమలోని శక్తియుక్తులను గ్రహించరు. మన కోసం ఎవరో వచ్చి పోరాటం చేయరు. మన పోరాటం మనమే చేయాలి. ‘అది లేదు’, ‘ఇది లేదు’ అనే భావన నుంచి ‘నాకు అన్నీ ఉన్నాయి’ అనే ఆత్మసంతృప్తి వైపు మారాలి. ఈ తృప్తి నుంచే గెలుపు పదును దేరుతుంది. అందుకే, కవి మాటల్లో చెప్పాలంటే...
‘దేహముంది ప్రాణముంది
సత్తువుంది
అంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను
శ్వాస నీకు శస్త్రమౌను’