అవరోధాలతో వంతెన | Doctor Sonal Life Special Story | Sakshi
Sakshi News home page

అవరోధాలతో వంతెన

Published Fri, Aug 30 2019 7:29 AM | Last Updated on Fri, Aug 30 2019 8:20 AM

Doctor Sonal Life Special Story - Sakshi

సోనాల్‌ : విద్యావారధి

మనదేశంలో చదువుకొని, మనదేశపు పల్లెప్రజలకు సేవచేయాలనే సంకల్పంతో ప్రారంభమైన సోనాల్‌ ప్రయాణం తను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమెను ఎక్కడో సుదూర తీరాలకు చేర్చింది. ఇక్కడి వైద్యవిద్యాభారం భరించలేక అష్టకష్టాలూ పడి రష్యా వెళ్లి చదువుకొని.. మన దేశ విద్యార్థుల కోసం కిర్గిజ్‌స్థాన్‌ వైద్యవిద్యావిధానంలోనే మార్పులకు కారణమవడం ద్వారా తన స్వప్నాన్ని సాకారం చేసుకున్న సోనాల్‌తో ఫ్యామిలీ మాటామంతీ...

‘‘ఓ మధ్య తరగతి పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు పేదరికం పెద్దగా తెలియదు. కష్టాలు కన్నీళ్లు తెలియకుండా పెంచారు మా అమ్మానాన్న. నాన్న ఢిల్లీ మదర్‌ డెయిరీలో మేనేజర్‌. అమ్మ కారులో షాల్స్‌ వేసుకొని తనే స్వయంగా కారు నడుపుకుంటూ ఇంటింటికీ తిరిగి అమ్మేవారు. అలా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాం. అందుకే ఇక్కడ సీటు రాకపోతే రష్యాలో మెడిసిన్‌ చదివించారు నన్ను. నేను ఢిల్లీలోనే పుట్టినా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త మాత్రం తెలంగాణలోని ఓ పల్లెటూళ్లో పుట్టారు. వాళ్ల నాన్నగారు ఆర్‌ఎంపీ డాక్టర్‌. ఆ చిన్న ఊళ్లో ఆయన చేసే వైద్యం కోసం క్యూ కట్టేవారు. ‘అది పెద్ద విషయమేమీ కాదనీ, ప్రసవం కోసం మహిళలను మా ఊళ్లలో మైళ్లదూరం డోలెకట్టుకొని తీసుకెళ్లేవారని’ చెప్పేవారు నా భర్త. ఆయన పేరు ఫణి.

నరకమెక్కడో లేదు
ఒక స్త్రీజీవితంలో ప్రసవం దానికదే పునర్జన్మ. కానీ మన దేశంలో ప్రసవం మరణంతో సమంగా మారుతోంది చాలా చోట్ల. నన్నడిగితే నరకం ఎక్కడో లేదు. వైద్యుడు లేని చోటే నరకం అన్నది నా అభిప్రాయం.
ప్రసవం కోసం వాగులూ వంకలూ దాటుకొని గంటల తరబడి ప్రయాణిస్తారని విన్నప్పుడు, చదివినప్పుడూ నిలువెల్లా కదిలిపోయాను. మన దేశంలో వైద్యం సామాన్యులకు అందనంత దూరంలో ఉండిపోతోంది. వైద్య విద్య సంగతి ఇక చెప్పక్కర్లేదు. కోట్ల రూపాయలు పోసి వైద్య విద్యను కొనుక్కునే పరిస్థితి సాధారణ మధ్యతరగతి వారికెలా సాధ్యం? ఇదే పరిస్థితి నన్నైనా, నా సహచరుడినైనా విదేశాలకు వెళ్లి చదువుకునేలా చేసింది.

అందని వైద్య విద్య
వైద్యుడు లేని గ్రామం ఉండకూడదన్నది నా ఆలోచన. ఈ దేశంలో వైద్యుల కొరత తీరాలంటే రెండు జరగాలి. ఒకటి మన దేశంలో వైద్య విద్యకయ్యే ఖర్చు ఆకాశాన్నుంచి భూమ్మీదకు దిగిరావాలి. లేదంటే తమ పిల్లలు డాక్టరు కావాలనే తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరాలంటే మన పిల్లలే ఆ విద్య కోసం ఖర్చు తక్కువగా ఉండే దేశాలకు తరలి వెళ్లాలి. మొదటిది అసాధ్యం అని తేలిపోయింది. ఇక రెండోవిషయం పైనే నేనూ, నా భర్త చాలా రోజులు ఆలోచించాం. మనదేశంలో అందని వైద్య విద్యని మన పిల్లలకు అందుబాటులోకి తేవాలనుకున్నాం. సోవియట్‌ రష్యాలో భాగంగా ఉండి తరువాత విడిపోయిన కిర్గిజ్‌స్థాన్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి (కిర్గిజ్‌స్థాన్‌ స్టేట్‌ మెడికల్‌ అకాడమీ) మొదట కొందరు విద్యార్థులను పంపాం. ప్రస్తుతం కిర్గిజ్‌స్థాన్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీతో పాటు మరో ఎనిమిది కాలేజీలకు విద్యార్థులను పంపిస్తున్నాం. మన దేశంలో గ్రామగ్రామాన వైద్యుడు అందుబాటులో ఉండాలన్న మా ఆకాంక్ష యిప్పుడిప్పుడే కొత్తరెక్కలు విచ్చుకుంటోంది. త్వరలోనే మా అత్తగారి ఊళ్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి కట్టించే ప్రయత్నంలో ఉన్నాం.

మూడు రోజులు తిండి లేకుండా!
వైద్య విద్య ఖర్చు తక్కువే అయినా అక్కడి తిండిని తట్టుకోలేక ఇంటిపైన బెంగపెట్టుకునే విద్యార్థులెందరో. అక్కడి ఆహారపుటలవాట్లు వేరు. మన పిల్లలు ఆ తిండి తిని ఎక్కువ రోజులుండడం కష్టతరమైన పనే. రష్యాలోని కిర్గిజ్‌స్థాన్‌లో చదువుకునేప్పుడు నేను మూడు రోజులు తిండి లేకుండా గడిపాను. అప్పటికి అక్కడ మెస్‌ ఉండేది కాదు. మేమే స్వయంగా వండుకుని తినాల్సి వచ్చేది. నాతో పాటు ఉండేవాళ్లు వెళ్లిపోయారు. నాకు భాష రాదు. ఎక్కడికెళ్లాలో తెలియదు. బయటకెళితే ఏదైనా చేస్తారేమోనని ఇంట్లో చెప్పిన జాగ్రత్తల భయం. గదిలో ఓ మూలన ఆకలితో ముడుచుకు పడుకున్నా. నాకు మిత్రులు వచ్చాక కానీ తిండి దొరకలేదు. అందుకే మన దేశం నుంచి కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లే విద్యార్థులకోసం ప్రత్యేకించి మన ఆహారాన్ని అక్కడే పండించే ఏర్పాటు చేశాం. భూమిని కౌలుకు తీసుకొని మన పంటలు సైతం అక్కడ పండిస్తున్నాం. స్వయంగా తెలంగాణ నుంచి వెళ్లిన మా బంధువులతో ఆంధ్రా హాస్టల్‌నీ, మెస్‌నీ ఏర్పాటు చేశాం. మన సొరకాయలూ, మన వంకాయలూ, మన బీరకాయ పప్పుతో భోంచేసే అదృష్టం మన పిల్లలకి కిర్గిజ్‌స్థాన్‌లో కూడా సాధ్యమేనంటే నమ్మగలరా?

ఏడేళ్లు... రష్యన్‌ భాషలో..!
మేం రష్యాలోని కిర్గిజ్‌స్థాన్‌లో చదువుకున్నప్పుడు మెడిసిన్‌ ఏడేళ్ల పాటు చదవాల్సి వచ్చేది. అది కూడా రష్యన్‌ భాషలోనే విద్యాబోధన ఉండేది. అది అర్థం చేసుకోవడానికి మేం పడ్డ కష్టాలు ఆ దేవుడికే ఎరుక. అయినాసరే అక్కడ చదువు మమ్మల్నిద్దర్నీ మేమెంతగానో ప్రేమించే వైద్య వృత్తిలో నిలదొక్కుకునేలా చేయలేకపోయింది. అందుకే అందరికీ అనుకూలంగా ఉండే ఆంగ్లబోధన ఉంటే ఎంత బాగుంటుందని అనుకునేవాళ్లం. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఉంటే సరిపోదు. అది ఒంటబట్టించుకునే భాష కూడా ప్రధానమే. కిర్గిజ్‌స్థా¯Œ  విద్యావిధానంలో మార్పుకి మా శాయశక్తులా కృషి చేశాం. ఆ దేశ విద్యావిధానంలో మార్పు జరిగితేనే మన విద్యార్థులకు వైద్యవిద్య సులభమౌతుంది. మొదట రష్యన్‌ భాషలో విద్యాబోధన మన విద్యార్థులెదుర్కొంటోన్న ప్రథమ అడ్డంకి. దానికి స్వస్తి పలకాలంటే రష్యన్‌ భాషకి బదులు ఇంగ్లిషులో విద్యాబోధన ఉండాలి. అతికష్టం మీద కిర్గిజ్‌స్థాన్‌లో ఆ మార్పు తీసుకురాగలిగాం. ఏడేళ్ల వైద్య విద్యని మనదేశంలోలా ఐదేళ్లకు తగ్గించేలా చేశాం. ఈ రెండు మార్పులూ మన భారతీయ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి’’ అని ముగించారు సోనాల్‌. – అరుణ అత్తలూరిఫొటో : రఘుబీర్‌సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement