హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 40 ఏళ్లు. కొంతకాలంగా ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స అవసరమనీ, అయితే భవిష్యత్తులో తిరగబెట్టవచ్చని అంటున్నారు. మళ్లీ రాకుండా హోమియో చికిత్సతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా? – శ్రీదుర్గ, విజయవాడ
గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తుల్లా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
కారణాలు : ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి.
లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు.
చికిత్స: మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ,
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
ఆపరేషన్ లేకుండా పైల్స్ నయం చేయవచ్చా?
నా వయసు 38 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు రక్తం పడుతోంది. కొన్నిసార్లు నొప్పిగానూ ఉంటోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. హోమియోలో చికిత్స ఏదైనా ఉందా?
– రమేష్‌బాబు, కందుకూరు
పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బొడిపెల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మల విసర్జన తర్వాత వీటి బాధ ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు.
రకాలు : ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి.
కారణాలు : ∙మలబద్దకం, తగినంత నీళ్లు తాగకపోవడం ∙పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ∙గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు ∙మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ∙ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
చికిత్స : హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే కేవలం మందులతోనే సమస్య నయమయ్యేలా చేయవచ్చు. పైల్స్ చికిత్స కోసం బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలోనే వీటిని వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
స్పాండిలోసిస్‌కు పరిష్కారం చెప్పండి
నా వయసు 39 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – కె. రామారావు, నల్లగొండ
ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు.
కారణాలు : ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ∙జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ∙స్పైన్ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.
లక్షణాలు : ∙సర్వైకల్ స్పాండిలోసిస్ : మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. ∙లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి.
నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం.
చికిత్స : రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్‌స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment