డొనాల్డ్ డక్ | donald duck designed by carl barks | Sakshi
Sakshi News home page

డొనాల్డ్ డక్

Published Sun, Jan 19 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

డొనాల్డ్ డక్

డొనాల్డ్ డక్

డొనాల్డ్ డక్ అంటే తెలియనివారెవరైనా ఉంటారా? అది చేసే చేష్టలు, చిత్రమైన స్వరంతో మాట్లాడే మాటలు, తెల్లని శరీరం, పసుపు-నారింజ రంగులో ఉండే దాని ముక్కు, కాళ్ళు, పాదాలు, ఎరుపు రంగు బో టై, తలపై టోిపీ... ఎంత ముద్దుగా ఉంటుందనీ! ఎంత నవ్వు తెప్పిస్తుందనీ!
 కార్ట్టూన్ ప్రపంచంలో డొనాల్డ్ డక్‌కి ప్రత్యేక స్థానం ఉంది.

 ‘ద వాల్ట్ డిస్నీ’ సంస్థ కోసం  ‘కారల్ బార్క్స్’ అనే కళాకారుడు దీన్ని డిజైన్ చేశాడు. 1934లో ‘వైజ్ లిటిల్ హెన్’’ అనే చిత్రం కోసం డొనాల్డ్‌తో పాటు పీటర్ పిగ్ అనే మరో పాత్ర కూడా సృష్టించబడింది. నిజానికి పీటర్ పిగ్‌కే ఎక్కువ ఆదరణ లభిస్తుందని వాల్ట్ డిస్నీ సంస్థ వారు అనుకున్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ డక్ అందరి మనసులనూ దోచుకుంది. అప్పటికే బాగా పాపులర్ అయిన ‘మిక్కీమౌస్’ని కూడా వెనక్కి నెట్టేసింది.

 డొనాల్డ్ డక్‌కు ఓ పెద్ద ప్లస్... దాని వింత స్వరం. ఆ స్వరం క్లారెన్స్ నాష్‌ది. ఆయన దాదాపు 50 సంవత్సరాల పాటు దానికి డబ్బింగ్ చెప్పారు. ఆయన మరణించిన అనంతరం... ఆయన శిష్యుడు టోనీ అన్సోమో  ఆ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికీ ఆయనే డొనాల్డ్‌కి స్వరాన్ని అందిస్తున్నారు.
 డొనాల్డ్ డక్ పాత్రను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు దర్శకులు.

అందుకే దాని హావభావాలు అంతగా కట్టిపడేస్తాయి. దానికి కోపం చాలా ఫాస్టుగా వచ్చేస్తుంది. కోపాన్ని జయించడానికి అది చేసే ప్రయత్నాలు, దాని అతి తెలివైన మాటలు, డక్‌గారి కోపం వల్ల ప్రేయసి డైసీకి వచ్చే చికాకు, ఆ పైన వాటి మధ్యన జరిగే సంభాషణలు చూస్తే ఎవరైనా నవ్వకుండా ఉండలేరు.
 డొనాల్డ్ డక్‌కి మిక్కీ మౌస్, గూఫీ... ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే హుయి, డ్యూయి, లూయి అనే ముగ్గురు మేనల్లుళ్ళుంటారు. ఇంకా స్క్రూజ్ మెక్‌డక్ అనే ధనవంతుడైన అత్యాశాపరుడైన మామయ్య కూడా ఉంటాడు. ఈ అందరి మధ్య జరిగే సంభాషణలతోనే కథలు కొనసాగుతుంటాయి.

 1937లో డొనాల్డ్ ప్రధాన ప్రాతలో వచ్చిన ‘డాన్ డొనాల్డ్’ చిత్రం సూపర్ హిట్టయ్యింది.1987లో డొనాల్డ్ డక్ ప్రధాన పాత్రలో వచ్చిన ధారావాహిక డక్ టేల్స్. ఇది 1990 వరకు ప్రసారమైంది. ఆ తరువాత 1996లో ‘క్వాక్ పక్’ అనే ధారావాహికతో డొనాల్డ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం మిక్కీమౌస్ క్లబ్ హౌస్ ధారావాహికలో కనువిందు చేస్తోంది.

 ఇది 2006లో మొదలైంది. డొనాల్డ్ డక్ వీడియో గేమ్స్ కూడా వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగినది కింగ్‌డమ్ హార్ట్స్. 2002లో ‘టీవీ గైడ్’ ఆల్ టైమ్ 50 విశిష్ట కార్టూన్ పాత్రల జాబితాలో కూడా డొనాల్డ్ డక్ చేరింది. కామిక్ పుస్తక ప్రచురణ విభాగంలో కూడా దీనిది మొదటి స్థానమే.
 చిన్న-పెద్ద తేడా లేకుండా అందరినీ తన మాటలతోనూ చేతలతోనూ నేటికీ అందరినీ నవ్విస్తూనే ఉంది డొనాల్డ్. కామిక్ పాత్రే అయినా ఇది నిజం బాతేనేమో అన్పించేంతగా అది అందరి మనసులనూ దోచుకుంది.

 ఇప్పటిదాకా 150 చిత్రాలలో ‘నటించిన’ ఈ అందాల బాతు 1943లో ఆస్కార్ అవార్డునీ గెలుచుకుంది. ఇప్పటివరకూ మొత్తం 9 సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.  
 అంతా బాగానే ఉంది కానీ ... డొనాల్డ్ మన కళ్ళముందు తిరగడం మొదలుపెట్టి ఎన్నేళ్ళయిందో తెలుసా... డెబ్భై ఏళ్ళు! ఆశ్చర్యంగా ఉంది కదూ! అప్పుడేమయ్యింది! ఇంకెన్నేళ్లయినా ఇది మనల్ని అలరిస్తుంది. ఎందుకంటే... మనందరికీ ఇదంటే ఎంతో ఇష్టం కదా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement