హాలీవుడ్ అందగాడు దుబారాకు నో చెప్పాడు
సంపాదించడం కన్నా దాన్ని కాపాడుకోవడమే కష్టం. మరి కోట్ల కొద్దీ ఆస్తులున్న సెలబ్రిటీలు, కార్పొరేట్లు.. సరదాల కోసం విచ్చల విడిగా ఖర్చు చేసేస్తుంటారా? పొదుపు మంత్రం పఠిస్తుంటారా? అందరూ విజయ్ మాల్యాల్లా ఉంటారా... లేక అజీమ్ ప్రేమ్‌జీని అనుసరిస్తారా?వారి మనీ మేనేజిమెంట్ ఎలా ఉంటుంది?
హాలీవుడ్ స్టార్, టైటానిక్ సినిమా ఫేం.. లియొనార్డో డి కాప్రియో తన మనీని ఎలా మేనేజ్ చేస్తారు? ఆయన ఖర్చులెలా ఉంటాయి? దేన్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు?
రంగ స్థలం నుంచి సినిమాల్లోకి వచ్చిన డికాప్రియో ఆస్తి ప్రస్తుతం దాదాపు రూ.1200 కోట్లు. ఇక తన మనీ మేనేజ్‌మెంట్ గురించి ఆయనేమంటారంటే...
‘చిన్నతనంలో అడ్వర్టైజ్‌మెంట్లు, టీవీ సీరియల్స్ చేశా. కాస్త పెద్దయ్యాక కొన్ని చిన్నా, చితకా సినిమాలు చేసినా, టైటానిక్‌తోనే నాకు స్టార్‌డమ్, ఆఫర్లు, సంపద అన్నీ వచ్చాయి. డబ్బొస్తోంది కదాని మనీ మేనేజ్‌మెంట్ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. చేయను కూడా. నేను భారీ ఖర్చుల జోలికెళ్లను. ప్రైవేట్ జెట్‌లలో తిరగను. నా దగ్గర ఇప్పటికీ ఒకే ఒక్క కారు(టయోటా ప్రియస్) ఉంది.
డబ్బు నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే.. డబ్బుంటే నచ్చిన పాత్రల్ని మాత్రమే ఎంచుకునే స్థైర్యం ఉంటుంది. అంతేకాదు... మరింత డబ్బు సంపాదిస్తే.. ఏదో రోజు మరింత మంది ప్రజలకు, పిల్లలకు మరింత మేలు చేసే అవకాశం వస్తుంది. అందుకే నేను పెద్దగా ఖర్చు చేయను. పెట్టుబడుల విషయానికొస్తే... షేర్ మార్కెట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాను. రియల్ ఎస్టేట్‌లో బాగానే ఇన్వెస్ట్ చేశా. అలాగే మొబిల్ అనే ఇంటర్నెట్ స్టార్టప్ కంపెనీలోను, హైబ్రిడ్ కార్లు తయారు చేసే ఫిస్కర్ ఆటోమోటివ్ కంపెనీలోనూ ఇన్వెస్ట్ చేశాను.
ఆర్థిక భద్రత ఉంది కాబట్టి ధైర్యంగా సినిమాలనూ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ మధ్యే విడుదలైన ‘ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’కు సహనిర్మాతగా ఉన్నా. నా వరకు నేను పర్యావరణానికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఇంటికి సౌర విద్యుత్ అమర్చాను. ఇలాంటి పొదుపు చర్యలు పాటిస్తూనే.. సాధ్యమైనంత వరకూ వన్యప్రాణుల సంరక్షణ వంటి సేవా కార్యక్రమాల కోసం విరాళాలు ఇస్తుంటాను.’