పూర్వం కాశీలో ఓ బిచ్చగాడు ఉండేవాడు. అతను చేతులు చాచి అయ్యా అమ్మా అంటూ అడుక్కునేవాడు. అది అతని అలవాటైపోయింది. ఓమారు కాశీకి ఓ జ్ఞాని వచ్చారు. ఆయనను కలిసిన బిచ్చగాడు ‘అయ్యా, నా జీవితం మార్చుకోవడానికి ఏదైనా మార్గముంటే చెప్పండి’ అని ఎంతో వినయంగా అడిగాడు.అతని మాటలు విన్న జ్ఞాని ‘‘సరే, ఇక రేపటి నుంచి ఎవరిని కలిసినా డబ్బులు ఇవ్వమని అడుక్కోకు. దానికి బదులు మీరు బాగుండాలి అని దీవించడం మొదలుపెట్టు..’’ అన్నారు.బిచ్చగాడికి ఆయన మాటలపై నమ్మకం లేదు. అయినా తానడిగితే కదా జ్ఞాని తనకా సలహా ఇచ్చారు.. కనుక ఓ రాయి విసురుదాం అన్నట్టుగా ఆయన చెప్పినట్లే ఎవరిని కలిసినా ‘మీరు బాగుండాలి’ అని మనసారా దీవించడం మొదలుపెట్టాడు.
ప్రారంభంలో ఆ దీవెనలనుంచి పెద్దగా ఫలితమేమీ కనిపించలేదు. అయితే రోజులు గడిచే కొద్దీ అతని మాటలు బాగా ఫలించాయి. కొద్ది కాలానికే అతనికి అడక్కుండానే డబ్బులూ వచ్చాయి. కొందరైతే తమ ఇంట శుభకార్యం ఏదైనా చెయ్యదలచుకున్నప్పుడు అతని వద్దకు వచ్చి దీవెనలు అడిగి మరీ పుచ్చుకునేవారు. ఇంకేముంది ఇతని దీవెన గురించి ఊరు ఊరంతా వ్యాపించింది. అంతేకాదు, ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో వచ్చి అతని ఆశీస్సులు పొందేవారు. అందుకు బదులుగా అతని ఆకలి తీర్చేవారు. అవసరమైన వస్త్రాలు కూడా కొనిచ్చారు. ఉండటానికి ఓ ఇల్లు ఏర్పాటు చేసారు.ఒట్టి రెండు మంచి మాటలు అదే పనిగా చెప్పడంతో అతని జీవితమే మారిపోయింది. ఓ మంచి అలవాటు జీవితాన్ని మార్చేస్తుందన్న నిజాన్ని కూడా గ్రహించాడు. ఇందుకు ఈ బిచ్చగాడే నిలువెత్తు ఉదాహరణ.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment