వానొచ్చి మ్యాచ్ ఆగిపోతే ప్రాణం ఉసూరుమంటుంది.ఫ్రైడేకి కొత్త సినిమాలేమీ లేకపోతే జీవితం మీదే విరక్తి కలుగుతుంది.బ్రేకింగ్ న్యూస్ చూడకపోతే ఆ పూట బ్రేక్‌ఫాస్ట్ చేయనట్లే ఉంటుంది. క్రికెట్.. సినిమా.. రాజకీయాలు.. ఈ మూడూ దేశానికి ఎప్పుడూ నిత్యావసర సరకులే!ఇప్పుడా సరకుల్లో ఒకదానికి తీవ్రమైన కొరత ఏర్పడింది.ఎన్నికలు పూర్తయ్యేవరకు పొలిటికల్ ఫిల్మ్స్ ఆడ్డానికి వీల్లేదనిఎన్నికల సంఘం తాత్కాలికంగా కొరత విధించింది!!ఈ విరామంలో నిరీక్షణే బయోపిక్‌ల వీక్షకులకు ఊరడింపు.ఓట్ అండ్ సీ!
తీర్పు కోసం చినరాయుడి దగ్గరికి వెళ్లినప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. చినరాయుడికి కండువా సర్దుకోవడంతోనే సరిపోతోందనుకుని పెదరాయుడి దగ్గరకి పరుగెడితే.. పెదరాయుడు ఇంకేదో వ్యవహారం చూస్తూ ఉండొచ్చు. అప్పుడు మళ్లీ చినరాడి దగ్గరికి తిరిగొస్తే చినరాయుడిచ్చే తీర్పు వేరుగా ఉంటుంది. ‘కేసు పెదరాయుడి దగ్గర ఉన్నప్పుడు నేను తీర్పు చెప్పడం మర్యాద కాదు’ అనేస్తాడు చినరాయుడు. తొందరపాటు వల్ల జరిగే అనర్థం ఇది. అయితే తొందరపడకపోవడం వల్ల జరిగే అనర్థాలను ఊహించుకుని సినిమా ప్రొడ్యూసర్‌లు కింది కోర్టు నుంచి పైకోర్టుకు వెళుతుంటారు. దాంతో బాక్సు కోర్టులో ఉండిపోతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పుడు పెదరాయుడి దగ్గర ఉంది.
ఏప్రిల్ 15న తీర్పు ఇవ్వబోయిన చినరాయుడు.. ‘ఎటూ పెదరాయుడు ఏప్రిల్ 22న దీని గురించి మాట్లాడదాం అన్నాడు కాబట్టి.. అప్పటి వరకు మనం ఆగడం పెదరాయుడికి గౌరవం’ అని అనేశాడు! పెదరాయుడి దగ్గర ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒక్కటే కాదు.. కేసీఆర్ ‘ఉద్యమ సింహం’ ఉంది. అసలు ఇవి రెండూ కాదు. మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’ ఉంది. అది క్లియర్ అయితే, ఆటోమేటిగ్గా మిగతా రెండూ క్లియర్ అవుతాయి. మెయిన్ కేస్ మోదీ బయోపిక్‌ది. మే 19 లోపు ఇవేవీ క్లియర్ అవకపోవచ్చు. ఆ రోజు ఈ దేశానికి చివరి విడత ఎన్నికలు. అయితే ఎన్నికల కమిషన్ సినిమాను ఆపి ఊరుకోలేదు. సినిమా ట్రైలర్‌ను కూడా ఆపింది. ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా ట్రైలర్ ఇప్పుడు మీకు యూట్యూబ్‌లో కూడా కనిపించదు!
ఈసీకి టైమ్ ఉంటుందా?!
సుప్రీంకోర్టుకి ఈరోజు ఒక సీల్డ్ కవర్ రాబోతోంది! అందులో ఒక ‘ముఖ్యమైన అభిప్రాయం’ ఉంటుంది. ఆ ముఖ్యమైన అభిప్రాయం కేంద్ర ఎన్నికల సంఘానిది! రిలీజ్ ఆగిపోయిన బాలీవుడ్ బయోపిక్.. ‘పీఎం నరేంద్రమోదీ’పై ఎన్నికల సంఘం ఒపీనియన్ అది. సినిమా ఎలా ఉందన్నది కాదు కోర్టుకు కావలసింది. ఈ టైమ్‌లో రిలీజ్ చెయ్యడానికి తగినదా, తగనిదా అని. ఈ టైమ్‌లో అంటే.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న టైమ్‌లో. సినిమా ఎలాగూ బాగుంటుంది. తీసింది ఒమంగ్ కుమార్. ‘మేరీకోమ్’ ఆయన తీసిందే. హిట్ అయింది. ‘సరబ్జిత్ సింగ్’.. అదీ ఆయన్దే. హిట్ అయింది. ఇప్పుడు.. ‘పీఎం నరేంద్రమోదీ’. ఈ సినిమా ఏప్రిల్ 11నే విడుదల కావాలి. ఏప్రిల్ 10న ఎలక్షన్ కమిషన్ సడన్‌గా వచ్చి ‘స్టాప్’ అని అరిచింది. ‘ఎందుకు స్టాప్?’ అని నివ్వెరపోయి అడిగారు సురేశ్ ఒబెరాయ్, సందీప్ సింగ్. వాళ్లిద్దరూ ఆ సినిమా నిర్మాతలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద సినిమాను ఆపేసే పవర్ మాకుంది అంది ఈసీ. అర్థం కాలేదు అన్నారు. ‘ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కాలంలో ఓటర్లని ఏ విధంగానూ ఇన్‌ఫ్లుయెన్స్ కానివ్వం’ అంది.
ఈ సినిమా చూస్తే కొందరికి లాస్, కొందరికి ప్రాఫిట్ ఉండే ప్రమాదం ఉంది అంది. అంటే మోదీకి లాభం. రాహుల్‌కి నష్టం.‘‘ట్రయిలర్ చూసి అదే సినిమా అనుకుంటే ఎలా?’’ అని నిర్మాతలు చికాకుపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఏప్రిల్ 15న కేసు హియరింగ్‌కి వచ్చింది. ‘‘ఇదేం ఎన్నికల సంఘమండీ. సినిమాలు చూసి ఓటర్లు మారిపోయే పనైతే రాజకీయ నాయకులంతా ప్రచారం మానేసి, బయోపిక్‌లు తీయించుకునేవారు కదా’’ అని వాదించారు నిర్మాతల తరఫు న్యాయవాది. ఆ రోజు బెంచ్ మీద ఉన్నది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. ‘‘నిజమే. ట్రైలర్‌ను చూసి సినిమాను ఆపేయాలని నిర్ణయానికి వచ్చినట్లున్నారు మీరు. బహుశా మీకు సినిమాను చూసే తీరిక లేక పోయుండాలి. అందువల్ల మీరొకసారి సినిమాను స్పెషల్‌గా వేయించుకుని చూసి శుక్రవారం లోపు (ఈరోజు) సీల్డ్ కవర్‌లో పెట్టి మీ అభిప్రాయాన్ని పంపండి’’ అని చెప్పారు. ‘‘మళ్లీ మనం ఏప్రిల్ 22 న ఈ కేసు గురించి ఆలోచిద్దాం’’ అని కూడా అన్నారు. నిన్నటి వరకైతే కోర్టుకు సీల్డ్ కవరేమీ వెళ్లినట్లు లేదు. ఈరోజు వచ్చినా ఉపయోగం ఏమీ లేదు. గుడ్ ఫ్రైడే కదా! కోర్టుకు సెలవు.
ట్రైలర్‌లో ఏముంది?!
ఏముంటుంది? గోద్రా దెయ్యం ఉంటుందా? ఉండదు. జింగోయిజం ఉంటుందా? ఉండదు. జింగోయిజం అంటే ‘మన దేశమే గొప్ప’ అనే వాదం. అది ఎందుకు ఉంటుంది, ఉన్నా డైరెక్టుగా ఎందుకు ఉంటుంది? మంత్రులతో కయ్యం నెయ్యం ఉంటాయా? ఉంటే అది ‘పీఎం నరేంద్ర మోదీ’ ఎందుకవుతుంది? మన్మోహన్‌సింగ్ మీద వచ్చిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మూవీ అవుతుంది కానీ. మరేం ఉంది ట్రైలర్‌లో?! ఎందుకు ఈసీ ‘అప్పుడే విడుదలొద్దు’ అనేసింది? మోదీని మించిన దేశభక్తుడు లేడన్నట్లుంది ట్రైలర్. వివేక్ ఒబెరాయ్ (మోదీ) కెమెరా వైపు కోపంగా చూస్తూ.. ‘‘పాకిస్తాన్‌ని హెచ్చరిస్తున్నాను. మాపై చెయ్యెత్తితే ఆ చెయ్యిని నరికేస్తాం’’ అంటాడు! ఇలా అన్నంత మాత్రాన మోదీకి ఓట్లు పడిపోతాయని కాదు. తనకున్న నిబంధనల ప్రకారం వెళుతోంది ఎలక్షన్ కమిషన్.‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా షూటింగ్ ఈ ఏడాది జనవరి 27న గుజరాత్‌లో మొదలైంది.
మోదీ బాల్యం, రాజకీయ ప్రయాణం.. ఇలాంటి ముఖ్యమైన సీన్‌లు కొన్ని ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో తీశారు. సినిమా చివరి సన్నివేశాల కోసం ముంబై వెళ్లారు. ఉత్తరకాశీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు వివేక్ ఒబెరాయ్ గాయపడ్డారు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్. మార్చి మొదటి వారానికి సినిమా దాదాపుగా పూర్తయింది. ఈ లోపు ఎన్నికల షెడ్యూలు వచ్చిపడింది. అరకొర ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాక ఏప్రిల్ 11న రిలీజ్ అనుకున్నారు కానీ, అదే రోజు ఎన్నికలు మొదలవడంతో సినిమా ఆగిపోయింది. నిర్మాతలు కోర్టుకు వెళ్లారు. అయితే తన ధర్మం ప్రకారం ఎన్నికల విడతలన్నీ పూర్తయే వరకు బయోపిక్‌ల విడుదలకు అనుమతి ఇవ్వడం కష్టమని ఈసీ అంటోంది. ఇప్పుడు సీల్డ్ కవర్‌లోనూ అదే ఉంటుందనుకోవాలి. మోదీ పీఎం కదా అని రిలీజ్‌కి ఓకే చెప్పదు. రామ్‌గోపాల్ వర్మ ముక్కుసూటి డైరెక్టర్ కదా అని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ముకుతాడు వేయ కుండా ఉండదు.
సాధారణంగా పైకోర్టులో కేసు నలుగుతున్నప్పుడు కింది కోర్టులు ఏమీ చెయ్యడానికి ఉండదు. నిర్మాతలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 22న రిలీజ్ అనుకున్నారు. మార్చి 29కి వాయిదా పడింది. ఆ రోజున తెలంగాణలో విడుదలైంది. ఆంధ్రాలో బ్రేక్ పడింది. ఆ సినిమాలో చంద్రబాబును విలన్‌గా చూపించాడు వర్మ. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ సినిమా రిలీజ్ అయిందంటే.. పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని టీడీపీ నుంచి కొందరు కోర్టుకు వెళ్లారు. సినిమా ఆగిపోయింది. కేసు ఏప్రిల్ 3న హియరింగ్‌కి వచ్చింది. అప్పటికే నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీంకోర్టులో స్పెల్ లీవ్ పిటిషన్ ఫైల్ చెయ్యడంతో కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది.
ఆ తర్వాత మళ్లీ ఆగస్టు 15కి వాయిదా పడింది. ఈలోపు ఆంధ్రాలో ఎన్నికలు అయిపోయాయి. ‘ఉద్యమ సింహం’ విడుదల కూడా ఇలాగే, ఇవే కారణాలతో ఆగిపోయింది! అయితే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. అది కేసీఆర్ బయోపిక్. అల్లూరి కృష్ణంరాజు డైరెక్టర్. ఫస్ట్ లుక్ 2018 నవంబరులోనే రిలీజ్ అయింది. 2019లో సినిమా రిలీజ్ అనుకున్నారు. ఈలోపు లోక్‌సభ ఎన్నికలు ఊడిపడ్డాయి. తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి కనుక ఇప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు కదా. కానీ ఒకే కేసులో ఉన్న ఈ మూడు సినిమాలకూ ఒకే తీర్పు ఉంటుంది. అదింకా రాలేదు. అప్పుడే అన్నిటికీ ఒకేసారి విముక్తి.
Comments
Please login to add a commentAdd a comment