ముస్లింలు జరుపుకునే రెండు ప్రధాన పండుగల్లో ఈదుల్ ఫిత్ర్ ఒకటి. దీన్నే సాధారణంగా రమజాన్ పండుగ అని వ్యవహరిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారు మక్కా నగరం నుండి మదీనా నగరానికి వలస వెళ్ళిన పద్ధెనిమిది నెలల తరువాత, రమజాన్ నెల మరి రెండురోజుల్లో ముగుస్తుందనగా, హిజ్రిశకం రెండవ సంవత్సరంలో సదఖ, ఫిత్రా, ఈద్ నమాజులకు సంబంధించిన ఆదేశాలు అవతరించాయి.‘‘ఎవరైతే పరిశుధ్ధతను పొంది, అల్లాహ్ నామాన్ని స్మరిస్తూ ఈద్ నమాజు ఆచరించారో వారు సాఫల్యం పొందుతారు.’ అని ఖురాన్ చెబుతోంది.ఒకసారి హజ్రత్ అబుల్ ఆలియా.. అబూఖుల్ దాతో.. ‘రేప మీరు నమాజు కోసం ఈద్ గాహ్‌కు వెళ్ళేముందు ఒకసారి నావద్దకు వచ్చి వెళ్ళండి.’అన్నారు.మరునాడు అబూఖుల్దా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు.. ‘‘ఏమైనా భుజించారా?’’ అని అడిగారు.‘‘అవును, భుజించాను’’ అన్నారు ఖుల్ దా‘‘గుస్ల్ (స్నానం) చేశారా?’’ అని మళ్ళీ ప్రశ్నించారు.‘చేశాను.
అన్నారాయన‘‘మరి, జకాత్, ఫిత్రాలు చెల్లించారా??’ అని అడిగారు మళ్ళీ.‘‘ఆ..ఆ.. చెల్లించాను.’’ అన్నారు అబుల్ ఖుల్దా.’శుభం. ఇక చాలు.. ఈవిషయాలే అడుగుదామని రమ్మన్నాను. ఖురాన్ వాక్యంలోని సారాంశం కూడా ఇదే’ అన్నారు అబుల్ ఆలియా.పవిత్రఖురాన్‌లో ‘ఈద్ ’ అనే పదం ఓ ప్రత్యేక అర్ధంలో మనకు కనిపిస్తుంది. సూరె మాయిదాలో దైవ ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం, ఆకాశం నుండి ‘మాయిదా’ను(ఆహార పదార్ధాలతో నిండిన పళ్ళెరాలు)అవతరింపజేయమని దైవాన్ని వేడుకున్నారు. ‘ప్రభూ..! మాముందు వడ్డించిన విస్తరినొకదాన్ని ఆకాశం నుండి అవతరింపజేయి. అదిమాకూ, మా పూర్వీకులకూ, రాబోయే తరాలకూ ఈద్ (పండుగ)రోజు అవుతుంది.’ అని ప్రార్ధించారు.తరువాత, ఆయన ఇజ్రాయేలీయులతో, మీరు 30 రోజుల వరకు ఉపవాస వ్రతం పాటించి, ఆకాశం నుండి ‘మాయిదా’ వర్షింపజేయమని అల్లాహ్ ను ప్రార్థించండి. ఆయన మీ వేడుకోలును స్వీకరిస్తాడు. ఎందుకంటే, స్వయంగా ఆచరించిన వారికే దాని ప్రతిఫలం లభిస్తుంది.’ అన్నారు.
వారి మాట ప్రకారం, ఇజ్రాయేలీయులు 30 రోజులు ఉపవాసం పాటించారు. దాంతో ఆకాశం నుండి ‘మాయిదా’ అవతరించింది. అది ఎంత తిన్నా తరిగేది కాదు. అందుకే మాయిదా అవతరణను క్రీస్తుమహనీయులు పండుగ(ఈద్)తో పోల్చారు. అంటే, దైవానుగ్రహాలు పొంది సంతోషాన్ని, ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయడం ప్రవక్తల సంప్రదాయం అన్నమాట. ఈ విషయం పవిత్ర ఖురాన్‌లో ఇలా వుంది: ‘ప్రవక్తా.!వారికిలా చెప్పు. ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, కారుణ్యమే. దానికి వారు ఆనందోత్సాహాలు జరుపుకోవాలి.’(10–58)ఆయన అనుగ్రహాల్లో అత్యంత గొప్ప అనుగ్రహం పవిత్రఖురాన్ అవతరణ. ఇది మానవాళి మార్గదర్శిని.రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి.అల్లాహ్ అనుగ్రహాలను గురించి గనక మనం ఆలోచించగలిగితే, మానవ మనుగడకోసం ఆయన ఎన్ని ఏర్పాట్లు చేశాడో అర్ధమవుతుంది. మానవుడు మాతగర్భం నుండి భూమిపై పడగానే అతని కోసమే సృష్టిమొత్తం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇన్ని అనుగ్రహాలు తమపైకురిపించినందుకు కృతజ్ఞతగా ప్రవక్త మహనీయులవారి సంప్ర దాయం వెలుగులో భక్తిశ్రద్ధలతో ‘ఈద్’ జరుపుకుంటారు. అధికంగా ఆరాధనలు చేస్తారు. సదఖ, ఖైరాత్, ఫిత్రా, జకాత్ తదితర పేర్లతో దానధర్మాలు చేస్తారు.పేద సాదలు కూడా తమతో పాటు పండుగ సంతోషంలో పాలుపంచుకునేలా ఫిత్రాల రూపంలో ఆర్థికంగా సహకరిస్తారు. రమజాన్ నెలవంక దర్శనంతో మొదలైన ఉపవాసాలు నెలరోజుల తరువాత షవ్వాల్ చంద్రవంక ను చూడడంతో విరమిస్తారు. ఈ పండుగనే ‘ఈదుల్ ఫిత్ర్’అంటారు.పండుగరోజు ముస్లిములందరూ పొద్దున్నే స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజ్ చేస్తారు. అనంతరం నూతన వస్త్రాలు ధరించి, అత్తరు, పన్నీరు లాంటి సుగంధాలు రాసుకొని ఆంనందోత్సాహాలతో ‘ఈద్ గాహ్’ కు బయలుదేరతారు.
అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజా వ్రతం పాటించే మహాభాగ్యం కలగజేసినందుకు, మానవుల మార్గదర్శకం కోసం, సాఫల్యం కోసం పవిత్రగ్రంథం అవతరింపజేసినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రెండు రకతులు నమాజ్ చేస్తారు.తరువాత ‘ఇమాం’ ఖురాన్, హదీసుల వెలుగులో సమాజానికి దిశా నిర్దేశన చేస్తూ సందేశ మిస్తాడు. అందరూ కలిసి దేవుని గొప్పదనాన్ని, ఘనంగా కీర్తిస్తారు. తమకోసం, తమ కుటుంబాలకోసం, బంంధు మిత్రుల కోసం, దేశంకోసం, దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం, ప్రపంచ శాంతి కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు.
పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన తీపి వంటకాలను కులమతాలకతీతంగా మిత్రులు స్నేహితులందరికీ ‘ఈద్ ముబారక్’ శుభాకాంక్షలతో పంచి పండుగ జరుపుకుంటారు. ఈవిధంగా ‘ఈదుల్ ఫిత్ర్’ పండుగ మానవ సమాజంలో నైతిక, మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది. పరోపకార గుణాలను సహనం, సానుభూతి భావాలను ప్రోది చేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. అల్లాహ్ మనందరికీ సన్మార్గ భాగ్యం ప్రాప్తింపజేయాలని, ప్రపంచం సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
ఈద్ నమాజ్ ఇలా...
అందరూ ఈద్ గాహ్‌కు చేరుకున్న తరువాత వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. ఇమాం అగ్రభాగంలో నిలబడి ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్‌లతో రెండు రకతులు నమాజ్ చేయిస్తాడు. ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తరువాత, అల్లాహు అక్బర్ అని రెండుచేతులు పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తరువాత ‘సనా’పఠించి, మళ్ళీ అల్లాహు అక్బర్ అని పలికి చేతులు పైకెత్తి కిందికి వదిలెయ్యాలి. ఇలా రెండుసార్లు చేసి మూడవసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సూరె ఫాతిహా తరువాత, మరొక చిన్నసూరానో, లేక కొన్ని వాక్యాలో పఠించి రుకూ, సజ్దాలు చేస్తాడు.
తరువాత రెండవ రకతుకోసం నిలబడి మళ్ళీ సూరె ఫాతిహా, మరికొన్ని వాక్యాలు పఠించి మూడు సార్లు అల్లాహు అక్బర్ అంటూ మూడుసార్లూచేతులు పైకెత్తి కిందికి వదిలేస్తారు. నాల్గవ సారి అల్లాహుఅక్బర్ అంటూ రుకూ చేస్తారు. తరువాత సజ్దాలు చేసి, అత్తహియ్యాత్, దురూద్‌లు పఠించి ముందు కుడి వైపుకు,తరువాత ఎడమ వైపుకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్బీర్ లతో రెండు రకతుల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈద్ నమాజులో అజాన్, అఖామత్‌లు ఉండవు. తరువాత ఇమాం మింబర్ (వేదిక) ఎక్కి ఖురాన్, హదీసుల వెలుగులో ప్రస్తుత పరిస్థితులను అన్వయిస్తూ సమాజానికి సందేశం ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment