‘‘మెటర్నిటీ లీవ్ అయిపోయి తిరిగి వర్క్‌కొచ్చేటప్పటికి నా ప్లేస్‌లో ఇంకో వ్యక్తిని అపాయింట్ చేసుకున్నారు. నేను మళ్లీ జాబ్‌లోకి వస్తానని అనుకోలేదట. తిరిగి వచ్చినందుకు నా పోస్ట్ నాకు ఇవ్వాలి కదా... కానీ అలా చేయలేదు. ఎలాగైనా నన్ను వెనక్కి పంపించేయాలనే ప్లాన్‌లోనే ఉంది. ప్రతిరోజూ ఆఫీస్‌లో నేను ఏమేం పనులు చేస్తానో రిపోర్ట్ తయారు చేయమని ఆర్డర్ చేశారు. ఏదో తప్పు వెదకడం మొదలుపెట్టారు. ప్రతిభాసామర్థ్యం గల ఉద్యోగి నుంచి నన్ను ఏమంత ప్రాధాన్యత లేని సాధారణ ఉద్యోగిగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ రకమైన బెదిరింపులను విధిలేక ఏడు నెలల పాటు భరించాను.
ఇక నా వల్ల కాదు. అవసరం కూడా లేదని ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటూ తాను ఎదుర్కొన్న వివక్ష, వేధింపుల గురించి చెప్పుకొచ్చింది అదితీ మిశ్రా. యాజమాన్యం వేధింపులకు జడిసి ఇంకెక్కడా తాను ఉద్యోగంలో ఇమడలేనేమోనని భయం పెట్టుకుని ఆమె ఉద్యోగం వదిలేసి... బిడ్డను పెంచుతూ ఇంట్లోనే కూర్చుండి పోలేదు. బయోటెక్నాలజీలో బీటెక్, ఎంబీఏ మార్కెటింగ్ సేల్స్ చేసిన కామన్‌వెల్త్ గేమ్స్‌కి సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ, జయ్‌దీప్ గ్రూప్, సుబ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీల్లో పనిచేసిన అనుభవం, కంపెనీ అనుచిత ధోరణి అదితిని ఇంటికే పరిమితం చేయలేదు. ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసి, ఓ పారిశ్రామికవేత్తగా మార్చింది.
ప్లెటానో ఫుడ్స్..
యాభై శాతం మంది మహిళా ఉద్యోగులతో నోయిడాలో ప్లెటానో ఫుడ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది అదితి. ఆహార సమస్యకు సుస్థిర పరిష్కార మార్గాలు చూపే సంస్థ అది. వ్యవసాయోత్పత్తుల వ్యర్థాలను బలవర్ధకమైన, రుచికరమైన ఆహారంగా మారుస్తుందీ ప్లెటానో ఫుడ్స్. ప్రస్తుతం కోల్డ్‌స్టోరేజ్‌కి పనికిరాని అరటిపళ్లతో గ్రీన్ బనానా పిండిని తయారుచేస్తోంది. ‘‘ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. చూడ్డానికి కంటికి నదురుగా కనిపించినవే రుచిగా ఉంటాయనే నమ్మకంతో ఉంటారు జనం.
కాని ప్రకృతి అన్నిటినీ ఒకేలా సృష్టించదు కదా. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. చూడ్డానికి బాగోలేవని కొననివి.. వాడనివి అన్నీ వ్యర్థాలుగా చెత్తకుండిలోకి పోతాయి. అందుకే సప్లయ్‌చైన్‌లో ఉన్న ఇలాంటి వ్యర్థాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం’’ అంటుంది అదితి. ప్లెటానో ఫుడ్స్ ఉత్పత్తి అయిన ఈ గ్రీన్ బనానా ఫ్లోర్ అత్యుత్తమ ఆహారంగా పేరు తెచ్చుకుందట. 20 లక్షల పెట్టుబడితో మొదలైన ఈ సంస్థ లాభాల గ్రాఫ్‌నే చూపిస్తోందట.
నిరుత్సాహపడకుండానే..
ఈ ఫుడ్ సంస్థను స్థాపించాలనుకున్నప్పుడు తిరుచిరాపల్లిలోని నేషనల్ బనానా రీసెర్చ్ సెంటర్‌లో చేరింది. అరటి పిండితో కుకీస్, బిస్కట్స్ చేయాలి అని ఆమె చెప్పినప్పుడు అక్కడి సైంటిస్టులు అసాధ్యం అన్నారట ఇంకో మాట లేకుండా. 30 శాతం అరటి పిండి, మిగిలిన 70 శాతం మైదాలాంటి పిండిని కలిపితేనే కుకీస్, బిస్కట్స్ తయారవుతాయని ప్రయోగం చేసీ మరీ చూపించారట కూడా. అయినా అదితి అధైర్యపడలేదు.. తాను అనుకున్న ఆలోచనను మళ్లించుకోలేదు. సొంతంగా ప్రయోగాలు చేసి చివరకు వంద శాతం అరటిపిండితో కుకీస్, బిస్కట్స్ తయారు చేయొచ్చు అని చేసి మరీ నిరూపించిందట. ‘‘స్థానిక మీడియా, సోషల్ మీడియా భాగస్వామ్యంతో మా బ్రాండ్ పట్ల అవగాహన కల్పించాలనుకుంటున్నాను. అంతేకాదు భవిష్యత్‌లో బనానా ఫ్లోర్‌తో బ్రెడ్, పాస్తా, పిజ్జా బేస్‌ను తయారు చేస్తే ప్లాన్‌లో ఉన్నాం’’ అంటుంది అదితీ మిశ్రా.
నేపథ్యం..
అమ్మాయిలకు చదువు ఉండాలి కాని బయటకు వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనుకునే సంప్రదాయ ఉమ్మడి కుటుంబ నేపథ్యం ఆమెది. బీటెక్ తర్వాత తల్లిదండ్రులు ఆమెను ఎంబీఏ చదవడానికి పంపిస్తుంటే బంధువులంతా ‘‘అమ్మాయికంత చదువెందుకు.. పెళ్లిచేసి అత్తారింటికి పంపేయక? అని చాలా నిరుత్సాహపర్చారట. అయినా ఆమె పేరెంట్స్ వినకుండా ఆమెను ప్రోత్సహించారు. ఎంబీఏ అయిపోయి ఉద్యోగంలో చేరినప్పుడూ బంధువుల పోరు తప్పలేదట. ‘‘ఇంకెన్నాళ్లు ఇంట్లో ఉంచుకుంటారు? వయసు ఎక్కువవుతుంటే ఆడపిల్లకు పెళ్లి కష్టం.. త్వరగా పెళ్లిచేసేయండి అంటూ! ఆ మాటలనూ లెక్కచేయక ఉద్యోగం చేసి తన కాళ్లమీద తాను నిలబడేలా కూతురు వెన్ను తట్టారు అదితీ అమ్మా, నాన్న. అందుకే అంటుంది అదితి ‘‘నాలో ఆత్మవిశ్వాసం నింపి.. ఈ రోజు పదిమందికి ఉపాధి కల్పించేలా నన్ను నిలబెట్టింది మా పేరెంట్సే’’ అని.
Comments
Please login to add a commentAdd a comment