
బారులు తీరును కురులు
బ్యూటిప్స్
జుట్టును స్ట్రెయిటెనింగ్ చేసుకోవడం కోసం కొందరు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి జుట్టును పాడు చేసుకుంటారు. అలా చేయకుండా ఇంటి చిట్కాను పాటించండి. ఒక కప్పు ముల్తానీ మట్టిలో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసి నీళ్లతో బాగా కలపండి. అందులో ఒక గుడ్డు తెల్లసొనను వేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత జుట్టును స్ట్రెయిట్‌గా దువ్వుకుంటూ ఈ మిశ్రమంతో ప్యాక్ వేసుకోండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలంటు స్నానం చేయండి. మీ జుట్టు స్ట్రెయిట్ గానే కాక నిగారిస్తుంది కూడా.
జుట్టుకు కండీషనర్ రాసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మాడుకు తగలనివ్వకండి. కేవలం జుట్టు సగభాగం నుంచి మాత్రమే అప్లై చేసుకోండి. అందులోని రసాయనాలు మాడుకు తగిలితే కుదుళ్ల దగ్గరుండే ఆరోగ్యకరమైన ఆయిల్స్ తొలగిపోతాయి. అంతేకాకుండా మార్కెట్‌లోని కండీషనర్లతో కాకుండా ఏ పెరుగుతోనో కొబ్బరిపాలతోనో జుట్టును కండీషన్ చేసుకోవడం మేలు.
జుట్టుకు సరైన పోషకాలు అందాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు మాడుకు నూనెను రాసుకోండి. అలాగే పెద్ద పళ్ల దువ్వెనతో కుదుళ్లకు తగిలేలా దువ్వుకోవాలి. రోజూ కుదరని వాళ్లు వారానికి నాలుగుసార్లు ఇలా చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. అందుకు ఆలివ్ ఆయిన్‌ను కానీ కొబ్బరి నూనెను కానీ ఉపయోగించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కురులు బారులు తీరక మానవు.