సూర్యుడు ఏడాదిలో ప్రతినెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే.. ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. ఆదిత్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి.. మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం.
∙ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో గోదాదేవి విరచిత తమిళ పాశురాలు వినిపిస్తుంటాయి. శ్రీరంగనాథుడి భక్తురాలైన గోదాదేవి నెల రోజుల పాటు రోజుకో పాశురం చొప్పున కృష్ణలీలల్ని కీర్తిస్తూ శ్రీవ్రతం ఆచరించింది. ఈ 30 పాశురాలు ‘తిరుప్పావై’ పేరుతో ప్రఖ్యాతి గాంచాయి.ధనుర్మాసంలో విష్ణుభక్తులే కాదు, శివభక్తులు కూడా పాశురాలు పాడుకుంటారు. తమిళనాడులోని శివాలయాల్లో తిరువెంబావై పాశురాలు వినిపిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్ ఈ పాశురాలను రాశారు.
శివ తత్వాన్ని తెలిపే ఈ పాశురాల సంఖ్య కూడా 30. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవాడు మాణిక్య వాచకర్. చిన్ననాటి నుంచి శివ భక్తుడు. ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే మదురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవాడు మాణిక్య వాచకర్. నగర వీధుల్లో నడుస్తూ తిరువెంబావై పాశురాలను రాగయుక్తంగా ఆలపించేవాడు. ఆ అమృతగానం విని మదురై వాసులంతా ఆయనతో గొంతు కలిపే వారు. అలా మొదలైన తిరువెంబావైని నేటికీ ఆచరిస్తూనే ఉన్నారు. తమకు మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ ఆడపిల్లలు తిరువెంబావై పాశురాలను పాడుకోవడం పరిపాటి. తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో ధనుర్మాసమంతా సుప్రభాత సేవలో గోదాదేవి పాశురాలు ఆలపిస్తారు. గోదాదేవి కృష్ణభక్తికి ప్రతీకగా శ్రీవారి పవళింపు సేవ రజతకృష్ణస్వామి మూర్తికి నిర్వహిస్తారు.
మనల్ని నీడలా అనుసరించేది వీరే..!
చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ.. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయసంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.
పండుగ పర్వం ఉత్తర ద్వారాన వైకుంఠ వాసుడు
మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఇది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా ప్రతీతి. దీనికే ముక్కోటి ఏకాదశి అని పేరు. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు.
(18, మంగళవారం ముక్కోటి)
గీతాజయంతి
మార్గశిర శుద్ద ఏకాదశి గీతా జయంతి. ఈవేళ భగవద్గీత పారాయణం, పార్ధసారధిని (కృష్ణుని) ఆరాధన చేయడం మంచిది.
హనుమద్వ్రతం
మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్భక్తులు హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారు. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందని చెబుతారు.
(20, గురువారం హనుమద్వ్రతం)
దత్త జయంతి
మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే త్రిమూర్తి స్వరూపం. ఈ వేళ అనఘావ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే.. సకల పాపాలు తొలగుతాయి.
కోరల పున్నమి
కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రలుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం.. యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
(22, శనివారం దత్త జయంతి, కోరల పున్నమి)
Comments
Please login to add a commentAdd a comment