
ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే మధుమేహాన్ని మెరుగ్గా నియంత్రించవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది.
లండన్ : బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న తర్వాత వ్యాయామం చేయాలని కొందరు సూచిస్తుండగా ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు వ్యాయామం చేస్తే రక్తంలో చక్కెర స్ధాయి నియంత్రణలో ఉంటుందని ఈ పరిశోధన వెల్లడించింది. ఖాళీ కడుపుతో ఎక్సర్‌సైజ్ చేస్తే శరీరం ఇన్సులిన్ వాడకాన్ని సమర్ధంగా నిర్వహిస్తుందని ఇది టైప్ 2 డయాబెటిస్‌తో పోరాడటంతో పాటు జీవక్రియల వేగం పెంచేందుకు ఉపకరిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
బాత్ అండ్ బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. వ్యాయామం చేసే సమయంలో మీరు ఆహారం తీసుకునే సమయంలో చేసే మార్పుల ద్వారా మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని తమ పరిశోధనలో తేలిందని యూనివర్సిటీ ఆప్ బాత్ ప్రొఫెసర్ డాక్టర్ జేవియర్ గోంజలెజ్ చెప్పారు. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసిన వారి కండరాలు ప్రొటీన్‌ను మెరుగ్గా సంగ్రహిస్తున్నట్టు తమ అథ్యయనం గుర్తించామని తెలిపారు. బరువు తగ్గే క్రమంలో వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఆహారం తీసుకునే సమయంతో సంబంధం లేకపోయినా వారి ఆరోగ్యంపై మాత్రం ఇది సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు.