కళాత్మకం : వర్ణతత్వం!
కొత్త స్వరం
అందమైన ప్రకృతి ప్రపంచాన్ని రకరకాల వర్ణాల్లో చూడముచ్చటగా
ఆవిష్కరిస్తున్నట్లు అనిపించినా, అలంకారానికి అర్హమైనవిగా అనిపించినా... సీమ చిత్రాల్లో కేవలం అందం, ఆకర్షణ మాత్రమే కాదు జటిలమైన విషయాల మీద వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. రంగుల భాషకు తనదైన కొత్త స్వరాన్ని జత చేశారు కోహ్లి.
ఎల్లో, రెడ్, గ్రీన్...ఏ రంగు అయితేనేం? ఆమె చేతిలో ఒక కొత్త చూపును ప్రసరిస్తాయి. ఢిల్లీకి చెందిన సీమ కోహ్లి స్త్రీశక్తికి తన కుంచె ద్వారా రకరకాల నిర్వచనాలు ఇవ్వడంలో సిద్ధహస్తురాలు. పెయింటింగ్స్, స్కల్‌ప్చర్స్, వీడియో ఇన్‌స్టలేషన్, ఫిల్మ్... ఏమైనా కావచ్చు. మాధ్యమం ఏదైనా కావచ్చు... ఆమె వ్యక్తీకరణలో సరికొత్త కోణం, మరికొంత బలం ఏవో తొంగిచూస్తుంటాయి.
‘‘దైవత్వం అనేది మనలోనే ఉంటుంది. మనలోని రాక్షసత్వం మీద పోరాడుతుంది’’ అని చెబుతున్న కోహ్లి ప్రకృతి నుంచి మనం విడిపడడాన్ని, మిహళాహక్కులను, పర్యావరణ నియమాలను ఉల్లంఘించడమే హక్కు అనుకోవడాన్ని నిరసిస్తారు. సామాజిక వాస్తవాలను చెప్పడానికి మన పురాణాల్లో నుంచి ప్రతీకలు ఎంచుకుంటారు.
సమాకాలిన కళాత్మక ధోరణులకు కోహ్లి ఆర్ట్ కాస్త దూరంగా ఉండొచ్చు. కోహ్లి హయ్యెస్ట్ సెల్లింగ్ ఆర్టిస్ట్ కాకపోవచ్చు. అయితే ఆమె ప్రత్యేకతను గుర్తించడంలో ఇవేమీ పరిమితులు కాలేదు.
కోహ్లి గీసిన చాలా చిత్రాల్లో యోగినులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. వాళ్లు జీవితచక్రాన్ని దర్శిస్తున్నట్లు అనిపిస్తుంది. కోహ్లి చిత్రాల్లో ప్రతి వర్ణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎరుపు రంగు‘శక్తి’ని, గోల్డ్ కలర్ ‘స్వచ్ఛత’ను సూచిస్తాయి.
‘‘నేను ఉపయోగించి ప్రతి వర్ణానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది’’ అంటారు సీమ.
కోహ్లి చిత్రాల గురించి స్థూలంగా మాట్లాడుకున్నప్పుడు అవి కోపాన్ని ప్రదర్శించేవి మాత్రమేనా? అగ్రెసివ్ ఫెమినిజం ప్రతిబింబించేవేనా? అనుకుంటే మనం పొరబడినట్లే. నిజంగా చెప్పాలంటే స్త్రీలలో దైవత్వాన్ని, అపారమైన శక్తిని, ప్రకృతిని అవి ఆవిష్కరిస్తాయి.