భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా? | Extended keep a dessert? | Sakshi
Sakshi News home page

భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?

Published Thu, Apr 10 2014 10:41 PM | Last Updated on Mon, Aug 20 2018 5:23 PM

భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా? - Sakshi

భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?

చరమాంకం వరకు మౌనంలో, ధ్యానంలో గడిపారు రమణ మహర్షి. అప్రమేయంగా సాగిన స్వల్ప సంభాషణలు తప్ప ఆయన ఎక్కడా ప్రసంగించలేదు. సంకేత మాత్రంగా స్వీయ శోధనను తప్ప దేనినీ ప్రవచించలేదు. ఆత్మసాక్షాత్కారం కోసం కౌమారంలోనే అరుణాచలం చేరుకున్న ఈ మహా రుషిలోని ఏ చిన్న కోణాన్నీ చిక్కువిప్పుకోడానికైనా ఎంత శక్తీ, ఎంత కాలమూ సరిపోదు. అందుకే - ఆయనతో దీర్ఘకాల ఆశ్రమ బాంధవ్యం ఉన్న ఓ వైద్యుని స్మృతులలో నుంచి ఈ నివాళి.
 
ఓ రోజు (1948 డిసెంబరులో) శ్రీ భగవాన్ చేతిని మర్దనా చేస్తూంటే మోచేతికి కాస్త పైభాగంలో ఉన్న కణితిని గమనించాను. 1949 జూలై నాటికి ఆ భాగమంతా పచ్చి పుండు అయింది. ‘‘నయం కావాలన్న సంకల్పం మీకు ఉండాలి. సంకల్పించుకోండి’’ అని ప్రాధేయపడ్డాను. వారు చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. నేను మళ్లీ అర్థించాను. అప్పుడు వారు, ‘‘ఇక్కడ మనస్సంటూ ఏమీ లేదు. కాబట్టి సంకల్పించే ప్రసక్తే లేదు’’ అన్నారు.
 
భగవాన్ శ్రీ రమణ మహర్షికి దేహం గానీ, దాని రోగాలు కానీ పట్టవు. పుండుకు కట్టు కడుతున్నప్పుడు నొప్పి అనివార్యం. కానీ వారు ఏ బాధనీ కనబరచలేదు. పెపైచ్చు ఆ కట్టు కట్టడానికి కుడిచేతితో సహాయం చేసేవారు... ఆ పుండు ఇంకెవరిదో అయినట్టు!
 
వారి పుండుకు కట్టు కట్టే ముందు ఆ ప్రాంతాన్ని స్పిరిట్‌తో శుభ్రం చెయ్యాల్సి వచ్చేది. ఓసారి ఆ స్పిరిట్ చేతి మీదకు వచ్చింది. వెంటనే వారు, ‘‘స్పిరిట్ స్నానం అయింది నాకు’’ అన్నారు. అందరికీ అటువంటి స్పిరిట్ స్నానం అవసరమని కూడా అన్నారు. ఆ మాటల అంతరార్థమేమిటో తెలియక, వివరించి చెప్పమని కోరాను. వారు చిరునవ్వుతో ఇట్లా చెప్పారు. ‘‘చేపలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. బయటికి వస్తే బ్రతకలేవు. అట్లాగే మనం ఎప్పుడూ స్పిరిట్‌లోనే, అంటే శుద్ధ చైతన్యంలోనే ఉంటాం, ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శుద్ధచైతన్యంలో, అంటే ఆత్మలోనే ఉండాలి.’’
 
ఈ మాటల వల్ల వారెప్పుడూ సహజ సమాధిలోనే ఉంటారని నమ్మకం కలిగింది నాకు. శ్రీ భగవాన్ తరచు చిన్న చిన్న విషయాలలో కూడా ప్రగాఢమైన బోధనలు చేసేవారు. ఆ బోధనలకు మనపై గట్టి పట్టు ఉండేది.
 
1949లో ఒకసారి శ్రీ భగవాన్, ‘మనం సంతోషంగా ఉన్నప్పుడు కన్నీరు ఆవలి కొన నుంచీ, విచారంగా ఉన్నప్పుడు లోపలి కొన నుంచీ వస్తుంది’ అని చెప్పారు. అది నిజమే.
 
మహా నిర్వాణ దినం నాడు 1950 ఏప్రిల్ 14న వారి గదిలో నేనూ ఉన్నాను. వారి కోరిక మీద వారు కాళ్లు చాచుకుని కూర్చోవడానికి ఏర్పాటుచేశాం. వారు కళ్లు మూసుకున్నారు. శ్వాస నెమ్మదిగా సాగుతోంది. బయట భక్తులు ‘అరుణాచల శివ స్తోత్రం’ పాడుతున్నారు. ఒక్కసారి కళ్లు తెరిచి, ఆ పాట వస్తున్న వైపు చూసి, మళ్లీ కళ్లు మూసుకున్నారు. వారి కళ్ల ‘ఔటర్ కాన్తస్’ నుంచి కన్నీరు కారింది. అంటే పరమాత్మునిలో ఐక్యమయ్యేటప్పుడు కలిగే ఆనందానికి ఆ కన్నీరు బాహ్యరూపం అనుకున్నాను. దేహాన్ని ఎంతో ప్రశాంతంగా విడిచారు. శ్రీ భగవాన్ రమణ మహర్షి అదేరోజు సాయంత్రం 8 గం. 47 ని.లకు శివైక్యం పొందారు.
 
తన బాధ గురించి దుఃఖిస్తున్నవారి పట్ల కరుణ ఉండేది శ్రీ భగవాన్‌కి. ఆయనెప్పుడూ అసలు సత్యాన్నీ, తన బోధనలో ప్రధానాంశమైన ‘‘మనం దేహం కాదు’’ అనే మాటను జ్ఞాపకం చేస్తుండేవారు. తనదైన రీతిలో ఒక మాట అడిగేవారు కూడా. ‘‘భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?’’ అని.
 - ఆశ్రమ డాక్టర్ ఎం.అనంతనారాయణరావు స్మృతుల నుంచి.
 (సౌజన్యం: శ్రీరమణ కేంద్రం, హైదరాబాద్)

 
 భగవాన్ శ్రీరమణ మహ ర్షి
 30 డిసెంబర్ 1879 - 14 ఏప్రిల్ 1950
 
 అసలు పేరు:  
   వెంకటరామన్

 జన్మస్థలం: తిరుచ్చుళి, తమిళనాడు

 తల్లిదండ్రులు: అళగమ్మ, సుందరయ్యర్

 సహోదరులు:     అన్న, తమ్ముడు, చెల్లి

 చదువు: తొమ్మిదవ తరగతి, అమెరికన్ మిషన్ హైస్కూల్  

 ఆత్మజ్ఞానానికి అంకురార్పణ: పదహారేళ్ల వయసులో (తిరువణ్ణామలైలోని అరుణాచలం గురించి విన్నపుడు)

 ఇల్లు విడిచి అరుణాచలానికి: 1896 (సందర్శన 1, సెప్టెంబర్)

 నివాసం: మొదట అరుణాచల ఆలయ ప్రాంగణం  తర్వాత గురుముహూర్త మఠం (1897), విరూపాక్ష గుహ (1899),
 స్కందాశ్రమం (1916), ఆ తర్వాత జీవిత చరమాంకం వరకు } రమణాశ్రమం (అరుణాచల పాదంలో తల్లి సమాధి చుట్టూ  ఏర్పడిన ఆశ్రమం-1922).

 తాత్వికత: మౌనం, ధ్యానం, ఆత్మజ్ఞాన సాధన,    ‘నేనెవరు?’ అన్న అన్వేషణ.

 సందర్శకులలో ముఖ్యులు కొందరు : డాక్టర్ పాల్ బ్రంటన్, టి.ఎం. కృష్ణస్వామి అయ్యర్, చింతాదీక్షితులు, గుడిపాటి వెంకటాచలం, చిత్తూరు నాగయ్య, డాక్టర్ రాజేంద్రప్రసాద్, జమ్నాలాల్ బజాజ్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement