బరువు సన్నమార్గాలు | Family health councling | Sakshi
Sakshi News home page

బరువు సన్నమార్గాలు

Published Thu, Aug 9 2018 12:42 AM | Last Updated on Thu, Aug 9 2018 12:42 AM

Family health councling - Sakshi

ముందు ‘అన్న’ మార్గాలు చెబుతున్నాం  అంటే అన్నం మితంగా తినమని చెబుతున్నాం. ఆ తర్వాత ‘ఉన్న’ మార్గాలు చెబుతున్నాం. అంటే జీవనశైలిలో పాటించడానికి ఉన్న మార్గాలివి. ఆ తర్వాత ‘భిన్న’ మార్గాలు చెబుతున్నాం. అంటే... తగ్గడానికి ఉన్నభిన్న భిన్న మార్గాలన్న మాట. ఈ మార్గాల్లో వీలును బట్టి ఏదైనా అనుసరించవచ్చు.  ఎందుకంటే... సన్నబడే మార్గాలన్నీ  సన్మార్గాలే! మెరుపుతీగలా ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సాధారణం శరీరాకృతితో ఉండటం సగం విజయం అని చెప్పుకోవచ్చు. కాని అధిక బరువుకు శరీరం చేరుకుంటే, కాయం ఊబకాయంగా మారితే జీవితం మందగిస్తుంది. సమస్యలు సంకెలలుగా మారతాయి. కదలికలకు నిరోధం పడుతుంది. నాణ్యమైన జీవితం అనుభవించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

అందుకే బరువు తగ్గాలి
అధిక బరువు తగ్గాలంటే జీవనశైలి మార్చుకోవడం, లో–కార్బ్‌ డైట్, వాటర్‌ థెరపీ, లైపోసక్షన్, కూల్‌ స్కల్ప్‌టింగ్‌ వంటి మార్గాలు చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉండాల్సిన బరువు కంటే లావు ఉన్నవారికి లేదా స్థూలకాయులుగా  ఉన్నవారికి. కాని అపాయకర రీతిలో ఊబకాయం ఉన్నవారు అంటే మార్బిడ్‌ ఒబేసిటీ ఉన్నవారు ఈ మార్గాలన్నింటినీ గాక బేరియాట్రిక్‌ సర్జరీ వంటి శస్త్రచికిత్సా పద్ధతులను అవలబించే వీలుంది. ఈ బరువు తగ్గే మార్గాలన్నింటి గురించి  ఒక పరిచయం ఇది.  
ముందుగా సర్జికల్‌ మార్గాలు చూద్దాం.

శస్త్రచికిత్సల ప్రక్రియలివి...  
మీ బరువు ప్రమాదకరమైన స్థాయి దాటితే... సాధారణ జీవనశైలిలో మార్పులు, ఆహారం, వ్యాయామం వంటి స్వాభావిక ప్రక్రియల ద్వారానే సన్నబడటం చాలా కష్టం.  పైగా అత్యధిక బరువు ఉన్నవారు తమ బరువు కారణంగానే  ప్రాణాపాయాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివారు బరువు తగ్గడానికి కొన్నిసార్లు కొన్ని శస్త్రచికిత్సలను అనుసరించాల్సి రావచ్చు. అలా చేయకపోతే వారి బరువే వారిని కబళించవచ్చు. ఆ శస్త్రచికిత్సలను బేరియాట్రిక్‌ సర్జన్స్‌ / సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు చేస్తారు. ఆ ప్రక్రియల గురించి స్థూలంగా... 

లాపరోస్కోపిక్‌ అడ్జస్టబుల్‌ గ్యాస్ట్రిక్‌ బ్యాండ్‌ 
మనం తినే ఆహారం అన్నకోశం (స్టమక్‌)లోకి వెళ్తుంది. ఇది ఒక సంచిలా ఉంటుంది. మన పొట్ట నిండగానే తృప్తి (సేషియేషన్‌) కలుగుతుంది. నడుముకు బెల్ట్‌లాంటిదాన్ని పెట్టినట్లుగానే... ఒక శస్త్రచికిత్స ద్వారా అన్నకోశం (స్టమక్‌)కు కూడా బెల్ట్‌ వంటి దాన్ని అమర్చుతారు. మనిషి లావును బట్టి ఎంత మోతాదు ఆహారం అవసరమో నిర్ణయించి, దాన్ని బట్టి ఒక బ్యాండ్‌ను అమర్చుతారు. అందుకే దీన్ని అడ్జస్టబుల్‌ గ్యాస్ట్రిక్‌ బ్యాండ్‌ అంటారు. దాని కారణంగా స్టమక్‌ సైజ్‌ తగ్గుతుంది. ఫలితంగా కొంత తినగానే పొట్టనిండినట్లయి తృప్తి కలుగుతుంది. 
అనుకూలతలు/ప్రతికూలతలు: కేవలం గ్యాస్ట్రిక్‌ బ్యాండ్‌ అమర్చడం వల్ల  ఎలాంటి హానీ ఉండదు. అయితే ఎలాగూ బ్యాండ్‌ అమర్చుకున్నాం కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రొసిజర్‌ తర్వాత నిపుణులు సూచించిన విధంగా ఆహార నియమాలు పాటించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. అలా చేయకపోతే దీనివల్ల ఆశించిన ఫలితాలు ఉండవు. 

అన్నకోశం తొలగింపు
బరువు విపరీతంగా పెరిగి అది ప్రాణాపాయంగా పరిణమించినప్పుడు శస్త్రచికిత్సతో 85శాతం మేరకు అన్నకోశాన్ని (స్టమక్‌ను)  తొలగిస్తారు. దాంతో అన్నకోశం కాస్తా ఒక పేగు ఆకృతికి మారుతుంది. 

అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గించడానికి ఇది చాలా ప్రభావవంతమైన శస్త్రచికిత్స. అయితే అన్నకోశాన్ని తొలగించాక మళ్లీ మునుపటిలాగే తినడం వల్ల అన్నకోశం మళ్లీ మామూలుగా సంచిలా సాగిపోయే  అవకాశం ఉంది కాబట్టి వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలతో పాటు ఆహార మార్గదర్శకాలన్నీ తప్పకుండా పాటించాలి. 

ల్యాపరోస్కోపిక్‌  రూ–ఎన్‌ వై గ్యాస్ట్రిక్‌ బైపాస్‌... 
ఈ శస్త్రచికిత్స ప్రక్రియతో ఆహారాన్ని అన్నవాహిక నుంచి స్టమక్‌లోకి కాకుండా  నేరుగా పేగులకు వెళ్లేలా కలుపుతారు. అంటే... అన్నకోశాన్ని (స్టమక్‌ని) బై–పాస్‌ చేస్తూ... నేరుగా అన్నవాహికను పేగులతో అనుసంధానిస్తారు.  అన్నవాహిక దగ్గర ఒక చిన్న సంచిని రూపొందించేలా ఈ సర్జరీ చేస్తారు. మళ్లీ ఈ సంచి నుంచి పేగుల్లోకి ఆహారం వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియనే అనాస్టమోసిస్‌ అంటారు.

అనుకూలతలు / ప్రతికూలతలు: అన్నకోశాన్ని పూర్తిగా బైపాస్‌ చేయడం వల్ల ఆపరేషన్‌ తర్వాత  విటమిన్‌ లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కనిపించేందుకు అవకాశం ఉంది. నీరసంగా అనిపించడం, జుట్టురాలడం, విటమిన్‌లోపాల కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి కనిపించవచ్చు. కాబట్టి ఆ మేరకు విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. 

లాపరోస్కోపిక్‌ బిలియో–ప్యాంక్రియాటిక్‌
డైవర్షన్‌ (+/– డియోడోనల్‌ స్విచ్‌) 

ఇందులో అన్నకోశంతో పాటు కొంతమేర చిన్న పేగులను కూడా తొలగిస్తారు. ఫలితంగా తీసుకునే ఆహారం తగ్గుతుంది. అలాగే జీర్ణమయ్యే ఆహారమూ గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఈ శస్త్రచికిత్సలో కొంతమేర పేగులను తొలగించి ఆహారమార్గాన్ని కుదిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా జీర్ణస్రావాలు పొట్టలోకి కాకుండా నేరుగా పేగుల్లోకి వచ్చేలా శస్త్రచికిత్స నిర్వహిస్తారు. 

లైపోసక్షన్‌
శరీరంలో కొవ్వు పేరుకోవడం అన్నది ఆయా వ్యక్తుల జన్యువుల ఆధారంగా కొన్ని కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో జరుగుతుంటుంది. ఉదాహరణకు కొందరికి పొట్ట, మరికొందరికి తొడలు, పిరుదులు వంటి భాగాల్లో ఇలా కొవ్వు పేరుకుంటుంటుంది. వ్యక్తుల్లో వారి వారి వ్యక్తిగత శరీర నిర్మాణాన్ని అనుసరించి,  చాలా ఎక్కువగా కొవ్వు పేరుకున్న ప్రదేశం నుంచి కొవ్వును సక్షన్‌ ప్రక్రియ ద్వారా లాగేయడాన్ని  లైపోసక్షన్‌ అంటారు. 

అనుకూలతలు/ప్రతికూలతలు:  ఈ ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండదు. వ్యక్తుల బరువును బట్టి, వారిలో కొవ్వు పేరుకున్న ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మోతాదుకు మించి ఒకేసారి ఎక్కువ కొవ్వును తొలగించడం అన్నది కొందరిలో తీవ్రమైన ప్రాణాపాయం కలిగించవచ్చు. కొవ్వు తొలగించాక కొంతకాలం ఒంటి నొప్పులు కొనసాగుతాయి. (అయితే కొంతకాలం తర్వాత తగ్గిపోతాయి.) మరో ప్రతికూల అంశం ఏమిటంటే... ఒకసారి కొవ్వును తొలగించాక వదులైన శరీర భాగాలు సంచుల్లాగా వేలాడుతుంటాయి. అవి మామూలుగా శరీరాన్ని అంటుకుని ఉండేలా చేయడానికి మూడు నెలలకు పైగా బాగా బిగుతైన దుస్తులు ధరించాల్సి ఉంటుంది.  ఒకసారి కొవ్వు తొలగించాక బరువు తగ్గినప్పటికీ, ఒకవేళ ఆరోగ్యవంతమైన  జీవనశైలి అనుసరించకుండా, క్రమశిక్షణ లేకుండా మళ్లీ ఎప్పటిలాగే ఆహారపు అలవాట్లు కొనసాగించడమూ, వ్యాయామం చేయకపోవడం వంటివి చేస్తుంటే... మళ్లీ మునపటిలాగే బరువు పెరిగిపోతారు. అంటే ఇది శాశ్వతమైన పరిష్కారం కాదన్నమాట. ఇంతవరకు చెప్పినవన్నీ ప్రమాదకరమైన స్థితిలో బరువు పెరిగినప్పుడు పాటించే పద్ధతులు. అయితే అసలు అంతవరకు  రాకుండా కొన్ని పద్ధతులు పాటించడం వల్ల కూడా ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. ఆ పద్ధతులూ చూద్దాం.

జీవనశైలి మార్పులు (లైఫ్‌స్టైల్‌ టెక్నిక్స్‌) 
జీవనశైలి మార్చుకొని బరువు తగ్గడం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు... కడుపునిండా తింటూనే లావెక్కకుండా చూసుకోవడం. ఇది  దాదాపు నిరపాయకరమైన పద్ధతి. క్రమశిక్షణ ఉన్నవారు క్రమం తప్పకుండా పాటిస్తే చాలావరకు మేలు జరుగుతుంది. అంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉదాహరణకు కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ప్రోటీన్లపై ఆధారపడటం, అన్ని పోషకాలు అందేలా తక్కువ క్యాలరీలు ఉండే సమతులాహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలా తిన్న ఆహారంతో సమకూరే అదనపు క్యాలరీలను లెక్కించడం, తగ్గించడం అవసరం. అలా తగ్గించడానికి  వ్యాయామంతో క్యాలరీలను దహించడం, కొవ్వును కరిగించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు,  కాయగూరల్లో పోషకాలు ఎక్కువ పాళ్లలో ఉంటాయి. వాటిని భుజించాలి. నీటిపాళ్లు ఎక్కువగా ఉండే కాయగూరలు తింటే పోషకాలు భర్తీ అవడమే కాకుండా... వాటిలోని నీరు త్వరగా కడుపు నింపేలా చేస్తుంది. అందుకే పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు కడుపు త్వరగా నిండి తృప్తి కలుగుతుంది తృప్తి కలగడం వల్ల ఎంత ఆహారం కావాలో అంతే తింటారు. బరువు తగ్గడంలో భాగంగా గుడ్డు తినడం కూడా మంచిదే. గుడ్డులో ల్యూసిన్‌ అనే ఎసెన్షియల్‌ అమైనో యాసిడ్‌ ఉంది. శాకాహారం విషయానికి వస్తే గుమ్మడిగింజలు, వేరుశెనగల్లో ల్యూసిన్‌ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి నేరుగా ఉపయోగపడుతుంది. మాంసాహారాన్ని ఇష్టపడేవారు చేపలు తినడం చాలా మంచిది. చేప మాంసంలో  కొవ్వులు దాదాపు సున్నా (జీరో).   మసాలాలను తగ్గించాలి. ఇక పండ్లలో తక్కువ చక్కెర ఉండే పండ్లు మంచివి. 
ఇక వ్యాయామంలో భాగంగా ఒళ్లు పూర్తిగా బడలిక చెందనివిధంగా, నీరసపడిపోకుండా మీరు భరించగలిగే పరిమితిలో నడక (బ్రిస్క్‌ వాక్‌) చేయడం అన్నింటికన్నా ఉత్తమమైన వ్యాయామం. నెమ్మదిగా పరుగు (స్లో జాగింగ్‌) వంటి వ్యాయామాలు చేయడం చాలా మేలు చేసే అంశమే. 

అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గడానికి అనుసరించే వాటిల్లో ఈ పద్ధతులు చాలా ఆరోగ్యకరం. ప్రతికూలతలు చాలా తక్కువ. ఇక మోకాళ్ల నొప్పులు ఉన్నవారు శరీర భారం ఫీలవ్వని ఈత లేదా మోకాళ్లపై భారం పడని సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. 

లో కార్బ్‌ డైట్‌
ఇందులో రిఫైన్‌డ్‌ కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేసి, చాలా తక్కువ మోతాదులో శక్తిని వెలువరించే పిండిపదార్థాలను తీసుకుంటారు. అంటే రిఫైన్‌ చేసిన పిండిపదార్థాలకు బదులుగా, అంతగా పాలిష్‌ చేయని పొట్టు ఉన్న గింజలను తీసుకోవడం, కొన్నిసార్లు కార్బోహైడ్రేట్లను దాదాపుగా తగ్గించడం వంటివి అన్నమాట. అయితే దీన్ని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇందులోనూ అనేక డైట్‌ ప్రక్రియలు ఉన్నాయి.  

ప్రతికూలతలు: ఒక్కోసారి శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గించడం వల్ల చక్కెర పాళ్లు పడిపోయి సదరు స్థూలకాయుడిని ప్రమాదకరమైన పరిస్థితిలోకి (హైపోగ్లైసీమియా స్థితికి) తీసుకెళ్లవచ్చు. దాన్ని తప్పించాక... ఒకసారి స్థూలకాయులు మళ్లీ మామూలు స్థితికి వచ్చాక మళ్లీ మొదటిలాగే సాధారణ ఆహారపు అలవాట్లను కొసాగించే అవకాశాలు ఉంటాయి. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికే రావచ్చు.  

వాటర్‌ థెరపీ
ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి అరగంట ముందుగా... పూటకు అరలీటరు నీళ్లు తాగితే జీవక్రియల వేగం (మెటబాలిజం రేటు) 30 శాతం పెరుగుతుంది. ఈ అధ్యయానం ‘ద జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజమ్‌’ అనే వైద్యవిజ్ఞాన జర్నల్‌లో ప్రచురితమైంది. దీన్నిబట్టి ఒక వ్యక్తి తాను తీసుకోవలసిన  దాని కంటే ఒక రోజులో 1.5 లీటర్ల నీళ్లు ఎక్కువగా తాగితే అతడు క్యాలరీలను ఎక్కువగా ఖర్చుచేయగలడు. ఇలా చేస్తే ఏడాదిలో దాదాపు రెండున్నర కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. 
అనుకూలతలు / ప్రతికూలతలు :  ఎక్కువ నీళ్లు తాగడం వల్ల తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. బరువు పెరగకుండా ఉండటానికి ఈ అంశం దోహదపడుతుంది. ఇదొక్కటే అనుకూలత. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే ఇది నమ్మకమైన ప్రక్రియ కాదు. ఎందుకంటే... నీళ్లు కొవ్వులను నేరుగా కరిగించలేవు. అందువల్ల కొవ్వు పేరుకోవడంతో పెరిగే బరువు అన్నది వాటర్‌ థెరపీతో తగ్గేందుకు అవకాశమే లేదు. 

ఇవీ స్థూలంగా బరువు తగ్గడానికి ఉన్న కొన్ని మార్గాలు, వాటితో ప్రయోజనాలు, ప్రతికూలతలు. ఇవన్నీ కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే. వీటిని కొన్నింటిని నేరుగా ఆచరించడం ప్రమాదకరం కావచ్చు కూడా. ఉదాహరణకు విచక్షణ రహితంగా చేసే డైటింగ్, కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవడం వంటివి. ఇక బరువు తగ్గడానికి కొందరు కొన్ని ఫ్యాట్‌ బర్నింగ్‌ ట్యాబ్లెట్లు, మూలికలు, హెర్బ్స్‌ కూడా ఇస్తుంటారు. ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. వాటి వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
గమనిక: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు ముందుగా తప్పనిసరిగా మొదట  ఫిజీషియన్‌ను సంప్రదించాలి. ఇక బరువు అన్నది ప్రాణాంతకంగా మారినప్పుడే (మార్బిడిటీకి దారితీసినప్పుడే) బేరియాట్రిక్‌ సర్జన్లు బరువు తగ్గే శస్త్రచికిత్సలను చేస్తారు. అంతే తప్ప బరువు తగ్గాలనుకునే ప్రతివారికీ అవే మార్గాలు కావని గుర్తుంచుకోవాలి.
పాఠకులకు మనవి: ఈ కథనంలో విపులంగా చర్చించని కొన్ని అంశాలతో పాటు అనేక ఆహార విధానాలను రాబోయే వారాలలో విపులంగా ఇవే పేజీలలో చూడవచ్చు. 

కూల్‌స్కల్ప్‌టింగ్‌
కొన్ని చోట్ల ఉన్న కొవ్వు ఎంతగా ప్రయత్నించినా కరగదు. దాన్ని ఎంతకూ లొంగని కఠినమైన కొవ్వుగా పేర్కొంటారు. అలాంటి కొవ్వు కణాలను చాలా ఎక్కువగా చల్లబరచడం ద్వారా చనిపోయేలా చేస్తారు. ఇలా కొవ్వును నియంత్రితమైన రీతిలో (కంట్రోల్డ్‌గా) ఘనీభవించేంతగా చల్లబరచడం ద్వారా లాగేసే నాన్‌ సర్జికల్‌ ప్రక్రియే కూల్‌స్కల్ప్‌టింగ్‌. ఇలా చేయడం వల్ల అక్కడి కొవ్వు కణాలు నిర్వీర్యమై అచేతనమవుతాయి. దాంతో అవి ముడుచుకుపోతాయి. ఈ దశలో ఈ కొవ్వుకణాలు సహజ ప్రక్రియలో భాగంగా బయటకు విసర్జితమవుతాయి. ఇలా చేసేందుకు ప్రత్యేకమైన కూల్‌ స్కల్ప్‌టింగ్‌ యంత్రాన్ని వాడతారు. 
ప్రతికూలతలు: ఇది చాలా సుఖవంతమైన ప్రక్రియలా అనిపించినా కొవ్వు తొలగించిన ప్రాంతంలో బాగా లాగినట్లుగా అనిపించడం, నొప్పి, తాత్కాలికంగా ఆ ప్రదేశం ఎర్రబారడం, కొన్నిసార్లు చిన్న గాయంలా అనిపించడం కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో కొవ్వుకణాలు అంతమైపోవడం వల్ల చాలా సందర్భాల్లో మళ్లీ కొవ్వు పేరుకోకపోవచ్చు.


ఒక్క టీకాతో 
ఊబకాయం పోతుందా?
వినడానికి కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే ఇది. ఊబకాయాన్ని తగ్గించడం చిటికెలో పని అంటున్నారు బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు కొందరు. ఆరోగ్యకరమైన బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో అడినోవైరస్‌ – 36 అనే వైరస్‌ నాలుగు రెట్లు ఎక్కువగా కనిపిస్తోందని.. ఈ వైరస్‌ను తొలగిస్తే బరువు పెరక్కుండా అడ్డుకోవచ్చునన్నది వీరి వాదన. ఎలుకల్లో తాము కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు పెరిగిన ఒళ్లు బరువులో 15 శాతానికి అడినోవైరస్‌ – 36 కారణమని తెలిసినట్లు వీరు చెబుతున్నారు. కొవ్వు కణాలను చీకాకుపెట్టి అవి వాచిపోయేలా చేయడం.. చనిపోకుండా అడ్డుకోవడం అనే రెండు పనుల ద్వారా ఈ వైరస్‌ ఒళ్లు పెరిగేందుకు కారణమవుతున్నట్లు యూనివర్శిటీ ఆఫ్‌ మసాచూసెట్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. విన్‌కాన్సిన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్‌ రిచర్డ్‌ అట్కిన్‌సన్‌ ఇప్పటికే ఓ వ్యాక్సిన్‌కు పేటెంట్‌ కూడా సంపాదించగా.. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తమదైన వ్యాక్సిన్‌తో జరిపిన పరిశోధనలు విజయవంతమయ్యాయి కూడా. యువకులకు ఈ వ్యాక్సీన్‌ ఇవ్వడం ద్వారా వాళ్లు బరువు పెరక్కుండా అడ్డుకోవచ్చునని తద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకొందరు శాస్త్రవేత్తలు మాత్రం వ్యాక్సిన్‌ను వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ముందుగానే మరిన్ని పరిశోధనలు నిర్వహించాలని... వైరస్‌ ద్వారానే ఒళ్లు పెరుగుతున్నట్లు  రూఢి చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఒక అపోహ:  తల్లిపాలు  పుష్కలంగా తాగిన  పిల్లలు పెద్దయ్యాక ఊబకాయులు కారు

ఒక వాస్తవం:
కొంత కాలం క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ఈ మాట ప్రకటించడంతో అందరూ ఇది వాస్తవమే అనుకున్నారు. అయితే తరువాతి కాలంలో ఇదే సంస్థ తమ ప్రకటనలో వాస్తవం కొంతేనని, అధ్యయనం జరిగిన తీరులో లోపం కారణంగా ఫలితం అలా వచ్చిందని స్పష్టం చేసింది. తల్లిపాలకు, ఊబకాయానికి మధ్య స్పష్టమైన సంబంధం ఏదీ ఇప్పటివరకూ కనిపించలేదని ఇంకో విస్తృత అధ్యయనం ఆధారంగా తేల్చింది. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. ఊబకాయులు కాకుండా నిరోధిస్తుందా లేదా అన్నది పక్కనపెడితే తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు మాత్రం బోలెడు. అన్ని లాభాలు ఏకరవు పెట్టాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని వారు అంటున్నారు. 

డాక్టర్‌ వి.సుధాకర్‌ ప్రసాద్‌
సీనియర్‌ కన్సల్టెంట్, కాస్మటిక్‌ సర్జన్, 
అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement