రైతే రాణి | Farmers queens | Sakshi
Sakshi News home page

రైతే రాణి

Published Wed, Dec 16 2015 11:47 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రైతే రాణి - Sakshi

రైతే రాణి

రైతు రాజులే కాని మనకు రైతు రాణులు లేరా?
రైతులు అంటే కేవలం మగవాళ్లేనా?
ఇది ఒకప్పటి మాట.
నేడు వ్యవసాయరంగంలోనూ మహిళలు పాదం మోపుతున్నారు.
రైతు రాణులు అవుతున్నారు.
అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో స్త్రీమూర్తులు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు.
అలా ఈ రంగంలోకి వచ్చి సత్తా చాటుతున్న మహిళా రైతులు స్ఫూర్తి గాథ ఇది.

 
వైశాలి జయవంత్ భలేరావ్ ఒక వితంతువు. వయసు40 సంవత్సరాలు. పశ్చిమ మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉత్తర భాగంలో అవివాహిత అక్కచెల్లెళ్లు, రింపీ కుమారి (32), కరమ్‌జిత్ (26)  ఉంటున్నారు. వీరు మహిళా రైతులుగా సంచలనం సృష్టిస్తున్నారు.
 
వితంతువు వైశాలి
వైశాలి ఇటుకలతో నిర్మితమైన చిన్న ఇంట్లో ఉంటోంది ఆమెకు ఇద్దరు పిల్లలు. కొద్దిపాటి పొలం ఉంది. అక్కడే పనిచేసుకుంటోంది. పిల్లల్ని చదివించడం కోసం భర్త అప్పులు చేశాడు. వేసిన పంటలో నష్టం వచ్చింది. దాంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణంతో ఆమెకు లోకం శూన్యం అయ్యింది. ఇంటి బరువుబాధ్యతలు ఆమెను వెన్నాడాయి. దుఃఖాన్ని కడుపులో మింగేసింది.
 ‘‘ఆయన నన్ను, ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు. కాని నేను పిల్లల కోసం బతకాలి కదా. నాకున్న 5 ఎకరాల పొలాన్ని సాగు చేశాను. పత్తి, పప్పుధాన్యాలు, సోయాబీన్స్ వేశాను. బాగా పండించాను. లాభాలు సంపాదించాను. మా గ్రామంలో నేనొక్కర్తినే మహిళా రైతుని. అందుకు నాకు గర్వంగా ఉంటుంది. అయితే నా పొలంలో పనిచేసే మగవారు మాత్రం మొదట్లో నన్ను లెక్కపెట్టేవారు కాదు. ‘ఒక మహిళకు వ్యవసాయం గురించి, వ్యాపారం గురించి ఏం తెలుస్తుందిలే’ అనే భావనతో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. కాని నేను పొలం దున్నటం గురించి, రబీ ఖరీఫ్ గురించి, ఎరువులు, మందుల గురించి అన్నీ ముందుగానే తెలుసుకున్నాను. నా మీద నాకు నమ్మకం కలిగింది. పని చేయగలనన్న ధీమాతో వ్యవసాయం ప్రారంభించాను. నేడు ఆ ఉత్పత్తులను అమ్మి, నా పిల్లలిద్దరినీ బాగా చదివిస్తున్నాను. కుటుంబాన్ని పేదరికం నుంచి సాధారణ స్థితికి తీసుకువచ్చాను. ప్రతి మహిళా వ్యవసాయం చేస్తే, మన దేశం అన్నపూర్ణగా నిలుస్తుంది’’ అంటున్నారు వైశాలి.
 
తండ్రి లేని అక్కాచెల్లెళ్లు
 రాజస్థాన్ సుదూర ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న అక్కచెల్లెళ్లు మహిళా విజయంలో మరో మెట్టు పైనే ఉన్నారు. మోటార్ బైక్ నడుపుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. రింపీ ట్రాక్టర్ కూడా నడుపుతున్నారు.  ‘‘ఏడు సంవత్సరాల క్రితం మా నాన్నగారు మర ణించారు. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మాకు 32 ఎకరాల పొలం ఉంది. మేం కూడా ఎలాగైనా ఆయన చేస్తున్న వ్యవసాయాన్నే ముందుకు నడపాలనుకున్నాం. మా పెద్దన్నయ్య నన్ను ప్రోత్సహించాడు. మా అమ్మయితే నాన్న చేసే వ్యవసాయాన్ని మేం నడిపిస్తామనగానే ఎంతో సంబరపడింది. తను మాకు పూర్తిగా సహకరించింది. నేను చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం విడిచిపెట్టేశాను.

ట్రాక్టర్ ఎక్కాను. స్టీరింగ్ పట్టుకున్నాను. పొలం దున్ని సోయాబీన్స్ పండించడం ప్రారంభించాను. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తున్నాను. మా నాన్న సంపాదించినదాని కంటె ఎక్కువ సంపాదిస్తున్నాను. భారతదేశంలో ప్రతి మహిళ వివాహం చేసుకుని, పిల్లల్ని కని, ఇల్లు చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోతోంది. మేం అలా ఉండకూడదనుకున్నాం. ఎవ్వరూ ఊహించనంత ఎత్తు ఎదగాలనుకున్నాం. మగవారి కంటె గొప్ప రైతుగా పేరు తెచ్చుకోవాలనుకున్నాం. గ్రామంలో మాకు ఎంతో వ్యతిరేకత ఉంది. 80 సంవత్సరాల సర్దార్ కరమ్‌జీత్ సింగ్, ‘ఈ ఆడపిల్లలు తప్పు చేస్తున్నారు. ఈపాటికి వీళ్లిద్దరికీ వివాహం అయిపోయి ఉండాలి. మనం మాత్రం మన ఇళ్లలోని ఆడపిల్లల్ని ఈ విధంగా వ్యవసాయం చేయడానికి అంగీకరించొద్దు...’’ అంటూ మమ్మల్ని అందరి దగ్గరా హేళన చేస్తున్నారు’’ అంటోంది కరంజిత్   అయితే ఈ అక్కాచెల్లెళ్లు ఎవ్వరినీ లెక్కచేయకుండా, అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. మగవారి కంటె ఉన్నత ప్రమాణాలతో వ్యవసాయం చేయగలమని నిరూపించారు. ఆడపిల్లలకు స్వేచ్ఛనిచ్చి, వారికి సహకరిస్తుంటే, ఎవ్వరూ ఊహించనంత ఎత్తు ఎదగగలరనడానికి వీరు చిన్న ఉదాహరణలు మాత్రమే.
 - డా. పురాణపండ వైజయంతి,
 ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి
 
స్వేచ్ఛనిస్తే ఎదుగుతారు!
వాళ్లకు స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే వారి శక్తిసామర్థ్యాలను నిరూపించుకోగలుగుతారు. నాకు నా బిడ్డల మీద నమ్మకం ఉంది. కూతుళ్లు కొడుకులను మించిపోగలరని వారు నిరూపించారు. అయితే వారు ఒకే ఒక్క సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రెయిన్ మార్కెట్‌లో. మార్కెట్‌లో వీళ్లిద్దరే ఆడవారు. మిగతా వారంతా పురుషులే. అక్కడ అక్కడ వీళ్లని వింతగా చూస్తారు. అందువల్లే వీరిద్దరూ మహిళల వస్త్రాలలో కాకుండా, షర్ట్, ప్యాంటు వేసుకుంటారు.
 - సుఖదేవ్ కౌర్ (అక్కచెల్లెళ్ల  తల్లి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement