రాజ రాజేశ్వరి వరాల తల్లి | Festival Special | Sakshi
Sakshi News home page

రాజ రాజేశ్వరి వరాల తల్లి

Published Wed, Oct 21 2015 10:59 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

రాజ రాజేశ్వరి   వరాల తల్లి - Sakshi

రాజ రాజేశ్వరి వరాల తల్లి

పండగ ప్రత్యేకం
 
జీవితాన్ని సుఖశాంతిమయం చేసుకునే రాత్రులే దేవీ నవరాత్రులు.  మొదటి మూడు రాత్రులు దుర్గగా, తర్వాతి మూడురాత్రులు లక్ష్మిగా, చివరి మూడు రాత్రులు సరస్వతిగా నవరాత్రులలో శక్తిస్వరూపిణి అయిన అమ్ పూజలందుకుంటుంది. రాక్షససంహార క్రమంలో దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసురసంహారం చేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదవ రోజున నవరాత్రి పూజలకు స్వస్తిచెబుతూ విజయదశమి వేడుకలు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో శ్రీరాముని ఆరాధన కూడా జరుగుతుంది. విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ పని, వృత్తి, వ్యాపారం అయినా అఖండ విజయం సాధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
 
దసరా పండుగ అందరికీ విజయాలను చేకూర్చే పండుగ. ఎందరో రాజులు విజయ దశమిని విజయప్రాప్తి దినంగా ఎన్నుకున్నట్లు చరిత్ర చెబుతోంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈరోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టిబొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. ఛత్రపతి శివాజీ మొగలాయి రాజు ఔరంగజేబును ఎదుర్కొనడానికి విజయదశమినే ముహూర్తంగా ఎంచుకుని, అదేరోజున యుద్ధం చేసి, అఖండ విజయం సాధించాడని చరిత్ర చెబుతోంది.
 ఆశ్వయుజమాసంలో విజయవాడలోనూ తిరుమలలోనూ జరిగే బ్రహ్మోత్సవాల సందడి యావద్భారతదేశానికీ కన్నుల పండువ చేస్తుంది. ఈ మహోత్సవాలను తిలకించాలంటే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయాన్ని, అలంపురం జోగులాంబను, శ్రీశైల భ్రమరాంబనీ సందర్శించి తీరవలసిందే. ఈ పదిరోజులూ ఆయా ఆలయాలలో చేసే పూజలూ అలంకారాలతో అమ్మ నూతన తేజస్సును సంతరించుకుని మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంది.

జమ్మికి, విజయదశమికి సంబంధం ఏమిటి?
శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనకధారలు కురిపిస్తుందనే విశ్వాసం ఉంది. శమీవృక్షపు నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాచడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. అందుకే జమ్మిని బంగారంగా భావిస్తారు. జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు.

శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయని పెద్దలు చెబుతారు.

దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణ మేఘనాథులను సంహరించినందుకు గుర్తుకు కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు.
   
దసరా అనే పేరు ఎందుకు వచ్చిందంటే... దశహరా అనే సంస్కృత పదం వికృత రూపంలోకి మారి దసరా అయ్యింది. గంగానదికి  దశహరా అని పేరుంది.దశహరా అంటే పదిజన్మల పాపాలను, పది రకాల పాపాలను నశింపచేసేదని అర్థం. దుర్గాదేవి కూడా భక్తుల జన్మజన్మల పాపాలను నశింపచేస్తుంది కాబట్టి ఆ దేవి ఉత్సవాలు ‘దసరా ఉత్సవాలు’గా జరుగుతున్నాయి.
 
శరన్నవరాత్రులు.. శారద రాత్రులు
 ఆశ్వయుజ మాసంలో శుక్లపాడ్యమి నుంచి తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు లేదా శారద రాత్రులనీ, ఈ కాలంలో జరిగే ఉత్సవాలను శరన్నవరాత్రి ఉత్సవాలనీ అంటారు. అన్ని రుతువుల్లో కన్నా శరదృతువులో వచ్చే చంద్రకాంతి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. శరత్కాలంలో ఉద్భవించిన ‘అమ్మ’ శారదగా పూజలు అందుకుంటోంది. అందుకనే ఇవి శారద రాత్రులయ్యాయి.

నవరాత్రులు ఎందుకు ?
శరదృతువు ఆహ్లాదకరంగా ఉన్నా సంధికాలం కావడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం అధికం. దీర్ఘ, తరుణ వ్యాధులు ఈ కాలంలో అధికంగా వస్తాయి. ఈ వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి దేవీ నవరాత్ర వ్రతం చెయ్యాలని దేవీ భాగవతం చెబుతోంది. ఈ నవరాత్రులనే అంబా యజ్ఞమని వేదాలు, నవరాత్ర వ్రతమని పురాణాలు చెబుతున్నాయి. అయితే సామాన్యులు సైతం వీటిని ఆచరించ డానికి వీలుగా వీటినే మహర్షులు నవరాత్ర ఉత్సవాలుగా ఏర్పాటుచేశారు. నవరాత్ర వ్రతం అంటే తొమ్మిది రోజులు చేసే వ్రతమని అర్థం. తొమ్మిది రోజుల పాటు పూజ చేసే శక్తి లేని వారు ఏడు, ఐదు, మూడు లేదా చివరకు ఒక రోజు అయినా పూజ చేయవచ్చని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. పూజా విధానాన్ని పరిశీలిస్తే, ఆసేతు హిమాచల పర్యంతం అన్ని ప్రాంతాల వారూ దేవీ పూజను విధిగా చేస్తున్నారు. దేశ, కాల, ప్రాంత ఆచార భేదాలను బట్టి వీరి పూజాపద్ధతుల్లోనూ మార్పు కనిపిస్తుంది.

విజయదశమి-వివిధ కారణాలు
దుష్ట రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా  వస్తోంది. రాముడు రావణుని మీదకు దండు వెడలిన దినం విజయ దశమే అని కొందరు చెబుతారు. దుర్గాదేవి మహిషారుని సంహరించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గాథ ఉంది.

ఐకమత్యమే ఆయుధ బలం
ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడా తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అందుకే ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామి నుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మ నుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, వీటన్నింటినీ కూడగట్టుకోవడానికి కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధంచేసి విజయం సాధించింది. దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఏ ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా ఉండి, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించగలం. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ చాటి చెబుతోందన్నమాట.  

అభీష్టాలు నెరవేర్చే చల్లని తల్లి
మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు అమ్మ భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఐహిక, ఆముష్మిక ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థ్థైర్యం, శత్రువులపై విజయం చేకూరతాయి.
 
చెడుపై మంచి సాధించిన విజయం
దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు -మానవులు తప్ప. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులున్నారు. వారే మనలో ఉండే అరిషడ్వర్గాలనే శత్రువులు. అందరికీ ముప్పును తెచ్చే దుష్టగుణాలు. వారితోనే మనం పోరాడి విజయం సాధించుదాం, జీవితాలను ఆనందమయం చేసుకుందాం.

 
దుర్గ అంటే..?
దుర్గ అంటే దుర్గతులను నశింప చేసేది అని అర్థం. అదేవిధంగా ఎవరిచేతిలోనూ జయింపబడనిది అని కూడా అర్థం. ఎందరో రాక్షసులు రకరకాల రూపాలలో రకరకాల ఆయుధాలతో తన మీదికి వస్తుంటే అందరినీ అన్ని తీరుల ఆయుధాలనీ చేపట్టి వారిని నాశనం చేసే తల్లి దుర్గ.
 
ఈ రోజున ఏం చేయాలి?

దసరా ఉత్సవాల పదిరోజులపాటూ అమ్మను రోజుకో రూపంలో అలంకరిస్తారు. ప్రతినిత్యం అమ్మకు ఇష్టమైన లలితాసహస్రనామస్తోత్రం, బాలాత్రిపురసుందరీస్తవం, మహిషాసురమర్దినీ స్తోత్రం, కనకధారాస్తవం, దుర్గాసప్తశ్లోకీ... ఇలా భక్తులు ఆమె  సమక్షంలో ఏదో ఒక శ్లోకాన్నో, అష్టోత్తరాన్నో పారాయణం చేస్తూ కనిపిస్తారు. దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు ఐదు రోజులు, అందుకు కూడా వీలు లేని వారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి.
 
శక్తి పూజ ఎందుకంటే...
దేవీనవరాత్రులలో శక్తి పూజ ప్రధానం. దేవి అంటే పరమేశ్వరుని శక్తి. ఈ శక్తిని స్త్రీ స్వరూపిణిగా భావించి కొలవడం ఆచారమైంది. అష్టమి రోజున దుర్గాష్టమి, నవమి రోజున మహర్నవమి, దశమి రోజున విజయదశమి అనీ అంటారు. అమ్మవారి దయాతత్వాన్ని అంబ అని, అతిలోక సౌందర్యాన్ని త్రిపుర సుందరి అని, ఆమె భయంకర స్వరూపాన్ని కాళి అని ఉపాసిస్తాం.

 - డి.వి.ఆర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement