ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కడం కష్టంగా ఉంటుంది. కాలం పగబట్టిందేమో అనేంతగా గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అసంతృప్తి, నిస్పృహ మనసును కుదురుగా ఉండనివ్వవు. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిహారాలను పాటించండి.
♦ కాకులకు, కుక్కలకు, ఆవులకు ఆహారాన్ని పెట్టండి. ఇంట్లోని బీరువాలు, నగలు వంటి విలువైన వస్తువులను భద్రపరచుకునే పెట్టెలను ఖాళీగా ఉంచకండి. వాటిలో ఉంచడానికి ఏమీ లేనట్లయితే, కనీసం నాలుగు బాదం గింజలైనా వేసి ఉంచండి.
♦ అనైతిక కార్యకలాపాలకు, అవినీతికి, జూదానికి, స్పెక్యులేటివ్ లావాదేవీలకు దూరంగా ఉండండి.
♦ నిత్యపూజలో భాగంగా లక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించండి. తెలుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టండి.
♦ కనీసం ఆరు ఆదివారాలు నిరుపేద అంధులకు అన్నదానం చేయండి.
♦ శనివారం పూర్తిగా మద్య మాంసాలకు దూరంగా ఉండండి.
♦ చిన్నారులు ఉండే ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల కోసం మిఠాయిలు తీసుకు వెళ్లండి. దక్షిణావర్త శంఖాన్ని సేకరించి, ఇంట్లోని పూజ గదిలో ఉంచి, దానికి నిత్యం ధూపదీపాలు సమర్పించండి.
♦ మీ కోసం పనిచేసే వారికి చెల్లించాల్సిన ప్రతిఫలాన్ని సకాలంలో చెల్లించడాన్ని అలవాటు చేసుకోండి. ఇతరుల వద్ద తీసుకున్న చేబదుళ్లను వీలైనంత త్వరగా తీర్చేయండి.
♦ ప్రతి శనివారం ఆలయాల వద్ద కనీసం పదకొండు మంది నిరుపేదలకు రొట్టెలు పంచిపెట్టండి. గోశాలలకు పెసలతో కూడిన దాణాను దానంగా ఇవ్వండి.
♦ ఇంట్లో ప్రతిరోజూ చేసే నిత్యపూజలో లక్ష్మీస్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీపూజను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీదేవి ఎదుట నేతిదీపం వెలిగించండి.
– పన్యాల జగన్నాథదాసు
Comments
Please login to add a commentAdd a comment