అందం, సంబరం, పువ్వులు, ప్రకృతి, పర్యావరణం, జలవనరులు ఇవన్నీ బతుకమ్మ పండుగలో భాగమని తెలుసు. అయితే ఈ మహిళా కళాకారులు వాటితో పాటు అసమానతలు, లింగ వివక్ష, ఆధ్యాత్మిక ఉత్తేజం.. ఇలా ఎన్నో అంశాలను బతుకమ్మ కోణం నుంచి స్పృశించారు. అందుకే పండుగ వెళ్లిపోయినా.. వారు గీసిన వర్ణాలన్నీ నేటికీ బతుకు ఉత్సవాన్ని ప్రతిఫలిస్తూనే ఉన్నాయి.
– ఓ మధు, సాక్షి, సిటీ బ్యూరో
బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో హైద్రాబాద్ నెహ్రూ గ్యాలరీలో మూడు రోజుల పాటు జరిగిన బతుకమ్మ ఆర్ట్ క్యాంప్‌లో 20–82 ఏళ్ల మధ్య వయసున్న యాభై మంది మహిళా ఆర్టిస్టులు ఒకే వేదిక మీద అక్కడికక్కడ చిత్రాలు గీశారు. తెలంగాణలో ఇంత పెద్దఎత్తున బతుకమ్మపై ‘ఆర్ట్‌క్యాంప్’ జరగడం ఇదే తొలిసారి. తెలంగాణ జాగృతి, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సహకారాలతో జరిగిన ఈ ఆర్ట్ క్యాంపును ప్రముఖ చిత్రకారులు రమణారెడ్డి సమన్వయం చేయగా, అనిత క్యూరేటర్‌గా వ్యవహరించారు. విశేషం ఏమిటంటే.. ఈ క్యాంప్‌లో చిత్రకారిణుల కుంచె నుంచి రూపుదిద్దుకున్న బతుకమ్మ చిత్రాలు చూడముచ్చటగా ఉండటమే కాదు, ఆలోచనలకు పదును పెట్టేలా ఉన్నాయి.
బతుకమ్మ ప్రకృతి పండుగ. చిన్నప్పుడు రకరకాల పువ్వులు తీసుకువచ్చి రంగులు అద్ది తొమ్మిది రోజుల బతుకమ్మను తయారు చేసే వాళ్లం. ప్రకృతితో ఈ విధమైన బంధాన్ని పిల్లలు మిస్ కాకూడదు. ఇలాంటి ఆర్ట్ క్యాంప్ వల్ల కళతోపాటు సంప్రదాయాన్ని గురించిన అవగాహన, పండుగ పట్ల అభిరుచి మరింత పెరుగుతాయని అంటారు పద్మారెడ్డి. ఆమెతోపాటు, ఆర్ట్‌క్యాంప్‌లో పాల్గొన్న మిగతా కళాకారిణులు తమ మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
సమానత్వం కోసం
నాటి భూస్వాముల ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న స్త్రీలను గుర్తు చేసుకుంటూ, మిగిలిన ఆడవాళ్లు పూలను పేర్చి ‘బతుకు అమ్మా..’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చెయ్యడంతో బతుకమ్మ ఉత్సవం మొదలయ్యిందన్న ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అని చెప్తున్నా స్త్రీలకు పరిస్థితులింకా దుర్భరంగానే ఉన్నాయి. అందుకే నా చిత్రంలో స్త్రీ, పురుష చిహ్నాలను తీసుకుని స్త్రీ చిహ్నాన్ని హైలైట్ చేశాను. అసమానత్వానికి గుర్తుగా స్త్రీ చిహ్నానికి పూర్తి ఎరుపు రంగుని వెయ్యలేదు. ఆ చిహ్నంలోనే బతుకమ్మను చూపించాను. ఇక చిత్రంలో ఆదిశక్తి ఆయుధాలు కూడా చూడవచ్చు. రాక్షసులను చంపలేమని దేవుళ్లే వెనక్కి తగ్గినప్పుడు, ఆదిశక్తి దుష్ట సంహారం చేసింది.
– రజని, బిఎఫ్‌ఏ, థర్డ్ ఇయర్
గౌరమ్మ కోసం
బతుకమ్మ స్త్రీల పండుగ. అందుకే లేస్, బట్టలు, పువ్వులతో ఈ పెయింటింగ్ వేశాను. దీంట్లో తొమ్మిది మంది స్త్రీల ముఖాలు, తొమ్మిది రోజుల బతుకమ్మను ప్రతిబింబిస్తాయి. మధ్యలో బతుకమ్మ సమయంలో పూజించే గౌరమ్మను పెట్టాను.
– రూపారాణి
ఉపాసన కోసం
మనలో ఉన్న కుండలి శక్తిని ప్రతిబింబించేలా నా చిత్రంలో చక్రాలు వేశాను. శక్తికి ప్రతిరూపాలు మనుషులు. శక్తి ఉపాసన ద్వారా కుండలిని శక్తి మరింత జాగృతమవుతుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ చేసే వారు కొత్త ఉత్సాహంతో ఉండటాన్ని గమనించవచ్చు. ఏడాదిలో ఒకసారైనా ఇలాంటి ఆరాధన చేస్తే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఇదే ఈ చిత్రం ద్వారా చెప్పాను
– సౌజన్య
కష్టసుఖాల కోసం
భావోద్వేగాలు ఏమీ ముఖంలో కనిపించని; సంతోషం, బాధను కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్న నేటి స్త్రీని పసుపు, కుంకుమ రంగులతో నా చిత్రంలో చూపించాను.
– వేకువ, ఎంఎఫ్‌ఏ, స్టూడెంట్
కలవడం కోసం
ఆంధ్రాకి దగ్గరగా ఉండే భద్రాచలం ప్రాంతం వాళ్లకి బతుకమ్మ అంటే ఏందో తెల్వదు. నేను ఇప్పటి వరకు ఆడలేదు కూడా. టీవీల్లోనే మొదటిసారి చూసిన. అందుకే నా పెయింటింగ్‌లో టీవీ పెట్టాను. అది పండుగో లేక సంతోషంగా ఆడుకునే ఆటో అప్పుడు నాకు తెలియదు. ఈ క్యాంప్‌లో ఇంతమంది సీనియర్ కళాకారిణిలతో కలిసి బతుకమ్మ చిత్రాలు వెయ్యటం హ్యాపీగా ఉండటమే కాదు, బతుకమ్మ ఆడినట్లే అనిపిస్తుంది.
– సమ్మక్క, ఎంఎఫ్‌ఏ స్టూడెంట్
ఆసిడ్ బాధితుల కోసం
నా బిఎఫ్‌ఏ 2010లో పూర్తయింది. పీడిత మహిళకు సంబంధించిన అంశాలపై ఆర్ట్ వర్క్ చేస్తుంటాను. ముఖ్యంగా ఆసిడ్ విక్టిమ్స్ మీద పనిచేస్తాను. ‘అందం ఆత్మకు సంబంధించింది’ అనే ఆలోచనతో చిత్రాలు రూపొందిస్తుంటాను. బాధితులైన స్త్రీలనే నేపథ్యంగా తీసుకున్నాను. వారిని అందరితో సమానంగా పండుగలో భాగం చెయ్యాలని, వివక్షలేని వాతావరణం వారికి కల్పించాలని నా చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశాను.
– వినీల
నీటి కోసం
సిటీ మ్యాప్‌లో నీటి చారలను, నీటి ప్రాంతాలను, అందులో తేలుతున్న బతుకమ్మలను చిత్రంగా మలిచారు సీనియర్ ఆర్టిస్ట్ పద్మారెడ్డి. ‘‘నగరంలో మరింత నీరు ఉంటే, నీలిరంగు మరింతగా వాడే దాన్ని’’ అని నవ్వుతూ అంటారు సీనియర్ ఆర్టిస్ట్.
– పద్మారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment