ఫైట్స్కి రైట్ హ్యాండ్స్ | fight masters ram and laxman brothers special story | Sakshi
Sakshi News home page

ఫైట్స్కి రైట్ హ్యాండ్స్

Published Sun, May 15 2016 12:10 AM | Last Updated on Tue, Oct 2 2018 6:48 PM

ఫైట్స్కి రైట్ హ్యాండ్స్ - Sakshi

ఫైట్స్కి రైట్ హ్యాండ్స్

రైట్ హ్యాండ్ ఒక్కటే ఉంటుంది. తెలుగు సినిమా ఫైట్‌కి రెండు రైట్ హ్యాండ్స్! రామ్... లక్ష్మణ్... అన్న.. తమ్ముడు. రైట్ సోదరుల్లా వీళ్లు ఫైట్ సోదరులు.  వాళ్లు ఏరోప్లేన్‌లను ఎగరేశారు.  వీళ్లు హీరోల కాలర్లను ఎగరేస్తూ...  తెలుగు సినిమా యాక్షన్ ఇమేజ్‌ను  అదరగొట్టేస్తున్నారు.

చిన్న పల్లెటూళ్లో పుట్టి, చదువు సంధ్య లేకుండా, బర్రెలు, మేకలు కాసుకొనే దశ నుంచి ఇవాళ ఇంతమంది గుర్తించే ఫైట్ మాస్టర్స్‌గా ఎదగడం ఒక కల లాగా ఉంది. అంతా ఒక సినిమాలాగే అనిపిస్తుంది. అమ్మానాన్నలకు మేము అయిదుగురం. కవల పిల్లలమైన మేమిద్దరమే ఆఖరు. మా నాన్న గారు నాటకాలు గట్రా వేసేవారు.

నాన్నగారి ఫ్రెండ్‌కి ఫ్రెండ్ - ఫైట్‌మాస్టర్ రాజు గారు. సినీ రంగంలో ఆయనే మాకు గురువు, దైవం. ఆయనదేమో ప్రకాశం జిల్లా చీరాల దగ్గర సంతరావూరు. మాదేమో ఆ పక్కనే నందిగుంటపాలెం. ఊళ్ళో నడిబొడ్డున ఎవరూ కదిలించలేని పెద్ద బండరాయిని పైకి ఎత్తడం ద్వారా అందరి దృష్టీ మా మీద పడింది. ఎప్పటికైనా ప్యాంట్ వేసుకోవాలి, జీవితంలో ఏదో సాధించాలనే తపన మాది. పట్నం వెళ్ళి, ఏదో చేయాలనుకుంటుంటే నాన్న గారు ఫ్రెండ్ ద్వారా చెప్పించడంతో, రాజు మాస్టర్ మాకు ఆశ్రయమిచ్చారు.  

 1987లో మద్రాసు వెళ్ళి, రాజు మాస్టర్ దగ్గర రెండేళ్ళు శిష్యరికం చేశాం. ఇప్పుడంటే కష్టపడి చెక్కుబుక్ మీద సంతకం పెట్టడం నేర్చుకున్నాం కానీ, అప్పట్లో మాకు తెలుగు తప్ప తమిళం రాదు. ఇంగ్లీషు, హిందీ అసలే రాదు. మాస్టర్ వాళ్ళ నాన్న రాఘవులు గారు సీనియర్ ఫైట్ మాస్టర్. ముసలివారైపోయిన ఆయనకు వండి పెట్టడం, బాగోగులు చూసుకోవడం లాంటివన్నీ చూసేవాళ్ళం. ఆ టైమ్‌లోనే రాజు మాస్టర్ చిత్రాల్లో విలన్ గ్యాంగ్‌లో అసిస్టెంట్స్‌గా తెరపై గుంపులో కనిపించేవాళ్ళం. ఎట్టకేలకు మా గురువు వల్ల 1989లో ఫైటర్స్ యూనియన్‌లో సభ్యత్వం వచ్చింది.

 కానీ, దేవుడు రాసే స్క్రీన్‌ప్లే మన అంచనాలూ, ఊహలకు అందదు. మహేశ్‌బాబు నటించిన ‘వంశీ’ (2000)  షూటింగ్ టైమ్‌లో మా ఫ్రెండ్ ఒకరు ‘ఫైట్స్ బాగా చేస్తున్నారు. ఫైట్ మాస్టర్స్‌గా చేయచ్చుగా!’ అన్నాడు. ఫైట్ మాస్టర్‌గా ఎదగాలంటే - ముందుగా అసిస్టెంట్‌గా చేసి, కెమేరా యాంగిల్స్ లాంటివన్నీ నేర్చుకోవాలి. కానీ, మేమెప్పుడూ అలా చేసింది లేదు. లోపల ఎక్కడో అలజడి. సీనియర్ హీరో సురేశ్ ‘శివుడు’ సినిమా చేస్త్తున్నారు. ఆయన మాకు తొలిసారి ఫైట్‌మాస్టర్స్‌గా ఛాన్సిచ్చారు.

 అంతకు ముందు మేము తమిళంలో మాకంటూ కథలు తయారు చేసుకొని, నిర్మాతలకు వినిపించేవాళ్ళం. అందువల్ల కథలు చెప్పడం మాకు అలవాటైంది. ఫైట్ మాస్టర్స్ అయినప్పుడు ఆ ప్రాక్టీస్ ఇక్కడ ఉపయోగపడింది. ‘శివుడు’ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మాకున్న కథలు చెప్పడం, వినడం అలవాటు వల్ల కథలోని కంటెంట్, ఎమోషన్స్ అర్థమైంది. ఫైట్‌మాస్టర్స్‌గా దాన్ని కెమేరాలో ఎలా బంధించాలన్నది ప్రశ్న! ‘శివుడు’ (2001)కు మొదట మేము చేసింది - కుకట్‌పల్లి ఆంజనేయస్వామి గుడిలో ఫైట్. అప్పుడు ‘స్టార్ట్ కెమేరా.. యాక్షన్’ అని ఎలా చెప్పాలో రాత్రంతా ప్రాక్టీస్ చేశాం. తీరా సెట్లోకెళ్ళాక, ఎమోషనలై, ‘స్టార్ట్ కెమేరా’ చెప్పకుండానే ‘యాక్షన్’ చెప్పాం (నవ్వు). ఆ తొలి అనుభవం మర్చిపోలేం.

 ఈ 27 ఏళ్ళ కెరీర్‌లో యాక్షన్ చిత్రాల కె.ఎస్.ఆర్. దాస్‌గారి 100వ సినిమా (రిలీజవలేదు) నుంచి ఇప్పటి బోయపాటి గారి దాకా అందరితో, మహేశ్ సహా పెద్ద హీరోలందర్తో చేయడం మా అదృష్టం. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, పంజాబీ, ఒరియా, భోజ్‌పురీల్లో కలిపి ఫైట్ మాస్టర్‌‌సగా 150 చిత్రాలు చేశాం. మా ఈ ప్రయాణంలో... మర్చిపోలేని ఫైట్స్ కొన్నిటి గురించి...
1. ఒక్క పంచ్.. ఒకే ఒక్క పంచ్
ఫైట్ మాస్టర్స్‌గా రిలీజైన మా తొలి సినిమా మాత్రం పూరీ జగన్నాథ్ గారి ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ (2001). షూటింగ్ హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్స్‌లో. హాఫ్ డేలో చేయాలి. ఒకే ఒక్క పంచ్! హీరో రవితేజ కొడితే, అవతలివాడు గిర్రున తిరిగి పడతాడు. మేమూ కసి మీద ఉన్నాం. చెన్నై నుంచి తెచ్చుకున్న డబ్బులైపోయాయి. కృష్ణానగర్ ఇంట్లో ఏదో గంజి కాచుకొని, తాగుతున్నాం. ఆ రోజు షాట్ చేసి, సంపాదిస్తేనే ఫుడ్. కసితో చేశాం. ఒక్క దెబ్బకి ఓకే. సిన్మా రిలీజైంది. పెద్దహిట్. అక్కడి నుంచి కొట్టో కొట్టు... వరుస హిట్లు.

2. ఫేట్ మార్చిన ఫైట్
కల్యాణ్‌గారి సిన్మా చేయాలనున్నా, మాకెప్పుడూ కుదర్లేదు. డెరైక్టర్ హరీశ్ శంకర్ మమ్మల్ని కల్యాణ్ గారికి పరిచయం చేసి, ‘మన ‘గబ్బర్‌సింగ్’లో ఒక ఫైట్ ఇచ్చి చూడండ’ని రికమెండ్ చేశారు. ఎగ్జిబిషన్‌లో జరిగే ఇంటర్వెల్ ఫైట్ ఇచ్చారు. అమ్మ చనిపోయిందన్న బాధలో హీరో ‘మనల్ని చంపడానికొచ్చినప్పుడు చావాలా, చంపాలా’ అంటూ, గూండాల తుక్కు రేగ్గొడతాడు. చివరకు జెయింట్ వీల్ విరిగి, గూండాపై పడుతుంది. ఫైట్ తీసిన తీరు నచ్చి, ‘ఈ సిన్మా ఫైట్లన్నీ రామ్‌లక్ష్మణ్‌లే చేస్తార’ని చెప్పేశారు. ఆ సిన్మా మాకు పేరే కాదు, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఛాన్సూ తెచ్చింది.

3. వేలు చూపిస్తే... ఈలలే!
‘ఆర్య’ (2004)లో రౌడీలు హీరో మీదకు వస్తారు. అప్పుడు హీరో రౌడీల్ని కొట్టడు. హీరో గుద్దితే పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మ బద్దలవుతుంది. కాలితో లాగి పెట్టి తంతే, పంపు పైన విరిగి, నీళ్ళు పైకి చిమ్ముతాయి. అల్లు అర్జున్‌తో మాకు అదే ఫస్ట్ సినిమా. మాకు ఫస్ట్ ‘నంది’ అవార్డు వచ్చిందీ - ఆ ఫిల్మ్‌కే! ఫైట్ చివరలో హీరో ‘జాగ్రత్త’ అన్నట్లు, వేలు చూపిస్తూ వెళతాడని డిజైన్ చేశాం. హీరో కుర్రాడు కాబట్టి, అలా చూపిస్తే బాగుండదేమోనని డెరైక్టర్ సుకుమార్ అన్నారు. కన్విన్స్ చేశాం. రిలీజయ్యాక జనం మెచ్చారు.

4. ఆ లోటు తీర్చిన క్లైమాక్స్
చిన్నప్పుడు చిరంజీవి గారి ఫిల్మ్‌లు తెగ చూసేవాళ్ళం. ఫైట్ మాస్టర్లయ్యాక చిరంజీవి గారి అబ్బాయి రామ్‌చరణ్‌కి ‘మగధీర’లో ‘10 నిమిషాలలో 400 ఏళ్ళు వెనక్కి’ అంటూ ఇంటర్వెల్ కార్డ్ పడే ముందు వచ్చే హెలికాప్టర్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ డిజైన్ చేశాం. ఇక, ‘గోవిందుడు అందరివాడే’ చేశాం. కానీ, చిరంజీవి గారితో సినిమా చేయలేదే అని లోటుం డేది. నిరుటి ‘బ్రూస్‌లీ’ క్లైమాక్స్ ఫైట్‌తో అది కొంత తీరింది. చిరంజీవి గారు హీరోయిన్‌ను రక్షించి, గుర్రంపై వెళ్ళే స్పెషల్ అప్పీయరన్‌‌స సీన్ డిజైన్ చేయడం మాకు మరపురాని అనుభవం.

5. బాధ, కోపం... రెండూ!
బోయపాటి తీసిన బాలయ్య బాబు ‘సింహా’ (2010)లో మంచి ఎమోషనల్ ఫైట్ ఉంది. హీరో వేసిన రెండు పాత్రల్లో డాక్టర్ పాత్ర చనిపోయే ఫైట్. పద్మాలయా స్టూడియో డౌన్‌లో సెట్ వేశాం. ఆ ఎమోషనల్ ఫైట్ డిజైనింగ్‌కి స్ట్రగులవ్వాల్సొచ్చింది. డాక్టర్ వృత్తిలో ఉన్న హీరో సమాజంలోని దుష్టత్వానికి ఆపరేషన్ చేస్తూ, గొడ్డలి లాంటిది తీసుకొని, ఆవేశంగా చేసే ఫైట్ అది. కొడితే, అవతలివాడి తల తెగుతుంది. నయనతార చనిపోతుంటే హీరో సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉండే ఆ ఫైట్ అందరికీ గుర్తే.

 6. బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లే...
నాగార్జున గారితో ‘నేనున్నాను’కు తొలి ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ డే వర్క్ చేశాం. ఎందుకనో ఆ ఫైట్స్ ఫిట్ అవలేదని మమ్మల్ని తీసేశారు. చాలా బాధపడ్డాం. మరో ఛాన్స్ వస్తే మా పనితనం చూపాలనుకున్నాం. కొన్నేళ్ళకు ‘కింగ్’ (2008) ఛాన్‌‌స వచ్చింది. అంతే! ప్రూవ్ చేసుకోవాలని రెట్టించిన ఉత్సాహంతో కష్టపడ్డాం. గాలిలో ఎగరడం, దూకడం ఆయన పెద్దగా చేయరు. దాంతో, బాబు బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఫైట్లు డిజైన్ చేశాం. అంతే! దర్శకుడు శ్రీను వైట్ల, నాగార్జున - అంతా హ్యాపీ. మమ్మల్ని బాగా ప్రోత్సహించారు.

7. దుమ్ము రేగింది!
లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘రెబల్’(2012)కి కష్టపడి, ఫైట్లు డిజైన్ చేశాం. సిన్మా యావరేజ్‌గా నడిచినా, ఫైట్స్ దుమ్ము రేపాయి. ప్రభాస్‌తోనే కాక, వాళ్ళ పెదనాన్న గారైన కృష్ణంరాజు గారితో మంచి ఎక్స్‌పరిమెంటల్ ఫైట్ చేయించాం. పోలీస్ స్టేషన్‌కు వైట్ సూటు బూటులో వచ్చిన కృష్ణంరాజు తప్పు చేసిన సొంత బంధువైన ఇన్‌స్పెక్టర్‌ను చితకబాది, కుర్చీలో స్టైల్‌గా కూర్చొని వార్నింగ్ ఇచ్చే సీన్‌లో సెంటిమెంట్, ఎమోషన్ - రెండూ ఉంటాయి. అలాగే, సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ బాగుంటాయి.

8. రెండు పాత్రల ఇమేజ్ తంటా
బాలకృష్ణ ‘లెజెండ్’లో ఇంటర్వెల్ సీన్ ఫైట్ డిజైనింగ్ మాకో సవాల్. పెద్ద బాలయ్య, చిన్న బాలయ్య - రెండు పాత్రలుంటాయి. ఇంటర్వెల్ సీన్ దగ్గర చిన్న బాలయ్య పాత్రని కొద్దిగా తగ్గించి, పెద్ద బాలయ్య పాత్రను బైటపెట్టాలి. ఆ పెద్ద పాత్రను రివీల్ చేస్తున్నప్పుడు తగ్గ ఎమోషన్ ఉండేలా ఫైట్ ఉండాలి. పెద్ద బాలయ్య ఈటె పట్టుకొని, మెట్లు దిగి వస్తూ, ఒక్కపోటుకు ఆరుగుర్ని హతమార్చి,‘లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా?’ అని విలన్‌తో అనే సీన్ వెంట్రుకలు నిక్కబొడుచుకొనేలా ఉంటుంది.బీచ్ ఒడ్డున అద్దాన్ని బద్దలు కొట్టు కొని గుర్రంపై చేసే ఛేజ్ కూడా అంతే.

9. ఫైట్‌లో కథ చెప్పాలంటే...
‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ క్లైమాక్స్‌కి కష్టపడ్డాం. పూరీ గారిలో గొప్పేంటంటే, ఆయన ఫైట్ సంగతి మాస్టర్స్‌కి అప్పగించి, షూటింగ్‌లో లేకుండా వెళ్ళిపోతారు. క్లైమాక్స్‌లో తండ్రి ప్రకాశ్‌రాజ్‌కీ, కొడుకైన హీరోకీ మధ్య బంధం తెలియాలి. మరోపక్క బాక్సింగ్ పోటీలో హీరోకూ, హీరో చెల్లెల్ని మోసం చేసిన విలన్‌కీ ఫైట్. ఆ క్షణంలో హీరోలో సెంటిమెంట్, బాధ, యాక్షన్ - ఇలా చాలా ఎమోషన్స్. ఫైట్‌లో కథ, ఎమోషన్ రెండూ చెప్పాలని నలిగిపోయాం. చివరకు ఆ బాక్సింగ్ ఫైట్ బాగా వచ్చింది. తాజా ‘బెంగాల్ టైగర్’ ఫైట్స్ పేరు తెచ్చాయి.

10. సిన్మాను బట్టి మారాల్సిందే!
మనం చేసేవన్నీ కరెక్ట్ అనుకోనక్కర్లేదు. ఎవరైనా లోపం ఉందంటే సరిదిద్దుకోవాలి. చిన్న ఎన్టీయార్‌తో ‘ఊసరవెల్లి, దమ్ము’, ఇటీవల ‘నాన్నకు ప్రేమతో’ చేశాం. పేరు తెచ్చాయి. ‘నాన్నకు...’ క్లైమాక్స్‌లో మాస్‌గా ఫైట్ ప్లాన్ చేశాం. ఆయన వచ్చి, ‘మాస్టర్! నా గెటప్ క్లాస్ కదా’ అన్నారు. అంతే! ఫైట్ డిజైనింగ్ మార్చేశాం. ఏమైనా, మాస్ మెచ్చే యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో ఫైట్ డిజైనింగ్ ఎప్పుడూ థ్రిల్లింగే. బన్నీ ‘రేసుగుర్రం’లో, లేటెస్ట్ ‘సరైనోడు’లో ఫైట్స్       అలాంటివే. ‘సరైనోడు’లో చేతిలో ఇనుప గుండుతో హీరో ఫస్ట్ ఫైట్, పులివేషాల మధ్య ఫైట్ జనం మెచ్చారు.
- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement