ఫస్టాఫ్‌ హిట్టే | First half telugu cinema updates in 2018 | Sakshi
Sakshi News home page

ఫస్టాఫ్‌ హిట్టే

Published Tue, Jul 3 2018 12:03 AM | Last Updated on Tue, May 28 2019 10:04 AM

First half telugu cinema updates in 2018 - Sakshi

మొదటి ఆరు నెలలు బాగా ఆడాయి.సినిమాల్లాగే బ్యాంక్‌ బ్యాలెన్సులు బాగానే నిండాయి.సినిమాలు ఇలాగే ఆడుతూ పాడుతూ భాగమతులను చేస్తూ, రంగస్థలంలో కదం తొక్కుతూ, భరత్‌ అనే నేనులా ప్రతిజ్ఞ చేస్తూ, తొలి ప్రేమలో మళ్లీ మళ్లీ పడుతూ, మహానటీనటులను ఆవిష్కరిస్తూ  మనందర్నీ సమ్మోహనం చేస్తుండాలి.

6 నెలలు...సుమారు 60కి పైగా సినిమాలు..విజయాలెన్ని? వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని.కొన్ని సినిమాలు  కనకవర్షం కురిపించాయి. కొన్ని వచ్చినంత వేగంగా వెళ్లిపోయాయి. అయితే ఈ ఏడాది హిట్‌గా నిలిచిన సినిమాలను లెక్కలోకి తీసుకుంటే.. 6 నెలల్లో ముఖ్యంగా 6 జానర్లు హిట్‌. ‘థ్రిల్, లవ్, రివెంజ్‌ డ్రామా, పొలిటికల్‌ డ్రామా, కామెడీ, బయోపిక్‌’ జానర్స్‌లో వచ్చిన మూవీస్‌లో పెద్ద హిట్టయిన సినిమాలున్నాయి. సిక్స్‌ మంథ్స్, సిక్స్‌ జానర్స్‌.. ఆ విశేషాలు తెలుసుకుందాం.

లెక్క తేల్చింది
‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా. లెక్కలు తేలాలి’. గడచిన ఆరు నెలల్లో ఫేమస్‌ అయిన డైలాగ్స్‌లో ఇదొకటి. నిజంగానే బాక్సాఫీస్‌ వద్ద ‘భాగమతి’ లెక్కలు భేష్‌. లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ మంచి వసూళ్లు రాబడతాయనడానికి అప్పటి అనుష్క ‘అరుంధతి’, ఇప్పుడు అదే అనుష్క సినిమా ‘భాగమతి’ మరోసారి నిరూపించాయి. ఈ ఏడాది తొలి నెలలో రిలీజైన తొలి థ్రిల్లర్‌ ఇది. థ్రిల్లర్‌ మూవీస్‌కి ట్రెండ్‌తో పని లేదు. స్టోరీ–స్క్రీన్‌ప్లే–లీడ్‌ క్యారెక్టర్‌ కుదిరి, డైరెక్టర్‌ బాగా తీయగలిగితే బొమ్మ హిట్‌. అశోక్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ లెక్కలు తేల్చింది. థ్రిల్లర్‌ జానర్‌లో చిన్న బడ్జెట్‌తో రూపొందిన మరో మూవీ ‘అ!’ ఫిబ్రవరి 16న రిలీజై, మంచి ప్రయోగం అనిపించుకుంది. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో సాగిన ఈ థ్రిల్లర్‌ ద్వారా హీరో నాని నిర్మాతగా మారారు. కొత్త దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు మంచి మార్కులు పడ్డాయి. అన్నట్లు జనవరిలో సంక్రాంతికి రిలీజైన పవన్‌ కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ అంచనాలను అందుకోలేదు. బాలకృష్ణ ‘జై సింహా’ వసూళ్లు రాబట్టిన సినిమా అనిపించుకుంది. రాజ్‌ తరుణ్‌ ‘రంగుల రాట్నం’ బాక్సాఫీస్‌ చక్రాన్ని తిప్పలేకపోయింది. నెల మొదట్లో విడుదలైన అల్లాణి శ్రీధర్‌ ‘చిలుకూరి బాలాజీ’ మంచి డివోషనల్‌ మూవీ అనిపించుకుంది. ఇంకా ఈ నెలలో చోటా మోటా సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. 

థ్రిల్లర్‌ వెంటనే కామెడీ
ఓ థ్రిల్లర్‌ మూవీ చూసిన వారానికి ఓ కామెడీ సినిమా చూసే అవకాశం వస్తే పండగే పండగ. ఒకవైపు ‘భాగమతి’ (జనవరి 26) థ్రిల్‌కి గురి చేస్తూ దూసుకెళుతోంది. అది విడుదలైన వారానికి ‘ఛలో’ (ఫిబ్రవరి 2) వచ్చింది. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్‌ స్టోరీ. ఈ మధ్య కాలంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమా అంటే ఇదే. కొత్త దర్శకుడు వెంకీ కుడుముల తీసిన ఈ సినిమాలో నాగశౌర్య హీరో. ఒక్కసారిగా నాగశౌర్య కెరీర్‌ గ్రాఫ్‌ని పెంచింది. ఐరా క్రియేషన్స్‌లో నాగశౌర్య తల్లిదండ్రులు శంకర్‌ప్రసాద్‌ మూల్పూరి, ఉషా మూల్పూరి తొలి ప్రయత్నంలోనే తమ బేనర్‌కి గుర్తింపు తెచ్చే సినిమా నిర్మించారు. ‘ఛలో’లా ఈ 6 నెలల్లో ‘కిర్రాక్‌ పార్టీ’ (ఫిబ్రవరి 16), ‘ఛల్‌ మోహన్‌ రంగ’ (ఏప్రిల్‌ 5) వంటి లవ్‌ బేస్డ్‌ కామెడీ మూవీస్‌ వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సో.. కామెడీ జానర్‌లో ప్రస్తుతానికి ‘ఛలో’నే బాగా కితకితలు పెట్టిందనొచ్చు.

తొలి ప్రేమదే తొలి స్థానం
కామెడీ బాగుంది ఛలో అంటూ నవ్వుకోవడానికి థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులను ఆ తర్వాతి వారం లవ్‌ జర్నీ చేయించింది. ఫస్ట్‌ లవ్‌ ఓ మధురాను భూతి. ‘తొలి ప్రేమ’ (ఫిబ్రవరి 10) సినిమా కూడా ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేసింది. ‘ఫిధా’ వంటి లవ్‌స్టోరీతో హిట్‌ ట్రాక్‌లో ఉన్న వరుణ్‌ తేజ్‌ ‘తొలి ప్రేమ’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుణ్, రాశీ ఖన్నా కెమిస్ట్రీ, కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్‌.. మొత్తంగా ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ఫస్టాఫ్‌లో తెరకొచ్చిన లవ్‌స్టోరీస్‌లో ‘తొలి ప్రేమ’దే తొలి స్థానం. ఆ తర్వాత ప్రేక్షకులను సమ్మోహనపరిచిన మరో లవ్‌స్టోరీ ‘సమ్మోహనం’. ఫస్టాఫ్‌ ఎండింగ్‌లో ఈ చిత్రం మంచి ఫీల్‌ని కలగజేసింది. జూన్‌ 15న విడుదలైన ఈ లవ్‌స్టోరీ యాక్టింగ్‌వైజ్‌గా సుధీర్‌బాబు, అదితీ రావులకు మంచి పేరు తెచ్చింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ల కాంబినేషన్‌లో ‘జెంటిల్‌మన్‌’ తర్వాత మరో హిట్‌ నమోదైంది. ఈ ఏడాది లవ్‌ జానర్‌లో వచ్చిన మరో మూవీ ‘మెహబూబా’. వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో తనయుడు ఆకాశ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ తీశారు. మే 11న విడుదలైన ఈ లవ్‌స్టోరీ భారీ అంచనాల నడుమ విడుదలై, పూరి నుంచి వచ్చిన ఓ ప్రయోగం అనిపించుకుంది. ఇక ఫిబ్రవరిలో విడుదలైన వేరే సినిమాలు రవితేజ ‘టచ్‌ చేసి చూడు’, మోహన్‌బాబు ‘గాయత్రి’, సాయిధరమ్‌ తేజ్‌ ‘ఇంటెలిజెంట్‌’ వంటి వాటి నుంచి ప్రేక్షకులు ఇంకా ఏదో ఆశించారు.

విన్నారా.. 200 కోట్లకు పైనే!
మార్చి, ఏప్రిల్‌ అంటే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి పరీక్షే. పరీక్షలకు ప్రిపేరయ్యే పిల్లలు థియేటర్లకు రారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివించడంతో బిజీ అవుతారు. సినిమా ఎంతో బాగుంటే తప్ప రారు. ‘రంగస్థలం’ అలాంటి మూవీ. ఇప్పుడు వెళుతోన్న ట్రెండ్‌కి ఫుల్‌ డిఫరెంట్‌. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ డ్రామా. గళ్ల లుంగీ, పూల చొక్కా, గడ్డం, కేర్‌లెస్‌ బాడీ లాంగ్వేజ్‌.. ఇవన్నీ ఒక ఎత్తయితే చెవిటివాడిగా రామ్‌చరణ్‌ కనిపించడం మరో ఎత్తు. అర్బన్‌ మూవీస్‌ చేస్తున్న రామ్‌చరణ్‌తో రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఓ సాహసం. వినిపించని క్యారెక్టర్‌లో అంటే ఇంకా సాహసం. దర్శకుడు సుకుమార్‌ ఈ సాహసంలో సక్సెస్‌ అయ్యారు. నటుడిగా రామ్‌చరణ్‌ మంచి అంటే సరిపోదు.. అంతకు మించి అనాలి. అంత బాగా చేశారు. మార్చి 30న రిలీజైన ‘రంగస్థలం’ ఫస్ట్‌ డేనే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 200 కోట్లకు పైగా వసూలు చేసి, ‘వింటున్నారా.. మా సినిమా కలెక్షన్స్‌’ అని వినపడనట్లు వ్యవహరించిన వాళ్లకూ గట్టిగా సౌండ్‌ చేసి మరీ చెప్పింది. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌’.. ఇలా వరుస హిట్లతో ఉన్న మైత్రీ మైవీ మేకర్స్‌ నిర్మాతలు మోహన్‌ చెరుకూరి, నవీన్‌ యర్నేని, వై. రవిశంకర్‌ హ్యాట్రిక్‌ సాధించారు. మార్చిలో వచ్చిన ఇతర చిత్రాలు ‘దండుపాళ్యం 3’, కల్యాణ్‌ రామ్‌ ‘ఎంఎల్‌ఎ’ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకోలేకపోయాయి. ఇదే నెలలో వచ్చిన శ్రీవిష్ణు ‘నీదీ నాదీ ఒకే కథ’ బాగుందనిపించుకుంది. ఈ చిత్రంతో దర్శకుడు వేణు ఊడుగుల సీరియస్‌ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు.

సక్సెస్‌కు హామీ
మార్చిలో ‘రంగస్థలం’ రూపంలో ఓ బంపర్‌ హిట్‌ తగిలితే ఏప్రిల్‌ మరో బంపర్‌ హిట్‌ ఇచ్చింది. ‘భరత్‌ అనే నేను’ హామీ ఇస్తున్నాను.. అని సినిమాలో మహేశ్‌బాబు అంటారు. ట్రైలర్‌లో ఈ డైలాగ్‌ విని, సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇస్తామని చిత్రనిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు కొరటాల శివ హామీ ఇచ్చినట్లుగా ఫ్యాన్స్‌ అనుకున్నారు. అదే జరిగింది. ఈ స్టైలిష్‌ పొలిటికల్‌ డ్రామాలో మేడమ్‌ స్పీకర్‌ అంటూ స్టైలిష్‌ ఇంగ్లిష్‌తో, సీఎంగా గంభీరమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నారు మహేశ్‌బాబు. ఈ పొలిటికల్‌ జానర్‌ని కొరటాల శివ ఎంతో ఇంటెలిజెంట్‌గా తీసినట్లుగా అనిపిస్తుంది. వసూళ్లు 200 కోట్లు దాటాయి.  ఈ సినిమా తర్వాత ఏప్రిల్‌లో మిగతా సినిమాలు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వంటివి వచ్చాయి. మంచు విష్ణు–జి. నాగేశ్వరరెడ్డిలది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. అందుకే ఇంకా ఇంకా ఏదో కావాలని ఆడియన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. వరుస విజయాలతో దూసుకెళుతోన్న నాని విషయంలోనూ ఇదే జరిగింది.

మహాద్భుతం
మే ఆశాజనకంగా మొదలైంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ (మే 4) అంటూ దేశభక్తి సినిమాతో అల్లు అర్జున్‌ సిల్వర్‌ స్క్రీన్‌పైకి వచ్చారు. ఇప్పటివరకూ బన్నీ చేయని బ్యాక్‌డ్రాప్‌. రియల్‌ సోల్జర్‌ ఎలా ఉంటారో అలా ఫిజిక్‌ని మార్చుకున్నారు. లుక్‌ పర్ఫెక్ట్‌. యాక్టింగ్‌ సూపర్‌. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్‌ నిర్మాత. నాగబాబు సమర్పకులు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఇందులో ‘సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటి నిండుగా నిదర పోదురా..’ అనే పాట మనసుకి హత్తుకుంటుంది. సినిమాలో ఆ డెప్త్‌ లోపించిందన్నది కొందరి వాదన. ఏదైతేనేం దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. ఇదే నెలలో (మే 9) వచ్చిన ‘మహానటి’ ఓ అద్భుతం. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం సినిమాలు చూడటం మానేసిన ప్రేక్షకులను కూడా థియేటర్‌కి రప్పించింది. సావిత్రి మీద ఉన్న అభిమానం అలాంటిది. అఫ్‌కోర్స్‌ సినిమా బాగా లేకపోతే కష్టమే. సావిత్రిగా కీర్తీ సురేష్‌ అభినయం భేష్‌. రిలీజయ్యాక జెమినీ గణేశన్‌ పాత్ర, కొన్ని విషయాలపరంగా విమర్శలు వచ్చినా అవేవీ సినిమా చూడనివ్వకుండా ఆపలేకపోయాయి. బయోపిక్‌ జానర్‌లో ఈ ఏడాది వచ్చిన ఈ తొలి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిర్మాతలు  ప్రియాంకా దత్, స్వప్నా దత్‌లు తండ్రి అశ్వనీదత్‌లా మంచి నిర్మాతలు అనిపించుకున్నారు. మేలో వచ్చిన రవితేజ ‘నేల టిక్కెట్టు’ అనుకున్నంతగా టిక్కెట్లు తెంచలేకపోయింది. నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ అతని ‘ఛలో’ స్పీడ్‌ని అందుకోలేకపోయింది.

సమ్మోహనపరిచింది
జూన్‌ 1 నిరాశగా మొదలైంది. ‘శివ’తో సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్న నాగార్జున–రామ్‌గోపాల్‌వర్మల నుంచి ‘ఆఫీసర్‌’ వస్తోందంటే ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇద్దరి ఫ్యాన్స్‌. నెల మొదటి రోజున రిలీజైన నాగార్జున ‘ఆఫీసర్‌’, ఆ తర్వాత కల్యాణ్‌ రామ్‌ ‘నా నువ్వే’, రాజ్‌ తరుణ్‌ ‘రాజుగాడు’ వంటి పెద్దా చిన్నా సినిమాలు రిలీజయ్యాయి. వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. ‘సమ్మోహనం’ ఓ రిలీఫ్‌. కామెడీ జానర్‌ ‘జంబలకిడి పంబ’ నాటి ‘జంబ లకిడి పంబ’ అంతగా నవ్వించలేకపోయింది. కమెడియన్‌ ‘షకలక’ శంకర్‌ హీరోగా నటించిన ‘శంభో శంకర’ గత శుక్రవారం రిలీజైంది. అదే రోజున ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ వచ్చారు. ఆల్‌మోస్ట్‌ కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ‘పెళ్ళి చూపులు’తో మంచి దర్శకుడని నిరూపించుకున్న తరుణ్‌ భాస్కర్‌ ఈ చిత్రంతో ఆ ఇమేజ్‌ని ఇంకా పెంచుకోగలిగారు. ఫస్టాఫ్‌ క్లోజింగ్‌ ఈ హిట్‌తో ముగిసిందనాలి.  ఇక వచ్చే ఆరు నెలలు ఎలా ఉంటుందో చూద్దాం. గతించిన కాలం కంటే రాబోవు కాలము మేలు అనే సామెతను గుర్తు చేసుకుందాం.
– డి.జి. భవాని 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement