పైన సన్‌ కింద స్టార్స్‌ | special story to summer movies | Sakshi
Sakshi News home page

పైన సన్‌ కింద స్టార్స్‌

Published Sat, Apr 21 2018 12:00 AM | Last Updated on Thu, May 10 2018 12:13 PM

special story to summer movies - Sakshi

ఎండాకాలం భగ్గుమంటోంది.సన్‌ ఆక్సిలేటర్‌ తొక్కాడు.ఫార్టీ దాటింది!ఏమో ఫిఫ్టీ దాకా పోవచ్చు!ఎటు చూసినా బర్నింగే.దాంట్లోనే ఉంటుందండీ ఎర్నింగూ!సమ్మర్‌ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి.పైన సన్‌
కింద స్టార్‌. ఎంజాయ్‌ ద సీజన్‌.


సూపర్‌ రీసౌండ్‌
చిట్టిబాబుకు ‘రంగస్థలం’  సినిమాలో సౌండ్‌ ప్రాబ్లమ్‌. కానీ మూవీ సక్సెస్‌ సౌండ్‌ మాత్రం గట్టిగా సాలిడ్‌గా వినిపించింది. రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మించిన సినిమా ‘రంగస్థలం’. సినిమా సమ్మర్‌ హీట్‌ ‘రంగస్థలం’ హిట్‌తోనే స్టారై్టందని చెప్పవచ్చు. చిత్రంలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, కుమార్‌బాబు పాత్రలో ఆది పినిశెట్టి, రంగమ్మత్త పాత్రలో అనసూయ నటించారు. ఈ బొమ్మ థియేటర్‌లో ఇంకా ఆడుతోంది. మరి థియేటర్‌లో చిట్టిబాబును పలకరించిరండి. గుర్తుపెట్టుకోండి విజిల్స్, అరుపుల్స్‌తో గట్టిగా సౌండ్‌ చేయండి. ఎందుకంటే చిట్టిబాబు సౌండ్‌ ఇంజనీర్‌ అని తెలుసు కదా. అదేనండి కాస్త వినికిడి లోపం అని మరోసారి గుర్తుండేలా చెబుతున్నాం.

భరత్‌ విజన్‌ అదుర్స్‌
ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత ఉండాలంటున్నారు సీయం భరత్‌ రామ్‌. తప్పు చేస్తే కాస్త కఠినంగానే ఉంటాడు కానీ పరిస్థితుల నుంచి తప్పించుకోడు. చేసిన ప్రామిస్‌ను ఇచ్చిన హామీని మర్చిపోడు. అసెంబ్లీ స్టెప్సే కాదు. గరీబోడి గడప కూడా తొక్కుతాడు. మరి..సీయంగా చేసిన ప్రామిస్‌ను నిలబెట్టుకోవడంలో భరత్‌ రామ్‌ ఎలా గెలిచాడు అన్నది మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో చూడాల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీయం భరత్‌ రామ్‌ పాత్రలో మహేశ్‌బాబు నటించారు. కియారా అద్వాని కథానాయిక. మరి..భరత్‌ రామ్‌ పరిపాలన అండ్‌ విజన్‌ అదిరిపోయాయి అంటున్నారు ప్రేక్షకులు. ఓ సారి భరత్‌ రామ్‌ను చూసిరండి. థియేటర్స్‌లో మాస్‌ క్లాస్‌ కలిపి కుమ్మేశాడు.

ఉన్నది ఒకటే ఇండియా
మా కులం భారతీయం. మా మతం మానవత్వం. మా వ్యక్తిత్వం సమానత్వం అని ఫీలయ్యేవారు బోర్డర్‌లో ఉండే సైనికులు. వారిలో ఒకడే సూర్య. అందుకే సౌత్‌ ఇండియా, నార్త్‌ ఇండియా, ఈస్ట్, వెస్ట్‌ ఇన్ని ఇండియాలు లేవు. ఉన్నది ఒకటే ఇండియా అంటున్నాడు సోల్జర్‌ సూర్య. కానీ సూర్యకి కొంచెం కోపం ఎక్కువ? ఈ కోపం వల్లే బోర్డర్‌లో కొన్ని పరిస్థితులను ఫేస్‌ చేయాల్సి వచ్చింది. అవేంటో ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాలో చూడండి అంటున్నారు చిత్రబృందం. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో సోల్జర్‌ సూర్య పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్‌. సూర్య కోపాన్ని మే 4న చూడండి. అదేనండి..  ఆ రోజే సినిమా రిలీజŒ  అన్నమాట.

అనగనగా ఓ మహానటి
మధురవాణి...అంటే అర్థం తెలుసుగా మధురమైన మాటలు పలికే అమ్మాయి అని. పైగా బీఏ గోల్డ్‌ మెడలిస్ట్‌. ఆపై జర్నలిస్ట్‌. మరి..విజయ్‌ ఆంటోనీతో కలిసి మధురవాణి అనగనగా ఓ మహానటి అంటూ అలనాటి అందాల అభినేత్రి సావిత్రి కథను చెప్పడానికి రెడీ అయ్యారు. మరి..సావిత్రి గురించి ఏఏ కొత్త విషయాలు ఎలా చెప్పారనేది మే 9న రిలీజ్‌ కానున్న ‘మహానటి’ సినిమాలో చూడండి. సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రం ‘మహానటి’. సావిత్రి పాత్రలో హీరోయిన్‌ కీర్తీ సురేశ్‌  నటించారు. జర్నలిస్ట్‌ మధురవాణి పాత్రలో సమంత, విజయ్‌ ఆంటోనీ పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించారు. మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్‌ పతాకంపై ప్రియాంకా దత్‌ నిర్మించారు.

రాజుగాడి జబ్బు వేరయ్యా!
క్లెప్టోమేనియాను తెచ్చుకున్నాడు రాజు...ఇదేదో డిగ్రీ అనుకునేరు.. కాదండి బాబు. దిస్‌ ఈజ్‌ డిసీజ్‌. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా.. వాళ్లకు తెలియకుండానే వాళ్లు దొంగతనాలు చేస్తుంటారు. ఎంతలా అంటే సొంత వస్తువులే దొంగలించుకుని దాచుకునేంతలా. అర్థం అయ్యిందిగా.. జబ్బులందు రాజుగాడి జబ్బు వేరయ్యా అని. రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్‌ జంటగా సంజనరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. రాజు పాత్రలో నటిస్తున్నారు రాజ్‌తరుణ్‌. మరి..రాజుగాడి జబ్బు చిత్రాలు ఎంటో మే 11న తెలుసుకోండి.

జన్మజన్మల బంధం
సైనికుడిని ప్రేమించింది ఓ అమ్మాయి. ఈ సైనికుడి మనసులో దేశం మీద ఉన్న ప్రేమలో కాస్తో కూస్తో తనపై ఉన్నా చాలని తపన పడుతుంది. అంటే ఆ అమ్మాయి ఎంతగా అబ్బాయిని ఇష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అబ్బాయి కూడా దేశం తర్వాత ఆ అమ్మాయికే మనసులో స్థానం ఇచ్చాడు. కానీ వారి ప్రేమ సక్సెస్‌ కావడానికి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు అడ్డుగోడలుగా నిలిచాయి. మరి..ఆ గోడలనుప్రేమికులు ఎలా పగలగొట్టారో తెలుసుకోవాలంటే పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మెహబూబా’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కూడా మే11న రిలీజ్‌ కానుంది. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌  పూరి హీరోగా నటించాడు. నేçహాశెట్టి కథానాయికగా నటించారు. ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ని బట్టి ఈ సినిమా గత జన్మకు కనక్టయ్యేలా ఉంటుందని ఊహించవచ్చు. అంటే వీళ్లది జన్మజన్మల బంధమేమో?.

స్పీడ్‌ పెంచాడు
ఫస్ట్‌ గేర్‌.. నెక్ట్స్‌ సెకండ్‌ గేర్‌ వేసుకుంటూ కెరీర్‌లో ముందుకెళ్తుంటారు ఆర్టిస్టులు. కానీ ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి’ సినిమాలతో డైరెక్ట్‌గా థర్డ్‌గేర్‌ వేసి కెరీర్‌లో రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు విజయ్‌ దేవరకొండ. ఇదే స్పీడ్‌లో నోటా చిత్రంతో చెన్నై రోడ్డు కూడా ఎక్కాడు.  ఈ సినిమా తెలుగులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ వేసవిలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద కాస్త ఆగి థియేటర్స్‌లోకి రానున్నారు. విజయ్‌  హీరోగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’ వచ్చే నెల 18న రిలీజ్‌ కానుంది. ప్రియాంకా జవాల్కర్, మాళవిక నాయర్‌ కథానాయికలు. రాహుల్‌ సంకృత్యాన్‌ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

సేమ్‌ ఎనర్జీ
కొత్త ఊపొస్తుంది. ఉత్సాహం పొంగుకొస్తుంది హీరో రవితేజ ఎనర్జీని సిల్వర్‌ స్క్రీన్‌పై చూస్తే. ఆయన నటన అలా ఉంటుంది. ఈ వేసవి వినోదాన్ని ప్రేక్షకులకు పంచేందుకు ఆయన కూడా కర్చీఫ్‌ వేశారు. ఫస్ట్‌లుక్‌తో ఉగాదికి గుర్తు చేశారు. ఫస్ట్‌లుక్‌లో రవితేజ గెటప్‌ చూస్తుంటే ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గినట్లు లేదు. బాక్సాఫీసు వద్ద టికెట్లు తెచ్చి, థియేటర్‌లో చించి ఆడియన్స్‌ మూవీని ఏ లెవల్‌లో ఎంజాయ్‌ చేస్తారో చూడాలంటే మాత్రం రవితేజ తాజా చిత్రం ‘నెలటిక్కెటు’్ట బొమ్మ థియేటర్స్‌లో పడేంత వరకు ఆగాల్సిందే. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. షూటింగ్‌ పూర్తి కావచ్చింది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మే 24న సినిమా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

పవర్‌ఫుల్‌ డ్యూటీ
మొదలుపెడితే పూర్తి చేసేంతవరకు ఆగే రకం కాదు ఈ పోలీస్‌ ఆఫీసర్‌. ఇన్వెస్టిగేషన్‌ కోసం హైదరాబాద్‌ నుంచి ముంబై వచ్చాడు. మరి.. కేసు ఏంటి? ఆఫీసర్‌ డ్యూటీని ఎంత పవర్‌ఫుల్‌గా చేశాడు అన్నది తెలుసుకోవాలంటే ‘ఆఫీసర్‌’ సినిమా చూడాల్సిందే. ఆల్మోస్ట్‌ 25ఏళ్ల తర్వాత నాగార్జున హీరోగా సుధీర్‌చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘ఆఫీసర్‌’. మైరా సరీన్‌ ఫీమేల్‌ లీడ్‌ క్యారెక్టర్‌ చేశారు. నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘శివ’ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ‘ఆఫీసర్‌’ మే 25న థియేటర్స్‌లోకి వస్తాడు.

మేరా.. మీరా
చూశారుగా ‘నా నువ్వే’ సినిమాలో కల్యాణ్‌రామ్‌ సూపర్‌ లుక్‌. ఇంత సూపర్‌గా ఉన్నోడు ఎందుకు ఖాళీగా ఉంటాడు. అందుకే మీరా మేరా అంటున్నాడు. అర్థం కాలేదా మీరా అనే రేడియో జాకీని లవ్‌ చేస్తున్నాడు. మరి..మ్యాజిక్‌ లవ్‌లో నెక్ట్స్‌ ఏం జరిగింది అనేది మాత్రం సస్పెన్స్‌. థియేటర్‌లో చూడాల్సిందే. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నా నువ్వే’. ఈ సినిమాను మే 25న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని చిత్రాలు వేసవిలో వినోదాన్ని ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నాయి.

ఫైనల్‌గా ఆచారి ఫిక్స్‌ చేసుకున్నాడు
ఏప్రిల్‌ 27న సినిమాను రిలీజ్‌ చేయడానికి ముందు అల్లు అర్జున్‌ సూర్యగా బుక్‌ చేసుకున్నాడు. తర్వాత సీయం భరత్‌ రామ్‌గా థియేటర్స్‌కు వస్తున్నానని మహేశ్‌బాబు ప్రామిస్‌ చేశాడు. ఇంతలో.. రోబో రెడీ అయ్యాడన్న వార్తలు వచ్చాయి. రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. రోబో సినిమాకు సీక్వెల్‌ చిత్రమిది. అంతలోనే తూచ్‌ అన్నారు. ‘కాలా’ ఖాయం అన్నారు. రజనీకాంత్‌ హీరోగా ‘కబాలి’ ఫేమ్‌ రంజిత్‌. పా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. కానీ ‘కాలా’తో క్లాష్‌ వద్దనుకుని స్నేహపూర్వకంగా భరత్, సూర్య మాట్లాడుకుని వేరే డేట్స్‌కి షిఫై్ట పోయారు.స్ట్రైక్‌తో ‘కాలా’ రానన్నాడు. దీంతో లక్కొచ్చి ఆచారి డోర్‌ కొట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆచారి రంగంలోకి దిగాడు. ఏప్రిల్‌ 27న సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు ఎనౌన్స్‌ చేశాడు. విష్ణు, ప్రగ్యా జైస్వాల్‌ జంటగా జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. సో..ఫైనల్‌గా సోల్జర్, సీయం, రోబో, గ్యాంగ్‌స్టర్‌ రావాలనుకున్నా.. గ్రహచారం అడ్డొచ్చి, ఆచారికి అన్నీ కలిసొచ్చి రిలీజ్‌కు రెడీ అయ్యాడు. అంతేకాదండోయ్‌.. వేసవికి గోపీచంద్‌ ‘పతం’ పట్టి థియేటర్స్‌లోకి వద్దాం అనుకున్నాడు కానీ వర్క్‌ కాస్త బ్యాలెన్స్‌ ఉండటంతో పంతం కొంచెం సడలించి జూలైకి రెడీ అవుతున్నాడు. అన్నట్లు తమిళనాడులో స్ట్రైక్‌ క్లోజ్‌ అయ్యిందిగా ఇక ‘కాలా’ లైన్లోకి వచ్చాడు. జూన్‌ 7న థియేటర్స్‌లోకి వస్తున్నాడు. 
– ముసిమి శివాంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement