‘మహానటి’.. కీర్తి సురేష్‌ | 66th National Film Awards onFull winners details | Sakshi
Sakshi News home page

తెలుగు వెలిగింది

Published Sat, Aug 10 2019 3:02 AM | Last Updated on Sat, Aug 10 2019 9:36 AM

66th National Film Awards onFull winners details - Sakshi

66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాను భారీ పురస్కారాలు వరించాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేష్‌ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు అవార్డునుఆయుష్మాన్‌ ఖురానా(అంధాధూన్‌), విక్కీ కౌశల్‌(ఉడి)కు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా ఆధిర్‌ ధర్‌ (ఉడి) ఎంపికయ్యారు. ఇక బెస్ట్‌ మేకప్, స్పెషల్‌ ఎఫెక్ట్స్, ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే , ఉత్తమ ఆడియోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్‌ డిజైనింగ్, సౌండ్‌ మిక్సింగ్‌ విభాగాల్లో ‘తెలుగు వెలిగింది’. 

తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఈ దారిలో మరింత విస్తృతంగా నడవడానికి కావాల్సింది అవార్డులు, రివార్డులు. తెలుగులో వస్తున్న కొత్తతరం సినిమాలకు ప్రేక్షకులు అభినందనలతో ప్రేమను అందిస్తుంటే, జాతీయ అవార్డులు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, మేకప్, స్పెషల్‌ ఎఫెక్ట్, కాస్ట్యూమ్‌ డిజైనింగ్, సౌండ్‌ మిక్సింగ్, ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు వెలిగింది.

చిన్నూ.. అవార్డ్‌ వచ్చిందని అరిచాను
– రాహుల్‌ రవీంద్రన్‌ (‘చిలసౌ’ దర్శకుడు)
పదేళ్ల క్రితం మా ఫ్రెండ్స్‌ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘చిలసౌ’ కథ తయారు చేసుకున్నాను. కెరీర్‌లో ఇలాంటి అవార్డ్‌ వస్తుందని ఊహించలేదు. ఇవాళ చాలా స్పెషల్‌ రోజు. నా మొదటి సినిమాకు నేషనల్‌ అవార్డ్‌ రావడం, రెండో సినిమా రిలీజ్‌ కావడం, డెబ్యూ డైరెక్టర్‌గా ‘సాక్షి’ నాకు అవార్డ్‌ ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని మెచ్చుకున్నా, మన పని నచ్చినా సరే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల ఆశీర్వాదం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది.  ‘మీకు నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది’ అని చాలా ఫోన్లు వచ్చాయి. నాకు అర్థం కాలేదు. వెంటనే చిన్ను (రాహుల్‌ భార్య చిన్మయి)కి ఫోన్‌ చేసి గట్టిగా ‘చిన్నూ...నాకు నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది..’ అని అరిచాను. తను చాలా హ్యాపీగా ఫీల్‌ అయింది. అవార్డ్‌ కోసం ‘చిలసౌ’ ఎప్పుడో పంపించి మర్చిపోయాం. ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. కథను నమ్మిన హీరో, నిర్మాతలకు, నాగార్జున సార్‌కి అందరికీ థ్యాంక్స్‌.


క్రెడిట్‌ ముగ్గురికి దక్కుతుంది
 

– ప్రశాంత్‌ వర్మ, (’అ!’ దర్శకుడు)
చాéలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా మేకప్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. దర్శకుడిగా ఫస్ట్‌ సినిమాకే అవార్డ్స్‌ రావడం ప్రోత్సాహంలా ఉంటుంది. విభిన్నమైన సినిమాలు తీయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కమర్షియల్‌ సినిమాలా? డిఫరెంట్‌ సినిమాలా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఈ అవార్డ్స్‌ ఇంట్రెస్ట్‌ పెంచుతాయి. నేషనల్‌ అవార్డ్స్‌కు స్పెషల్‌ రెస్పెక్ట్‌ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ‘అ!’ రిలీజ్‌ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు ఎందుకో ఇంట్లో హోమ్‌ థియేటర్‌ సెట్‌ చేసుకొని చూస్తూ ఉన్నా. అర్ధగంట అవగానే నేషనల్‌ అవార్డ్‌ వచ్చిందంటూ కాల్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్‌గా నిలబడినందుకు నానీగారికి స్పెషల్‌ థ్యాంక్స్‌. మేకప్‌ చీఫ్‌ రంజిత్‌తో పాటు కాస్ట్యూమ్‌ డిపార్ట్‌మెంట్‌ శాంతి, అదితీ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ల ముగ్గురికీ ఈ క్రెడిట్‌ వెళ్లాలనుకుంటున్నాను.

అస్సలు ఊహించలేదు – రాజాకృష్ణన్

(‘రంగస్థలం’ ఆడియోగ్రాఫర్‌)

బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు సాధించినందుకు సంతోషంగా ఉంది. అది కూడా నేను చేసిన తెలుగు సినిమాకు రావడం హ్యాపీ. జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్‌ సగం చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్రలో బాగా నటించారు. హీరోకు వినికిడి సమస్య ఉండటంతో సౌండింగ్‌ ఎలిమెంట్స్‌ను ఎలివేట్‌ చేయడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. సౌండింగ్‌కు మంచి స్కోప్‌ దొరికింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా చేశాను. సుకుమార్‌గారు బ్రిలియంట్‌ డైరెక్టర్‌. ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు థ్యాంక్స్‌.
66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మా బాధ్యత పెరిగింది

–  నాని

మేకప్, వీఎఫ్‌ఎక్స్‌ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ‘అ’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్‌ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని, ప్రశాంతి తిపిరనేని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల హీరో, నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘మా వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో నిర్మించిన తొలి చిత్రం ‘అ’ మంచి విజయాన్ని సాధించి, ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా యూనిట్‌ తరపున జ్యూరీకి థ్యాంక్స్‌’’ అన్నారు.

66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ‘మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్నవారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో అవార్డులు గెలుచుకున్నవారికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఈ సినిమాల రిలీజ్‌కు ముందే చిరంజీవి ఊహించి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మహానటి’ సినిమా విడుదల తరవాత కూడా ఓ సందర్భంలో యూనిట్‌ సభ్యులను చిరంజీవి అభినందించిన సంగతి విదితమే.


మరాఠీలో మెరిసిన తెలుగు తేజం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్‌’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్‌ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. మరాఠీ చిత్రం ‘నాల్‌’ (బొడ్డుతాడు) చిత్రానికి సుధాకర్‌ రెడ్డి ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన సుధాకర్‌ రెడ్డి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ వంటి టాలీవుడ్‌ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల్యంతో పెనవేసుకున్న అనుభవాలను, తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ  చిత్రంలో సుధాకర్‌ ఉద్వేగభరితంగా చూపారు. అదే విధంగా ‘నాల్‌’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలనటుడు శ్రీనివాస్‌ పోకలేకు మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించడం విశేషం.

కేజీఎఫ్‌కు డబుల్‌ ధమాకా
యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌’. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించారు. గత ఏడాది డిసెంబర్‌ 21న విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్, బెస్ట్‌ ఫైట్స్‌ విభాగాల్లో అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు యష్, ప్రశాంత్‌ నీల్, విజయ్‌ కిరంగదూర్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’ను త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

పాటకు తొలి అవార్డు
‘పద్మావత్‌’ సినిమాకు బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్, బెస్ట్‌ కొరియోగ్రఫీ, బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఆయనే సంగీత దర్శకుడు కూడా. భన్సాలీ మాట్లాడుతూ– ‘‘క్రియేటివ్‌ ఫిల్డ్‌లో ఆర్టిస్టులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. కానీ ‘పద్మావత్‌’ సినిమా విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువగానే సమస్యలను ఫేస్‌ చేశాను. నేను చేసిన సినిమాల్లో కల్లా ‘పద్మావత్‌’ చాలా కష్టతరమైనది. చిత్రీకరణ సమయంలో మాపై దాడులు జరిగాయి.

ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు, మార్చ్‌లు చేశారు. బ్యాన్‌ చేయమన్నారు. ఇలా ఈ సినిమాకి ప్రతి విషయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ కారణాల చేత నేను ఫీలైన ప్రతిసారీ ఓ పాట తీసేవాడిని. కొంచెం రిలీఫ్‌గా అనిపించేది. అన్ని సమస్యల మధ్య కూడా నేను ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే ఆలోచించా. ఈ సినిమా విజయం సాధించడానికి అదొక కారణం అనిపించింది. ఇప్పుడు మా సినిమాకు అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. ఇదొక ఎమోషనల్‌ మూమెంట్‌ మాకు. నా ప్రతి సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుంది. సంగీతమే నా ప్రపంచం’’ అని అన్నారు. అయితే.. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్‌కు అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి.

బుల్‌బుల్‌ పాడగలదు!
అస్సామీ సినిమాకు ‘జాతీయ ఉత్తమ చిత్రం’ అవార్డు అందని ద్రాక్ష. అది 2018 వరకే. రీమా దాస్‌ తన మొదటి  సినిమా ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’తో ఆ డ్రీమ్‌ను డెబ్యూ (తొలి) సినిమాతోనే తీర్చేశారు. అస్సామీ రాక్‌స్టార్‌గా నిలిచారు. తొలి సినిమాయే అవార్డు అందుకునే స్థాయిలో ఉన్నప్పుడు తదుపరి సినిమా మీద అంచనాలు మామూలే. ఆ అంచనాలను రెండో సినిమాతోనూ సునాయాసంగా అందుకొని అందర్నీ మరొక్కసారి రీమా దాస్‌ ఆశ్చర్యపరిచారు. రీమా రెండో చిత్రం ‘బుల్‌బుల్‌ కెన్‌ సింగ్‌’ ఉత్తమ అస్సామీ చిత్రం అవార్డు గెలుచుకుంది. బుల్‌బుల్, బోణీ, సుము అనే ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమ సమాజం కోరుకున్నట్టు ఉండలేక, తాను అనుకున్నట్టు ఉండాలనే పోరాటం చేస్తూ తన గొంతుని వినిపించాలనుకుంటుంది బుల్‌బుల్‌. తన గొంతుని వినిపిస్తుంది. ఇది విన్న జ్యూరీ కూడా అవార్డు ఇవ్వకుండా ఉండగలదా?


‘బుల్‌ బుల్‌..’ లో ఓ దృశ్యం

66వ జాతీయఅవార్డుల ఎంపికలో ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్‌’ చిత్రానికి నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్‌ సౌండ్‌ డిజైన్, బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌) అవార్డులు వచ్చాయి. కానీ 2019, జనవరి 11న విడుదలైన ఈ చిత్రం 2018 జాతీయ అవార్డులకు ఎలా అర్హత సాధించిందనే ప్రశ్నలు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లాజిక్‌ ఉంది. ఒక ఏడాదిలో జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31వరకు సెంట్రల్‌బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సిబీఎఫ్‌సీ ) చేయించుకున్న సినిమాలను జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా 31, 2018న ‘ఉరి’ సిబీఎఫ్‌సీ వద్ద సర్టిఫికేట్‌ పొందింది. ఆ విధంగా ‘ఉరి’ చిత్రం జాతీయ అవార్డుల రేస్‌లో నిలిచి అవార్డులను సొంతం చేసుకుంది.

– ముసిమి శివాంజనేయులు, డేరంగుల జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement