
మహేష్ బాబు- రామ్ చరణ్ (ఫైల్ ఫొటో)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించటంతోపాటు నటుడిగా కూడా రామ్ చరణ్ స్థాయిని పెంచింది. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సుమారు ఇరవై రోజుల తర్వాత మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్‌లతో రామ్‌చరణ్, మహేష్ బాబులు ఇద్దరు ఖుషీగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ చరణ్, మహేశ్ అభిమానుల మధ్య మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కోల్డ్‌వార్ నడుస్తోంది.
ఈ విషయంపై స్పందించిన రామ్ చరణ్.. తాను, మహేష్ బాబు మంచి స్నేహితులమని తెలిపాడు. తమ మధ్య ఎలాంటి పోటీలేదని, ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందంటూ తాము లెక్కలేసుకోమని ఓ జాతీయ మీడియాతో చెప్పాడు. మహేష్ సినిమాలు విడుదలైన సమయంలోనే.. ఆయనకు పోటీగా తన సినిమాలు విడుదల చేస్తున్నారంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెర్రీ మండిపడ్డాడు. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ఘనవిజయం సాధించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్న మెగా పవర్‌స్టార్.. వ్యక్తిగత విజయాల కన్నా తెలుగు చిత్ర పరిశ్రమ శ్రేయస్సే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా రామ్‌చరణ్ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు.