
కశ్మీర్ ఏ క్షణం ఎలా మారిపోతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితుల్లో కరెక్టుగా సెంటర్‌లో కేఫ్ పెట్టి శ్రేయోభిలాషులకు చెమటలు పట్టిస్తోంది ఈ అమ్మాయి!
అమ్మాయంటే ఇదే చదవాలి.. ఈ ఉద్యోగమే చేయాలి.. ఇలాగే ఉండాలి అన్న మూస ధోరణులు, సంప్రదాయాలు బద్ధలు కొట్టి సమాజంలో తనదైన ప్రత్యేకతను చాటింది మేహ్‌విష్ మెహ్‌రాజ్ జర్గర్. హోటళ్లు, కేఫ్‌ల వంటి బాధ్యతల నిర్వహణ పురుషులకే చేతనవుతుందన్న భావనను పక్కకునెట్టి జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో కేఫ్‌ను ప్రారంభించిన తొలి కశ్మీరీ యువతిగా మేహ్‌విష్ ఘనతను సాధించింది.
మేహ్‌విష్‌కు ఏడేళ్ల వయసులోనే ఆమె తండ్రి కేన్సర్‌తో చనిపోగా, నలుగురు సభ్యుల కుటుంబ భారమంతా ఆమె తల్లిపై పడింది. ఆర్థిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో ఆ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయినా ఆ మాతృమూర్తి తన ముగ్గురు పిల్లలను బాగా చదివించింది. అమ్మ కష్టం, జీవితంలో తనకు ఎదురైన ఘటనలు మేహ్‌విష్‌ను మరింత రాటుదేలేలా చేశాయి. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని డీకొనేందుకు సంసిద్ధంగా ఉండాలనేపాఠాలను అవి ఆమెకు నేర్పాయి. తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా తల్లి అందించిన స్ఫూర్తితో ధృఢచిత్తంతో ముందుకే సాగింది మేహ్‌విష్.
అమ్మాయేంటి! కేఫ్ ఏంటి?!
జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న సంక్షుభిత పరిస్థితులు, కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్యనే న్యాయశాస్త్రంలో పట్టాను సాధించింది మేహ్‌విష్. ఆ తర్వాత తన ఆసక్తిని మార్చుకుని వ్యాపార రంగం వైపు అడుగులు వేసింది. అమ్మాయిలు ఇది చెయ్యకూడదు, అది చెయ్యకూడదు అనే విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదు. స్థిరపడిపోయిన ఏదైనా పద్ధతి, విధానాన్ని ఎవరైనా మహిళ మార్చివేస్తే విమర్శలు రావడం సహజమేనని, వారి మాటలు తన కార్యాచరణపై ఎలాంటి ప్రభావం చూపవని నిరూపించింది. మహిళలకు సరిపడిన పనులే చేయాలంటూ ఫేస్‌బుక్, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల్లో ఆమెపై ‘ట్రోల్స్’తో దాడి మొదలైనా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ‘‘ఓ మహిళ సొంతంగా ఏదైనా చేస్తే సహించలేని కొందరు విమర్శిస్తుంటారు. అలాంటి వాటిని నేను ఏమాత్రం పట్టించుకోను’’ అంటూ ఆమె తన ఆత్మస్థైర్యాన్ని చాటుతోంది. ‘నేను ఎంచుకున్న రంగంలోనే భిన్నంగా ఏమైనా చేయాలని అనుకున్నాను. నా కుటుంబసభ్యులే ఈ విషయంలో మొదట్లో సంశయించినా ఆ తర్వాత పూర్తి మద్దతునిచ్చారు’’ అంటోంది.
కేఫ్ అంటే కేఫ్ కాదు
మహిళలు అనగానే బ్యూటీ పార్లరో, బోటికో, వ్యానిటీ షోరూంల నిర్వహణకు పరిమితమనే జనసాధారణ అభిప్రాయాన్ని కాదని కేఫ్‌ను మొదలుపెట్టింది మేహ్‌విష్. శ్రీనగర్‌లోని మునావరాబాద్ ప్రాంతంలో ఇద్దరు మిత్రులతో కలిసి ‘నేను మరియు మీరు’ ( M్ఛ N ్ఖ) అనే పేరుతో కేఫ్‌ను ప్రారంభించింది. దీనిని తన అభిరుచులకు తగినట్టుగా తీర్చిదిద్దింది. కశ్మీర్‌తో సంస్కృతిని ప్రతిబింబించే చీనార్ చెట్లు, ఇతర చిహ్నాలతో ఇంటీరియర్స్ ఉండేలా శ్రద్ధ వహించి దానిని ట్రెండీ కేఫ్‌గా రూపొందించింది. యువత కోరుకున్న భిన్నరుచుల ఆహారాలు ఇక్కడ దొరుకుతుండడంతో ఆమె ప్రయత్నం హిట్టయింది. అయితే అల్లర్లతో ఎప్పుడూ అట్టుడుకుతుండే కశ్మీర్‌లో ఇలా ఒకమ్మాయి కేఫ్ నడపటం ఎంతవరకు క్షేమం అని మేహ్‌విష్ గురించి తెలిసినవాళ్లు తెలియనివాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు.
రెండో బ్రాంచీకీ రెడీ!
కేఫ్‌కు యువతీయువకులతో పాటు వివిధ వర్గాల నుంచి ఆదరణ పెరగడంతో శ్రీనగర్‌లోనే రెండో బ్రాంచీ ఓపెన్ చేసేందుకు ఇరవై అయిదేళ్ల మేహ్‌విష్ సిద్ధమైపోయింది! ‘స్వప్నాలు సాకారం చేసుకునేందుకు అంకితభావంతో శ్రమిస్తే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే సొంతంగా మనుగడ సాధించేందుకు ఇక్కడి అమ్మాయిలకు శక్తిసామర్థ్యాలున్నాయి. వ్యాపారాల నిర్వహణ అనేది కేవలం అబ్బాయిలకే పరిమితం కాదు, అమ్మాయిలు కూడా సమర్థంగా నిర్వహించగలరు’’ అంటూ మేహ్‌విష్ తన ఈడు వారిలో చైతన్యం రగిలిస్తున్నారు. ఆమె తీసుకుంటున్న చొరవ, కొత్తదనం కోసం ఉవ్విళ్లూరుతున్న తీరు కశ్మీర్‌లో మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. వ్యాపారరంగంలో అవకాశాలు పరిమితంగానే ఉన్నా అక్కడి చదువుకున్న అమ్మాయిలు అడ్డంకులను ఛేదించి ప్రస్తుతం ఆర్ట్ సెలూన్లు, బోటిక్‌లు, టెక్ స్టార్టప్‌లు మొదలుపెట్టడం మరో విశేషం.
– కె. రాహుల్
Comments
Please login to add a commentAdd a comment