రుచుల గొడుగు | Flavored umbrella | Sakshi
Sakshi News home page

రుచుల గొడుగు

Published Fri, Jul 29 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

రుచుల గొడుగు

రుచుల గొడుగు

వానాకాలం వచ్చింది.
నల్ల గొడుగులు విచ్చాయి... తెల్ల గొడుగులు విరిశాయి.
రుచుల గొడుగు కిందకు రండి.
వేడివేడిగా, ఆవురావురుమంటూ మష్రుమ్స్‌ని
ఎంజాయ్ చెయ్యండి.

 
 
మష్రుమ్ సూప్

కావలసినవి: మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క మిరియాల పొడి - పావుటీ స్పూన్  వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్  మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు
 
తయారీ: ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో  వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి.

మష్రుమ్ ఖీర్
కావలసినవి: పుట్ట గొడుగుల తురుము- ఒక కప్పు సోంపు- ఒక టీ స్పూన్; పాలు- అర లీటరు సొంఠి పొడి- అర టీ స్పూన్
 పంచదార లేదా తేనె- తగినంత నెయ్యి- 50గ్రా; డ్రై ఫ్రూట్స్- 100 గ్రా
 
తయారీ: ఒక పెనంలో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ని వేయించి పక్కన పెట్టాలి. అదే పెనంలో పుట్టగొడుగుల తురుము వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి. తర్వాత పాలు పోసి దగ్గరయ్యే వరకు ఉడకనివ్వాలి. తర్వాత సోంపు, శొంఠిపొడి, తేనె వేసి కలపాలి. డ్రైఫూట్స్ వేసి వడ్డించాలి.
 
కబోలి - మష్రుమ్ పులావ్
కావలసినవి: పుట్ట గొడుగులు - 50 గ్రా శనగలు - 50 గ్రా; ఉప్పు - తగినంత కొత్తిమీర - ఒక కట్ట (సన్నగా తరగాలి) పుదీన- ఒక కట్ట (ఆకులు ఒలిచి పెట్టుకోవాలి)  ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు  పచ్చిమిర్చి ముక్కలు- ఒక టీ స్పూన్ (కారానికి తగినంత మార్చుకోవచ్చు)  బియ్యం - 200 గ్రా; దాల్చిన చెక్క - 10 గ్రా అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్ జీలకర్ర- టీ స్పూన్  కరివేపాకు- రెండు రెమ్మలు
 
తయారీ
: బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేగిన తర్వాత దాల్చిన చెక్క, ఉప్పు, పుదీన, కొత్తిమీర , శనగలు, పుట్టగొడుగులు వేసి తగినంత నీటిని పోయాలి. ఈ మిశ్రమం వేడెక్కి ఉడకగం మొదలైన తర్వాత బియ్యం వేసి కలిపి ఉడకనివ్వాలి. బియ్యం ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత మంట తగ్గించి సన్నమంట మీద పూర్తిగా నీరు ఆవిరయ్యే వరకు ఉంచి దించాలి.
 
మష్రుమ్   మిల్క్ షేక్

కావలసినవి: పుట్ట గొడుగులు- 50 గ్రా  పంచదార- ఒక కప్పు; పాలు- అర లీటరు  వెనిలా ఎసెన్స్- రెండు చుక్కలు  ఏలకులు- రెండు; కిస్‌మిస్ - పది బాదం- ఎనిమిది (నాలుగింటిని పొడి చేయాలి, నాలుగింటిని సన్నగా తరగాలి); నెయ్యి- ఒక టీ స్పూన్
 
తయారీ: ఏలకులు, బాదం, పంచదారను కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఆ పొడిని పాలలో వేసి మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. పుట్ట గొడుగులను నేతిలో దోరగా వేయించి చల్లారిన తరవాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఫ్రిజ్‌లో చల్లబడిన పాలలో ఈ మిశ్రమాన్ని, వెనిలా ఎసెన్స్ కలిపి కిస్‌మిస్, తరిగిన బాదం పలుకులు వేసి సర్వ్ చేయాలి.
 
చింత చిగురు పుట్టగొడుగుల వేపుడు 
కావలసినవి: పుట్ట గొడుగులు- 200 గ్రా చింత చిగురు- 100 గ్రా; ధనియాల పొడి- ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి- ఆరు; పసుపు- పావు టీ స్పూన్ ఉప్పు- తగినంత; నూనె- రెండు టేబుల్ స్పూన్లు  ఉల్లిపాయలు- రెండు (తరగాలి)  జీలకర్ర- ఒక టీ స్పూన్  వెల్లుల్లి రేకలు- ఒక టీ స్పూన్

తయారీ: చింతచిగురు, ఉల్లిపాయ ముక్కలు సగం, జీలకర్ర సగం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఒక పెనంలో నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పుట్టగొడుగులు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు చింతచిగురు ముద్ద వేసి బాగా కలిపి కొంచెం మగ్గనిచ్చి దించాలి. వేడివేడిగా వడ్డించాలి. ఇది చపాతీల్లోకి, అన్నం లోకి కూడా బాగుంటుంది.
 
కోనసీమ  మష్రుమ్ వేపుడు

కావలసినవి: పుట్టగొడుగులు- 200 గ్రా ఉల్లిపాయల పేస్టు- కప్పు; ఉప్పు- తగినంత కారం- తగినంత; నూనె- రెండు టేబుల్ స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్ కరివేపాకు- రెండు రెమ్మలు; పసుపు- ఒక టీ స్పూన్ కొత్తిమీర- ఒక కట్ట (తరగాలి)  గరం మసాలా పొడి- అర టీ స్పూన్ ధనియాల పొడి - ఒక టీ స్పూన్
 
తయారీ: పుట్ట గొడుగులను ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పెనంలో నూనె వేసి అందులో అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్టు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మరికొంత సేపు వేగనివ్వాలి. ఇప్పుడు మష్రుమ్ ముక్కలు, గరం మసాలా పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి. దీనికి నీరు పోయాల్సిన అవసరం లేదు. ఆవిరి మీదనే మష్రుమ్ ఉడుకుతుంది. ఇది సూప్‌లోకి స్నాక్‌గా బాగుంటుంది.
 
మునగాకు  మష్రుమ్ ఇగురు

కావలసినవి: పుట్ట గొడుగులు- 200 గ్రా మునగ ఆకు- ఒక కప్పు  ఉల్లిపాయ - ఒకటి (తరగాలి)  ధనియాల పొడి- ఒక టీ స్పూన్ కారం- ఒక టీ స్పూన్; ఉప్పు- తగినంత నూనె- రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు- రెండు రెమ్మలు; కొత్తిమీర- ఒక కట్ట  పచ్చిమిర్చి- నాలుగు (నిలువుగా చీరాలి)
 
తయారీ: మునగ ఆకు, ఉల్లిపాయ, కొత్తిమీరలను కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఒక పెనంలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసిన మిశ్రమాన్ని వేసి కలపాలి. కొంచెం వేగిన తర్వాత పుట్ట గొడుగు ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా నీటిని వేసి బాగా కలిపి ఇగురుగా అయ్యాక దించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement