పట్టణంలోని హరిఓం నగర్‌లో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు
సాక్షి నెట్‌వర్క్: భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్, రామ్‌నగర్ కాలనీలు నీట మునగడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నిర్మల్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 24,035 మంది రైతులకు చెందిన 33,429 ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు దెబ్బతిన్నాయి.7 మండలాల్లోని 16 చెరువుల కట్టలు తెగిపోయాయి.
బోధన్ మండలం సాలూర శివారులోని మంజీర నది పాత వంతెన పైనుంచి ప్రవహించడంతో తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఖమ్మం జిల్లా కేంద్రాన్ని గురువారం అతలాకుతలం చేసిన మున్నేరు వరద శుక్రవారం ఉదయం నుంచి తగ్గుతూ వస్తోంది. గురువారం రాత్రి 10గంటలకు 30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం రాత్రి ఏడు గంటలకు 18.30 అడుగులకు పడిపోయింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మున్నేరును పరిశీలించి సహాయక చర్యలపై అధికారులకు సూచ నలు చేశారు. ఖమ్మంలో మున్నేటి వరద, ముంపు ప్రాంతాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment