వెన్నునొప్పి నివారణ కోసం...
చిన్న పిల్లలుగా ఉన్న సమయంలోనే వెన్నుకు ఏదైనా సమస్య వస్తే అది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ టైమ్‌లో వారికి ఎలాంటి సమస్యా లేకుండా చూడాలి. పిల్లలు స్కూల్ బ్యాగ్‌ను వీపుపై మోస్తున్నప్పుడు అది మరీ కిందికి జారిపోకుండా వీపు పై భాగంలో (అప్పర్ బ్యాక్) ఉంచేలా చూడాలి. స్కూల్ బ్యాగ్ వీపుపై మోసుకెళ్లకుండా చక్రాలపై రోల్ చేసేది ఉంటే మంచిది.
పిల్లలు స్కూల్లోనూ, పెద్దలు పనులు చేసే ప్రదేశంలో ఒంగిపోయినట్లుగా గాక వెన్నును నిటారుగా ఉంచేలా కూర్చోవడం (ఎర్గానమికల్లీ రైట్ పొజిషన్) అలవాటు చేసుకుంటే మంచిది. సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయ్యేలా ఆరుబయట తిరగడంతో పాటు మంచి వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలకు సరైన పాళ్లలో క్యాల్షియమ్ అంది అటు పిల్లల్లోనూ, ఇటు పెద్దల్లోనూ ఎముకలు గట్టిపడతాయి.
బరువు తగ్గించుకోవడంతో వెన్నుపై పడే భారం తగ్గుతుంది. పెద్దవాళ్లు పొగాకు నమలడం, ఆల్కహాల్ తాగడం వంటి దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. కొన్ని మందులు వాడుతున్నప్పుడు ఎముకలపై వాటి ప్రభావాన్ని గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. మందుల బయోకెమికల్ స్వభావం, వాటి హానికరమైన ప్రభావం, రిస్క్ వంటి అంశాలు తెలిసి ఉండే క్వాలిఫైడ్ నిపుణులను సంప్రదించడం మంచిది.