ఈ ఒడిషా మహిళలు తమ అడవులను స్మగ్లర్ల బారి నుంచి 20 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు దశాబ్దాల కిందట తుడిచిపెట్టుకుపోయిన అడవిని కాపాడుకునే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. అడవులు నేలమట్టమైపోయిన నేపథ్యంలో పీర్‌జహానియా వన్ సురఖ్యా సమితి అనే సంస్థను స్థాపించి, అడవులను కాపాడుకుంటున్నారు.
ఒడిషా, బీహార్‌ప్రాంతాలను తరచు తుఫాను భయం వెంటాడుతూనే ఉంటుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన తుఫాను అడవులను నిర్వీర్యం చేసేసింది. వరదలు కొన్ని చెట్లను లాగేసుకుంటే, అడవి దొంగలు మిగిలిన చెట్లను కొట్టేస్తున్నారు. ‘‘దొంగలు వచ్చినట్లు అనుమానం రాగానే మేము మా కర్రలతో గట్టిగా నేల మీద కొడతాం, పదిమందిమి కలిసి ఒకేసారి ఈలలు వేస్తాం’ అంటారు 52 సంవత్సరాల చారులత బిశ్వాల్. వారంతా వంతులవారీగా అడవిలో తిరుగుతూ కాపలా కాస్తుంటారు. ‘‘అడవులను నరకడానికి ఎవరైనా వస్తే, మా ఈలల శబ్దాలు, మా కర్రల చప్పుళ్లు విని పారిపోతున్నారు’’ అంటారు పీర్ జహానియా వన్ సురఖ్యా సమితికి సెక్రటరీగా పనిచేస్తున్న బిశ్వాల్.
2012లో ఈ సంస్థ వారు అవార్డులు అందుకున్నారు. వారి గ్రామాన్ని కాపాడుకోవడంలో వారు చూపిన బాధ్యతను గుర్తించి ఈ అవార్డులు అందించారు. అడ్డదిడ్డంగా విస్తరించిన సరుగుడు చెట్ల కొమ్మలను నరికేసి, తక్కువ పరిధిలో విస్తరించే జీడిచెట్లను నాటుతున్నారు వీరు. ‘‘తీరంలో ఉన్న మా ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. చేతికి అందివచ్చిన పంటలు కూడా తుడిచిపెట్టుకు పోయాయి. భూములన్నీ నిస్సారమైపోయాయి. కొన్నిరోజుల పాటు తిండి లేకుండా గడపాల్సి వచ్చింది. అడవులు లేకపోవడం వల్లే ఇంత జరిగిందని అర్థమైంది. అలాగే ఇళ్ల దగ్గర కూడా చెట్లు లేకపోవడం కూడా కారణమేనని తెలిసింది. అందుకే మేమంతా అడవులను కాపాడుతామని ప్రమాణం చేశాం’’ అంటారు బిశ్వాల్..
2001లో 70 మంది మహిళలు ఒక్క మాటగా నిలిచారు. అడవులను మేమే రక్షించుకుంటాం అని స్త్రీశక్తిని బలంగా చాటారు. ఒక్కో ఇంటి నుంచి కనీసంగా ఒకరు ముందుకు వచ్చారు. 75 హెక్టార్ల అడవిని తమ సొంత బిడ్డగా భావించుకోవడం మొదలుపెట్టారు. దేవీ నదికి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో మొత్తం 103 గృహాలు ఉన్నాయి. ఇంట్లోని మగవారంతా జీవనం కోసం సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్తుంటారు. అందుకే మహిళలు ఈ బాధ్యతను తీసుకున్నారని చెబుతారు బెహరా. రెండు రోజులకి ఒకరు చొప్పున బాధ్యతలను సమానంగా పంచుకుంటున్నారు. ఉదయం 7.30 గంటలకు వెళ్లి, మళ్లీ మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, భోజనం చేసి, ఇంటిని చక్కదిద్దుకుని, మళ్లీ సాయంత్రం విజిల్స్ పుచ్చుకుని వెళ్లి, చీకటి పడుతుండగా ఇంటికి వస్తారు. అడవిలోకి వెళ్లడానికి మీరు భయపడరా అని ప్రశ్నిస్తే, ‘మాకెందుకు భయం, అడవి అంటే మా ఇల్లే కదా, అడవి మీద మాకు హక్కులు లేకపోయినా, దాన్ని రక్షించడం మా విధి’ అని చెబుతారు బిశ్వాల్. ప్రతి చెట్టును వీరు తమ బిడ్డగా భావిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకుంటారు. బిడ్డకు ఏదైనా జరిగితే తల్లి ఎంత బాధపడుతుందో, ఈ చెట్లకి ఏం జరిగినా వీరంతా అలాగే బాధపడతారు. ఇవి వారి జీవితంలో భాగంగా మారిపోయాయి. ఇప్పుడు వారి గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. స్వచ్ఛమైన తాగునీరు దొరుకుతోంది. ఉప్పు నీటిని నిరోధించే మొక్కలను పెంచటమే ఇందుకు కారణం. పొలాలు కూడా వరదలు, ఈదురు గాలుల బారిన పడకుండా ఏపుగా పెరుగుతున్నాయి.
చెట్లను రక్షించారు
Published Wed, Mar 27 2019 12:48 AM | Last Updated on Wed, Mar 27 2019 12:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment