ప్రేమ పుస్తకంలో ఇంకా చాలా పేజీలు ఉంటాయి ఫ్రెండ్స్! | Friends you know still a lot of pages in the book of love | Sakshi
Sakshi News home page

ప్రేమ పుస్తకంలో ఇంకా చాలా పేజీలు ఉంటాయి ఫ్రెండ్స్!

Published Mon, Apr 27 2015 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

ప్రేమ పుస్తకంలో  ఇంకా చాలా పేజీలు  ఉంటాయి ఫ్రెండ్స్!

ప్రేమ పుస్తకంలో ఇంకా చాలా పేజీలు ఉంటాయి ఫ్రెండ్స్!

కోపం చేతల్లో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి.
ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లోనూ, మనస్సులోనూ ఉండాలి.

 
ప్రేమ విషయంలో తనకు పోటీని, తనను మించిన వ్యక్తిని భరించలేకపోవడం మనిషి స్వభావం. తను ఆరాధిస్తున్న అమ్మాయి అలసత్వం, లేదా ఆ అమ్మాయి దూరమవడం అబ్బాయిని ఉద్రేకపరుస్తుంది. చూస్తూనే ఉన్నాం.  ఈ మధ్య కాలంలో ప్రేమ విఫలమై, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కొందరు ప్రియురాలి మీద ఎదురుదాడికి దిగుతున్నారు. కూకట్‌పల్లి ఘటన, జర్మన్ పెలైట్ ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణలు.

లోపం అబ్బాయిలదా? అమ్మాయిలదా? అనడం కంటే ప్రేమించిన తరువాత విడిపోయాక ఒకరు మరిచిపోవడం, ఇంకొకరు మరిచిపోలేక సతమతమైపోవడమే కారణం అని చెప్పాలి. ప్రేమ సహజం. ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడితే అన్నీ సవ్యంగా ఉంటేనే పెళ్లి దాకా వెళ్తుంది. లేకుంటే చాలా కేసులలో విడిపోవడమే జరుగుతుంది. కాని అప్పుడు అమ్మాయిలు చాలా మానసికంగా కుంగిపోయినా తట్టుకోగలుగుతున్నారు. కారణం వారిలో ఉండే హార్మోన్ల సమతుల్యత వల్ల వాళ్లు ఎలాగోలా కొద్దికాలంలోనే జీవితంలో రాజీపడగలుగుతున్నారు. కాని అబ్బాయిలు కసి, ఆవేశం తట్టుకోలేక తెగబడుతున్నారు. కారణం వారికి ఆ అమ్మాయి మీద ప్రేమ ఎక్కువగా ఉండి, తన నుండి ఆమె విడివడిపోయాక అంతకంటే అందమైన లేక ఎక్కువ క్వాలిటీస్ ఉండే అమ్మాయి తనకు దొరకదనే భయం ఆవేశానికి ఉసిగొల్పుతోంది. దాంతో ఆమె తన సొంతం కావాలనే ఆత్రుత, ఉక్రోషం పట్టలేక క్షణిక ఆవేశంలో తెగబడుతున్నారు.


ఇలాంటి వ్యక్తులు తమ ఆలోచనా సరళి సరిగ్గానే ఉందో లేదో అనలైజ్ చేసుకోవాలి. అస్సలు తమ మనస్సుకు ఏమనిపిస్తుందో ఫ్రెండ్స్‌తో వెలిబుచ్చి, వారి సలహా తీసుకోవాలి. ఒకవేళ అలా తమ భావాలు వ్యక్తీకరించడానికి స్నేహితులే దొరకకపోతే తప్పక కౌన్సెలింగ్‌కు వెళ్లి తీరాలి. డాక్టర్‌ను కలవడం నామోషిగా ఫీలై తమలో తాము కుమిలిపోయి నాలుగు గోడలమధ్య కొంత కాలం చీకటిలో గడిపి కసి, ఆవేశం, పంతం పెంచుకుని తమ ఆలోచనలే కరెక్టు అని అమ్మాయిల మీద పడి నరకడం ఉన్మాదమే. ఇలాంటి ఉన్మాదకర ఆలోచనలు ఎందరి జీవితాలనో విషాదంలో ముంచుతాయి. నేను చూసిన మా తోటి న్యూస్ రీడర్ లక్ష్మీ సుజాత జీవితం ఇప్పటికీ మేం మరిచిపోలేం. తనతో ఏమాత్రం పోటీకి రాలేని; అందం, ఉద్యోగం ఏమీ ఉన్నతంగా లేని మేకప్‌బాయ్‌కి  గౌరవం ఇవ్వడమే ఆమె చేసిన తప్పు. హైదరాబాద్‌కు కొత్తగా వచ్చి అప్పుడే కొత్తగా స్టూడియోలో చేరి టీవీ తెరపై తనను తాను ఇంకా ఎలా షైన్ చేసుకోవాలా అని మా అందరి దగ్గర కూర్చుని మెళకువలు నేర్చుకుంటూ ఎంతో వినయంగా ఉండే ఆ అమ్మాయి... పైపైకి ఎదుగుతూ పోవడం చూసి మేము చాలా చాలా ఆశ్చర్యపోయేవాళ్లం. అలాంటి అమ్మాయి తనను నెగ్లెక్ట్ చేస్తూ మిగతా అందరితో చనువుగా ఉంటోందని, ఏమాత్రం తనను పట్టించుకోవడం లేదనే కసితో ఎంతో నెమ్మదిగా, నింపాదిగా ఉండే మేకప్‌బాయ్, విజయవాడ హోటల్‌లో విచక్షణారహితంగా చంపేశాడు. ఇది మేం చాలా సంవత్సరాలు మరిచిపోలేకపోయాం. ఇద్దరిలో ఎవరిది తప్పు? మొదట్లో పరిచయం అయిన వ్యక్తితోనే జీవితాంతం సర్దుకుపోవాలని ఎవరు శాసించారు? ఎదుగుతున్న దశలో టీవీ ఫీల్డ్ లేదా సినిమా రంగం లేదా ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఎవరైనా సరే, ఇక్కడ అమ్మాయిలను అబ్బాయిలు త్వరగా పరిచయం చేసుకుంటారు. అదే అబ్బాయిలను పనికట్టుకుని పరిచయం చేసుకునే అమ్మాయిలు తక్కువే. ఆ తర్వాత అంతటితో పరిచయం ఆగిపోతే ఫర్లేదు. అంతకంటే ఉన్నతమైన భావాలు, ఆశయాలు, విద్య, ఉద్యోగం ఉండే అబ్బాయిలు పరిచయం అయితే, సహజంగానే ప్రశాంతత కోరుకోవడం ‘అలజడి లేని జీవితం కోరుకోవడం’ అమ్మాయిల తప్పు అని ఏ సమాజమూ నిర్ణయించకూడదు.

అలా అని నేను అబ్బాయిలను తప్పుబట్టడం లేదు ఇక్కడ. మీకు ఏ అమ్మాయి అయినా గుడ్‌బై చెబితే, కొంచెం రోజులు బాధపడినా త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నించండి అంటాను. ఎందుకు మిమ్మల్ని మీరు మార్చుకోలేరు? స్థలం, ఉద్యోగం, ప్రదేశం మార్చివేయండి. మీ ప్రస్తుత జీవన గతి కంటే ఉన్నతంగా చేరుకోవాలని కసి పెంచుకోండి. ఆ అమ్మాయి మీద కసి మీ జీవితాన్ని బాగుచేసుకోవడానికి ఉపయోగించుకోండి. అంతకంటే అందమైన మంచి అమ్మాయి మిమ్మల్ని మీ జీవితాన్ని ఇష్టపడుతుందనే ఊహతో, ఆశతో మీ గమ్యం మార్చుకోండి. తప్పొప్పుల్ని ఆలోచించకండి. మీ ఆవేశం, ఆక్రోశం, ఆవేదన మీ జీవనగమనాన్ని మార్చాలి. మీ జీవితం చూసి ఆ అమ్మాయే గర్వించేలా, ఇంకా చెప్పాలంటే (నవ్వుతూ చెప్తున్నా) ఈర్ష్యపడేలా మిమ్మల్ని మీరు మలచుకోండి.

ప్రేమలు, ప్రేమ విఫలమవడం ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక వయస్సులో జరుగుతాయి. ఇవన్నీ కొన్ని పేజీలు మాత్రమే. మీకు ఇంకా పుస్తకంలో చాలా పేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్! ఆ పుస్తకం ఇంట్రస్టింగ్‌గా, కలర్‌ఫుల్‌గా మార్చుకోండి.  ప్రేమించి విడిపోవాల్సి వస్తే పరస్పరం, గౌరవం, అవగాహనతో విడిపోండి, స్నేహితులుగా మిగిలిపోండి. అంతేగాని మీకు దక్కనిది మరెవరికీ దక్కకూడదు అని తెగనరక్కండి. అది దుర్మార్గం... ఆలోచించండి.
 
 కోట విజయలక్ష్మి
 (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)
 సీనియర్ న్యూస్ రీడర్, జెమినీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement