గాయత్రీ ఇస్కార్ కుమార్, కొత్త హై కమిషనర్
ఫైళ్లు విసిరి కొడితే టేబుల్ క్లీన్ అవుతుంది. అదా చక్కబెట్టడం?! ఎక్కడివక్కడే ఓపిగ్గా సర్దుకుంటూ రావాలి. దౌత్య సంబంధాలు కూడా అంతే. పేపరు, స్టాప్లరు కలిసినట్లు ఉండాలి. మంచి స్మైల్.. మంచి ఇంగ్లిష్, మంచి నాలెజ్డ్ ఈ మూడూ ఉన్న గాయత్రి.. బ్రిటన్‌లో ఇప్పుడు మన కొత్త హై కమిషనర్. రెండు జెండాలపై ఫోకస్ అయ్యే టేబుల్ ల్యాంప్. (వెనక్కి తగ్గిన చైనా)
బ్రిటన్‌కు కొత్తగా ఏ దేశపు హైకమిషనరైనా పదవీ బాధ్యతలు చేపట్టడానికి వస్తే వారిని లండన్ నుంచి రెండు గుర్రపు బగ్గీలు అక్కడికి ఐదు నిముషాల సమీపంలో ఉండే బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు తోడ్కొని వెళతాయి. మొదటి బగ్గీలో ఆ హై కమిషనర్ ఉంటారు. వెనుక బగ్గీలో అంగరక్షకులు ఉంటారు. క్వీన్ ఎలిజబెత్‌కు పరిచయ పత్రాన్ని సమర్పించగానే హై కమిషనర్ నియామకం అధికారికం అవుతుంది. అయితే రాణిగారు ఇలా సంతకం పెడితే అలా అయిపోయే కార్యక్రమం కాదది. చాలా ఘనంగా జరుగుతుంది. ఇంచుమించు ఒక పట్టాభిషేకంలా!!
గాయత్రీ ఇస్సార్ కుమార్ గత నెల 23న భారత హై కమిషనర్‌గా లండన్‌లో దిగేనాటికి క్వీన్ ఎలిజబెత్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో లేరు. మార్చినెల మూడవ వారంలోనే ఆమె తమ విండ్సర్ క్యాజిల్‌లో క్వారెంటైన్‌కి వెళ్లిపోయారు. లండన్‌కు ముప్పై కి.మీ. దూరంలోని ఆ కోట ఎలిజబెత్ రాణిగారి పూర్వీకుల ప్రాచీన నివాస కట్టడం. తిరిగి ఆమె బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని తన పాలనా భవనంలోకి వచ్చాకే గాయత్రిని ఆమె కలవడం ఉంటుంది. అయితే ఈ అంతరాయమేమీ గాయత్రి విధులకు ఆటంకం అయ్యేది కాదు. ఆమెకు స్వాగత సత్కారాలు మాత్రమే కాస్త ఆలస్యం అవుతాయి. కరోనా తగ్గుముఖం పట్టడానికి ఎన్నాళ్లు పడితే అన్నాళ్ల ఆలస్యం! శనివారం నుంచి పూర్తిస్థాయిలో గాయత్రి దౌత్య కార్యాలు మొదలయ్యాయి. లండన్‌లోని ఇండియా హౌస్‌లో ఆమె ఆఫీసు. ఇక్కడికి రావడానికి ముందు బెల్జియంకు, ఐరోపా సమాఖ్య కు, లక్సెంబర్గ్‌కు భారత హై కమిషనర్‌గా పని చేశారు గాయత్రి. ఇక్కడున్న హై కమిషనర్ రుచీ ఘనశ్యామ్ ఈ ఏడాది మే నెలలో పదవీ విరమణ పొందారు.
గాయత్రి ఇస్సార్ 1986 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారి. బ్రిటన్‌కు మూడవ మహిళా హై కమిషనర్. తొలి హై కమిషనర్ విజయలక్ష్మీ పండిట్ (1954–1961). రెండవ మహిళ రుచీ ఘనశ్యామ్ (2018–2020). లండన్ వచ్చిన ఈ రెండు వారాల్లోనే గాయత్రి బ్రిటన్‌లోని ముఖ్యులతో ‘వర్చువల్’గా సమావేశం అయ్యారు. ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్ (ఎఫ్.సి.వో) మంత్రి తరీఖ్ అహ్మద్, ఎఫ్.సి.వో. పొలిటికల్ డైరెక్టర్ రిచర్డ్ మూర్, భారతీయ పారిశ్రామికవేత్తలు స్వరాజ్ పాల్, రాజ్ లూంబాలతో ఫలవంతమైన చర్చలు జరిపారు. హై కమిషనర్ పదవులలోకి వచ్చే ముందువరకు ఆమె న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖలో అనే విభాగాలలో పని చేశారు. విదేశాలతో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతి సంబంధాలకు చక్కటి అనుసంధానకర్తగా ఉన్నారు.
గాయత్రి పంజాబీ సంతతి అమ్మాయి. పుట్టింది బెంగళూరులో. అక్కడే సోఫియా హైస్కూల్‌లో, బెంగళూరు యూనివర్సిటీలో చదివారు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్ ఆమె సబ్జెక్టులు. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, పంజాబీ భాషల్లో అనర్గ ళంగా మాట్లాడేయగలరు. జర్మన్, పోర్చుగీస్, నేపాలీ, ఫ్రెంచ్ భాషల్లో వర్కింగ్ నాలెడ్జి ఉంది. బ్రిటన్‌లో ప్రస్తుత బోరిస్ జాన్సన్ ప్రభుత్వం.. ఎప్పటికి పోతుందో తెలియని కరోనా మీద, డిసెంబర్ 31లోపు పూర్తి చేయవలసిన ‘బ్రెగ్జిట్’ విధానాల మీద దృష్టి ఉంచింది. ఈ రెండు అంశాలపై బ్రిటన్‌కు భారత్ చూపించవలసిన తోవలో గాయత్రి కచ్చితంగా ఒక ద్వైపాక్షిక దారి దీపమే. రాణిగారు విండ్సర్ క్యాజిల్ నుంచి వచ్చాక బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 170 మంది అంబాసిడర్‌లు, హై కమిషనర్‌ల సమక్షంలో ఈ దీపానికి అధికారిక ప్రజ్వలన జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment