పైసా పైసా పోగుచేసి..! పెళ్లిలో జోరుచేసి..!
పొదుపు
పెళ్లి ఖరీదు బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లలో ఆడవాళ్ల ఖర్చులు హద్దులు దాటిపోవడం వల్ల తర్వాత రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తోటివారితో పోల్చుకుంటూ పెళ్లిలో ఆడవాళ్లు చేస్తున్న అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. దీనికోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
చాలామంది పెళ్లయిపోయాక కూర్చుని లెక్కలు వేసుకుంటారు. ‘అయ్యో...అనవసరంగా దానికి ఖర్చుపెట్టాం, దీనికి ఖర్చుపెట్టాం...’ అంటూ తలపట్టుకుంటారు. అలాకాకుండా పెళ్లికి ముందే..ముఖ్యమైన ఖర్చులు ఆడంబరంకోసం చేసే ఖర్చులు ఏమిటన్నది విడిగా రాసుకోవాలి. ఆపైన చేతిలో ఉన్న డబ్బుని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టుకుంటే మంచిది.
పెళ్లి సమయంలో ఖర్చుకు కళ్లెం వేయకపోతే అమ్మాయి తల్లిగా ఆ తర్వాత మీ చేతిలో చిల్లిగవ్వ మిగిలే పరిస్థితి ఉండకపోవచ్చు. పెళ్లి తర్వాత కూడా అమ్మాయిలకు పెట్టాల్సిన ఖర్చులు చాలా ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కొన్ని సందర్భాల్లో కుదరదు. కాబట్టి పెళ్లిలో అనవసరమైన హంగామాల జోలికెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఈ మధ్యకాలంలో మెహందీ ఫంక్షన్ అని నాలుగైదు రోజులు వచ్చిన బంధువులందరికీ గోరింటాకు పెట్టిస్తున్నారు. దీనికి పార్లర్‌వాళ్లు వేల రూపాయల్లో వసూలు చార్జ్ చేస్తున్నారు.
ఈ కాలం అమ్మాయిలు చాలావరకూ ఉద్యోగినులే ఉంటున్నారు. చీరలు కట్టడం చాలావరకూ తగ్గించేస్తున్నారు. సౌకర్యాన్ని బట్టి చాలావరకూ చుడీదార్ల వంటినే ఇష్టపడుతున్నారు. పెళ్లి తర్వాత చీరలు పెద్దగా వాడరని తెలిసి కూడా గొప్ప కోసం పెళ్లికూతురుకి వంద చీరలు, రెండు వందల చీరలు అంటూ కొనేస్తున్నారు. దీని బదులు అమ్మాయికి నగదు ఇస్తే మరో ముఖ్యమైన ఖర్చుకి ఉపయోగపడుతుంది. అలాగే ఆభరణాలు కూడా హడావిడిగా కొనేయడం, ఆ తర్వాత డిజైన్ నచ్చలేదని, అవుట్‌డేటెడ్ అని మళ్లీ మార్చేస్తుంటారు. దీనివల్ల కూడా వేల రూపాయలు వృథా.
- సుజాత బుర్లా, ఇన్వెస్టర్ అండ్ ఫండ్ మ్యానేజర్