జెంటిల్‌మెన్ కౌన్సెలింగ్
మూత్రం బాగానే వస్తోంది..మరి నీళ్లెందుకు తక్కువగా తాగాలి?
నా వయసు 52. నాకు పదేళ్లుగా షుగర్, బీపీ ఉన్నాయి. ఈమధ్య కాలంలో కొంచెం నీరసంగా ఉండటం, కాళ్ల వాపు రావడం, మెట్లు ఎక్కితే ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ రక్తపరీక్షలు చేయించారు. ‘రక్తం తక్కువగా ఉంది. కిడ్నీ పనితీరు కూడా కొంచెం మందగించింది’ అని, మందులు రాశారు. అంతేకాకుండా నేను నీళ్లు చాలా తక్కువగా తాగాలట. నీరు ఎంత తాగితే అంతమంచిది అంటారు కదా. మరి నేనెందుకు తక్కువగా నీళ్లు తాగాలి? నాకు మాత్రం మూత్రం బాగానే వస్తోంది. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలను వివరించండి. కిడ్నీ ఫెయిల్యూర్ మందులతో నయమవుతుందా లేదా అన్న విషయం కూడా చెప్పగలరు.
- బంగారయ్య, ఏలూరు
మనలోని చాలామందిలో 50 ఏళ్లు పైబడ్డాక షుగర్, బీపీ సమస్యలు చాలా తరచుగా చూస్తుంటాం. ఇలా షుగర్, బీపీ సమస్యతో పదేళ్లకు పైగా బాధపడుతున్న చాలామందిలో కిడ్నీ పనితీరు కొంచెం తగ్గుతుంది. దీన్ని మొదటిదశలోనే మూత్రంలో ప్రోటీన్స్ ఎక్కువగా పోవడం ద్వారా, క్రియాటినిన్, బ్లడ్ యూరియా వంటి పరీక్షల ద్వారా కనుగొనవచ్చు. ఒకవేళ ప్రోటీన్లు ఎక్కువగా పోతూ, మూత్రంలో క్రియాటినిన్ పాళ్లు పెరుగుతుంటే ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం, మాంసకృత్తులు తీసుకోడాన్ని నియంత్రించడం, నూనె పదార్థాలు తగ్గించడం వంటి మార్పులు చేసుకోవాలి. ఇక రోజూ తీసుకునే నీటి విషయానికి వస్తే కిడ్నీలు బాగా దెబ్బతిన్న వాళ్లకు మాత్రమే ఒక రోజులో ఎంత మూత్రం వస్తుందో చూసుకుని, అంతకంటే అర లీటర్ మాత్రమే ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఇలా ఎందుకంటే కిడ్నీ వడగట్ట గలిగే సామర్థ్యం కంటే ఎక్కువ నీళ్లను రోగి తాగితే... కిడ్నీ ఆ నీళ్లను సమర్థంగా బయటకు పంపలేదు. దాంతో ఆ నీళ్లు శరీరంలోకి ప్రవేశించి ముఖం వాపు, కాళ్ల వాపు రావచ్చు. ఊపిరితిత్తుల్లోకి నీళ్లు ప్రవేశించి ఆయాసం కూడా రావచ్చు. అప్పుడు తక్షణం కిడ్నీ నిపుణులను కలిసి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. మొదటిదశలోనే గుర్తించి మూత్రపిండాల నిపుణుడిని కలవడం వల్ల కిడ్నీ పూర్తిగా వైఫల్యం చెందకుండా (కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయకుండా) చాలావరకు కాపాడుకోవచ్చు.