బైక్ నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుందా? | Get bikers Back Pain? | Sakshi
Sakshi News home page

బైక్ నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుందా?

Published Thu, Sep 10 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

Get bikers Back Pain?

నా వయసు 29 ఏళ్లు. బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నాకు నడుం నొప్పి ఎక్కువవుతోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - సురేశ్, హైదరాబాద్

ఈ వయసులో నడుం నొప్పి అంత సాధారణం కాదు. బైక్ నడపడంలో మీరు అనుసరిస్తున్న అవాంఛనీయ అంశాల వల్లనే ఈ నొప్పి వస్తుండవచ్చు. మీ సమస్య దూరం కావడానికి ఈ సూచనలు పాటించండి.  బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.  మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయిపోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు.  బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.  బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి.  
 మీ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోండి. మీ నొప్పి దూరం కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించండి.
 
 
నా వయసు 50 ఏళ్లు. గత పన్నెండేళ్లుగా షుగర్ ఉంది. నా రక్తపరీక్షలో క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్, యూరియా 28 ఎంజీ/డీఎల్, ప్రోటీన్ మూడు ప్లస్ ఉన్నాయని చెప్పారు. నాకు షుగర్ వల్ల సమస్య వస్తోందా? నాకు తగిన సలహా ఇవ్వండి.
 - రవికుమార్, నిడదవోలు

మీ రిపోర్డులను బట్టి మీకు మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతోంది. ఇది షుగర్ వ్యాధి వల్ల వచ్చిన కిడ్నీ సమస్యా (డయాబెటిక్ నెఫ్రోపతి) లేక మరోదైనా సమస్యా అని తెలుసుకోవాలి. మీరు కంటి డాక్టర్ దగ్గకు వెళ్లి రెటీనా పరీక్ష కూడా చేయించుకోవాలి. మూత్రంలో యూరియా ఎక్కువగా పోవడం కూడా షుగర్ వల్లనే అయి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. తినకముందు బ్లడ్ షుగర్ 100 ఎంజీ/డీఎల్, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా నియంత్రించుకోవాలి. బీపీ 125/75 ఎమ్‌ఎమ్‌హెచ్‌జీ ఉండేలా చూసుకోవాలి. మూత్రంలో ప్రోటీన్ పోవడం తగ్గించడం కోసం ఏసీఈ, ఏఆర్‌బీ అనే మందులు వాడాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు 150 ఎంజీ/డీఎల్ లోపలే ఉండేలా జాగ్రత్తపడాలి. ఇవే కాకుండా ఉప్పు బాగా తగ్గించాలి. రోజుకు రెండు గ్రాముల కంటే తక్కువే తీసుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. డాక్టర్ సూచించకుండా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు.
 
 మా అబ్బాయి వయసు ఐదేళ్లు. పొద్దున్నే లేచాక వాడి కళ్లు; కాళ్లు వాచినట్లుగా కనిపిస్తున్నాయి. మావాడి సమస్య ఏమిటి? - సుకుమార్, కందుకూరు
 మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ బాబు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదట ఈ వ్యాధి నిర్ధారణ జరగాలి. ఒకసారి ‘24గంటల్లో పోతున్న ప్రోటీన్‌ల పరీక్ష’, సీరమ్ ఆల్బుమిన్, కొలెస్టరాల్ పరీక్షలు చేయించాలి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఏమీ లేనప్పుడే ఆ మందులు వాడాలి.  మీ బాబుకు ఆహారంలో ఉప్పు, కొవ్వుపదార్థాలు బాగా తగ్గించాలి. పూర్తికాలం మందులు వాడితే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ.
 
నా వయసు 18. బైక్ మీద కాలేజీకి వెళ్తాను. మొత్తం ప్రయాణించేది ఐదున్నర కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇలా ఆరుబయటకు వెళ్లినప్పుడల్లా నా ముఖం, మెడ, భుజాల మీద నల్లమచ్చలు వస్తున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
 - హారిక, హైదరాబాద్


మీకు కనిపిస్తున్న నల్లమచ్చలను పిగ్మెంటేషన్‌గా పేర్కొనవచ్చు. ప్రతిరోజూ మీరు బైక్‌పై ప్రయాణం చేయడం వల్ల ఆరుబయటి వాతావరణానికి ఎక్స్‌పోజ్ అయ్యే వ్యవధి తక్కువే అయినా దాని ప్రభావం మీకు కొంచెం ప్రమాదకరంగానే పరిణమిస్తోంది. ట్రాఫిక్‌లోని కాలుష్యం, ఎండవేడిమి వంటి అంశాలు మీ చర్మానికి చేటు తెస్తున్నాయి. మీరు ఈ సూచనలు పాటించండి.

ఎండలో వెళ్లినప్పుడు మూడుగంటలకొకసారి ఎస్‌పీఎఫ్ 40 కంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను దుస్తులు కప్పని శరీర భాగాలపై రాసుకోండి   మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరచుకోండి  మచ్చలున్న చోట రాత్రి స్కిన్ లెటైనింగ్ క్రీమ్‌ను రాసుకోండి. కంటి చుట్టూ నల్లమచ్చలుంటే 15 శాతం విటమిన్ సి ఉండే సీరమ్‌ను రాయండి  మిగతా చర్మానికి కోజిక్ యాసిడ్, విటమిన్ సి, లికోరిస్, టెట్రాహైడ్రోకర్క్యుమిన్   కాంబినేషన్‌తో ఉండే క్రీమ్‌ను రాత్రివేళల్లో రాసుకోండి  క్యారట్, బీట్‌రూట్, తాజాపండ్లు, మొలకెత్తిన గింజలు, ముదురు రంగులో ఉండే కాయగూరలు, ఆకుకూరల వంటి మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోండి   20 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. అప్పటికీ తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను కలవండి.
 
నా వయసు 21. మొదట్లో నా వెంట్రుకలు మృదువు (సాఫ్ట్)గానే ఉండేవి. కానీ గత ఆర్నెల్లుగా అవి బిరుసెక్కిపోయినట్లుగా ఉంటూ తేలిగ్గా చిక్కుబడిపోతున్నాయి. చాలా రకాల నూనెలు వాడినా ప్రయోజనం లేదు. నాకు తగిన సలహా చెప్పండి.
 - సిరి, ఒంగోలు


బహుశా మీరు ఉప్పు నీటిని (హార్డ్‌వాటర్‌ని) తలస్నానానికి వాడుతున్నట్లున్నారు. తలస్నానానికి మంచినీళ్లు వాడండి. జుట్టులో ఉండే ప్రోటీన్ పేరు కెరాటిన్. ప్రోటీన్లు పుష్టికరంగా ఉండే ఆహారం తీసుకుంటే, ఈ ప్రోటీన్ కూడా అంది, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టు చిక్కుబడకుండా ఉండేందుకు ఈ సూచనలు పాటించండి.  మీ ఐరన్, విటమిన్ బి12, విటమిన్ డి పాళ్లను పరీక్షించుకోండి. వాటి లోపం ఉంటే వెంటనే నివారించుకోవాలి.  తలకు మరీ ఎక్కువ నూనె రాయవద్దు. దీనివల్ల చుండ్రు రావచ్చు.  తలస్నానం చేశాక. కాస్త తడిగా ఉండగానే జుట్టుకు లివాన్ కండిషనర్ రాసి అలా వదిలేయండి. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా మార్పు కనిపించకపోతే, ఒకసారి డర్మటాలజిస్ట్‌ను కలవండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement