పిల్లలను ఎండలోకి వెళ్లద్దంటే కోపంతో ముఖం ఎర్రటి పుచ్చకాయలా మారిపోదూ. మరి పిల్లలతో వేగటం ఎలా! అసలు వేగటం అనే మాట అనొచ్చా! ఆ పిల్లలే ఆడకపోతే వేసవిలో సందడి నిండుకోదూ?!
మండుతున్న ఎండలు, వేడి వడగాడ్పులు, ఎర్రటి పిప్పర్‌మెంటులా తళతళలాడిపోతున్న సూర్యుడు, ఒళ్లంతా నిరంతర స్నానం, చంటిపిల్లల పాల సీసాలాగ.. పెద్దవాళ్ల నోటికి బాటిళ్లు, మరచెంబులు, మట్టి కుండలు... అన్నీ వేసవి అందానికి పరిమళాలు అద్దుతున్నట్లుగా గోచరిస్తాయి. పరిమళం అనడం ఎంతవరకు సమంజసం. సమంజసం, అసమంజసం అని ఆలోచిస్తూ, తర్కించే లోపుగా ఎండలు వెళ్లిపోతాయి గానీ, పరిమళం అనడమే సరైన పదం. ఇది ఎలాగంటారా.. మనసును పరిమళింపచేసి, తనువును పులకరింపచేసే మల్లెలు, విరజాజులు, సన్నజాజులు, సంపెంగలు.. అబ్బో ఆ పేర్లు అనుకుంటుంటేనే సుగంధాలు మన శరీరాలను తాకుతున్నట్లుగా అనిపించట్లేదా! ఒక్క రవ్వ ఎండ వేడిమి తగ్గితే, వేసవిని మించిన అందమైన కాలం ఉండదు అంటారు కవులు. అలా అంటూనే వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి గంధలేపనాన్ని ఉపయోగించమని, మల్లెలతో తడిసిన నీటితో స్నానం చేయమని కవితాత్మకంగా సందేశాలిస్తున్నారు. ఇదంతా ఒక విషయం. అసలు ఈ విషయం గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనమే ఆవంత కూడా కలగదు కదా! మరి ఇంకేం మాట్లాడుకోవాలనుకుంటున్నారా! మన ఆటలు... మన బాల్యం... మనం అమ్మమ్మ ఇంట్లో ఎలా గడిపాం.. ఇలాంటివి మాట్లాడుకుంటే మనసుకి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండదా మరి. పిల్లలను ఎండలోకి వెళ్లద్దంటే కోపంతో ముఖం ఎర్రటి పుచ్చకాయలా మారిపోదూ. మరి పిల్లలతో వేగటం ఎలా! అసలు వేగటం అనే మాట అనొచ్చా! ఆ పిల్లలే ఆడకపోతే ఇంటికి నిండుదనమేదీ! పిల్లలు పెద్దవారైపోతే కాలక్షేపం మాట అటుంచితే, ఇంట్లో సందడి నిండుకోదూ!
ఇంట్లో పిల్లల్ని ముళ్లపూడి వారి బుడుగుల్ని చేసేయాలి, బాపుగారి బొమ్మల రామాయణంలో ముంచేయాలి. ఇవీ నచ్చలేదా. ఇంకేం అందరూ మంచి ఊహకర్తలు, వ్యూహకర్తలు అయితే సరి. చదరంగం, పచ్చీస్‌లు ఆడించేయడమే. చిన్నతనంలో ఆటల్లో సరదాగా ఎంత తొండి చేసేవాళ్లమో పిల్లలు తెలుసుకుంటే పరవశించిపోరూ! అందరి బాల్యమూ ఒకటే అనుకోరూ! ‘ఇరుకు అపార్ట్‌మెంట్లు... పిల్లలు ఆడుకోవడానికి చోటు లేదు... మా చిన్నప్పుడు చక్కగా మైదానంలో ఆడుకునేవాళ్లం...’ అంటూ అందరాని గతాన్ని తలచుకుంటూ వగచే కంటే, ఇంటిని ఆటస్థలంగా మార్చేయడమే. చాక్‌పీస్‌తో నేలమీద పచ్చీస్ గీయమంటే, పిల్లలు ఉత్సాహం పరుగులు తీసి, తమలోని కళాకారుడిని మేల్కొలిపి, అందరూ రవివర్మలు అయిపోతారు. వీరీ వీరీ గుమ్మడి పండు అంటూ పిల్లల్ని అందరినీ తలుపుల వెనకాల, దుప్పట్ల ముసుగులో దాచేస్తే, వాళ్లని కనిపెట్టవలసిన వాడు పెద్ద షెర్‌లాక్ హోమ్స్‌గానో, జేమ్స్‌బాండ్‌గానో, డిటెక్టివ్‌గానో మారిపోడూ. చింత గింజలను కుప్పలా పోసి, నోటితో ఉఫ్ అంటూ ఊదించి, ఒక గింజకు ఒక గింజ తగలకుండా ఏరుకుని కుప్పలు చేసుకోమంటే, పిల్లలు సెల్‌ఫోన్‌ను పక్కన పడేయకపోతారా! వామన గుంటలలో చింత గింజలు వేస్తూ లెక్కించడం నేర్పిస్తే, కాలిక్యులేటర్‌ను కర్చీఫ్‌తో కప్పెట్టేయరూ! వైకుంఠపాళి ఎవర్ గ్రీన్. నిచ్చెన ఎక్కగానే ‘ఆహా’ అని, పాము నోట్లో పడగానే ‘అయ్యో’ అనకుండా ఉండగలరా. రాక్షసుల పేర్లు నేర్చుకోరా. అరుకాసురుడంటే భయపడుతూ, వాడిని దాటగానే సంబరపడుతూ, పండిపోగానే బుజ్జి బుజ్జి చేతులతో చప్పట్లు చరుస్తూ, కలువ రేకుల ముఖాలను మరింత విప్పార్చరూ!
– డా. పురాణపండ వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment